- సీపీఐ జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం అరెస్ట్
- పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
అక్షరశక్తి, హన్మకొండ : హన్మకొండలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓరుగల్లు జిల్లాలో నిర్వహిస్తున్న భూ పోరాటానికి మద్దతు తెలిపేందుకు వచ్చిన సీపీఐ జాతీయ నాయకుడు, ఎంపీ బినోయ్ విశ్వంను పోలీసులు అడ్డుకుని, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వరంగల్ జిల్లాలో వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూపోరాటానికి మద్దతు పలికేందుకు బుధవారం భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నేత, ఎంపీ బినోయ్ విశ్వం హన్మకొండకు వచ్చారు. నక్కలగుట్ట హరిత కాకతీయ హోటల్ ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. అనంతరం పేదలు గుడిసెలు వేసుకున్న భూముల వద్దకు వెళ్తుండగా, అప్పటికే పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు సీపీఐ నాయకులను అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎంపీ బినోయ్ విశ్వంతోపాటు పార్టీ నేతలు హోటల్‌లోనే బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేరళ మాజీ మంత్రి, ఎంపీని అడ్డుకోవడం అప్రజాస్వామికం అని నేతలు మండిపడ్డారు. ఈక్రమంలోనే హరిత కాకతీయ హోటల్ నుంచి ఎంపీతో పాటు సీపీఐ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పేదలందరికీ భూములు పంచాలి
అంతకుముందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎంపీ బినోయ్ విశ్వం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో భూ సమస్య ప్రధానమైనదని, స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు అవుతున్నా నేటికీ పేదలకు భూమి దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ వాటిని అమలు చేయడంలో విఫలం అయిందన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలందరికీ డబుల్ బెడ్‌రూంలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. పాలకుల వైఫల్యం వల్లే మళ్లీ భూపోరాటాలు పురుడుపోసుకుంటున్నాయన్నారు. 1971లో కేరళ రాష్ట్రంలో భూస్వామ్య పద్ధతిని రద్దు చేసి, పేదలందరికీ భూములు పంచారని గుర్తు చేశారు. వరంగల్ నగరంలో అనేక చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయని, ప్రభుత్వ పెద్దల అండతో రియల్ ఎస్టేట్ మాఫియా చెలరేగిపోతోందని ఆరోపించారు. పేదలందరికీ భూములు పంచేవరకూ పోరాటం ఆపేదే లేదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, మేకల రవి, హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, నేదునూరి జ్యోతి, మంద సదాలక్ష్మి, నాయకులు మారపాక అనిల్, ఉట్కూరి రాములు, ఆదరి శ్రీనివాస్, పంజాల రమేశ్, షేక్ బాషుమియా, పనాస ప్రసాద్, గిన్నారపు రోహిత్, ల్యాదళ్ల శరత్, దండు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.