Wednesday, June 19, 2024

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

Must Read
  • వ‌రంగ‌ల్ జిల్లా అశోక్‌న‌గ‌ర్ స‌మీపంలో ట్రాక్ట‌ర్ బోల్తా..
  • అక్క‌డిక్క‌డే ముగ్గురి దుర్మ‌ర‌ణం
  • ద‌వాఖాన‌కు త‌ర‌లిస్తుండ‌గా మ‌రో ఇద్ద‌రు మృతి
  • వ‌రంగ‌ల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ఏడుగురు క్ష‌త‌గాత్రులు
  • ముగ్గురి ప‌రిస్థితి విష‌మం ?
  • పెళ్లి సామాగ్రి కోసం వెళ్తుండ‌గా దుర్గ‌ట‌న‌
  • ప‌ర్శ్య తండాలో తీవ్ర విషాదం
  • ప‌రారీలో ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్‌

అక్ష‌ర‌శ‌క్తి , ఖానాపురం : వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్ర‌మాద‌వ‌శాత్తు ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురు మృతి చెందారు. మ‌రో ఏడుగురు తీవ్రంగా గాయ‌ప‌డి వ‌రంగ‌ల్ ఎంజీఎం ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఖానాపురం మండలం అశోక్‌నగర్ శివారులో ఈ ప్రమాదం జ‌రిగింది. గ్రామ స‌మీపంలోని దుస‌ముద్రం చెరువు కట్ట మీదుగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుత‌ప్పి బోల్తా పడ‌టంతో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతులంతా ఒకే తండాకు చెందిన కూలీలు. ఈనెల 24న బంధువుల పెళ్లి ఉండ‌గా, సామ‌గ్రి కోసం న‌ర్సంపేట‌కు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. డ్రైవ‌ర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ నిర్ల‌క్ష్యంగా వాహ‌నం న‌డ‌ప‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జరిగిన‌ట్లు స‌మాచారం.

అస‌లేం జ‌రిగింది..

వ‌రంగ‌ల్ జిల్లా ఖానాపురం మండ‌లం అశోక్‌న‌గ‌ర్ గ్రామ స‌మీపంలోని ప‌ర్శ‌తండాకు చెందిన గుగులోత్ ధ‌న్‌సింగ్ కూతురు పెండ్లి ఈనెల 24న నిశ్చ‌య‌మైంది. పెళ్లి బ‌ట్ట‌ల‌తోపాటు సామాగ్రి కొనుగోలు చేసేందుకు తండాకు చెందిన ధ‌న్‌సింగ్ భార్య‌తోపాటు బంధువులు మొత్తం 12 మంది ట్రాక్ట‌ర్‌లో న‌ర్సంపేట‌కు బ‌య‌లుదేరారు. తండాకు అశోక్‌న‌గ‌ర్‌కు మ‌ధ్య‌నున్న దుస‌ముద్రం చెరువు కట్టపైకి రాగానే ఒక్క‌సారిగా ట్రాక్టర్ అదుపుత‌ప్పి పొలాల్లోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జాటోత్ బుచ్చ‌మ్మ (53), గుగులోత్ సీత (45), గుగులోత్ శాంత‌మ్మ (45) అక్కడికక్కడే మ‌ర‌ణించారు. న‌ర్సంపేట ద‌వాఖాన‌కు త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మ‌రో ఇద్ద‌రు జాటోత్ గోవిందు (55), గుగులోత్ స్వామి (48) చ‌నిపోయారు. మిగతా ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా, మెరుగైన చికిత్స కోసం వ‌రంగ‌ల్ ఎంజీఎం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. వీరిలో ముగ్గురి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ అజాగ్ర‌త్త‌గా వాహ‌నం న‌డ‌ప‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని క్ష‌త‌గాత్రులు పేర్కొన్నారు. పెండ్లి సామ‌గ్రి కోసం వెళ్తూ ట్రాక్ట‌ర్ ప్ర‌మాదంలో ఏడుగురు తండావాసులు మ‌ర‌ణించ‌డంతో ప‌ర్శ్య‌తండాలో తీవ్ర విషాదం నెల‌కొంది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్ ప‌రారీలో ఉన్నాడు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img