అక్షరశక్తి వరంగల్: శనివారం కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధ్యక్షతన జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, విద్యావేత్తలు, న్యాయవాదులు నిపుణులతో నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మేల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు, రైతులకు ప్రయోజనకారిగా ఉండే విధంగా ఆర్ ఓ ఆర్ ముసాయిదా చట్టాన్ని తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఎన్నో రాష్ట్రాల భూ చట్టాలను సమగ్రంగా అధ్యయనం చేసి తీసుకొస్తున్న కొత్త ఆర్ ఓ ఆర్ చట్టం భవిష్యతరాలకు ఉపయోగపడనుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారం కోసం నూతన ఆర్వోఆర్ చట్టం రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని, దేశంలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమమైన భూ రికార్డుల నిర్వహణ పరిశీలించిన నిపుణుల బృందం నూతన ఆర్వోఆర్ 2024 ముసాయిదా బిల్లును రూపొందించిందని కలెక్టర్ తెలిపారు. నూతన చట్టం రూపకల్పనలో విస్తృతంగా ప్రజలను భాగస్వామ్యం చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నామని అన్నారు. భూ రికార్డుల నిర్వహణకు మెరుగ్గా ఉండే విధంగా ముసాయిదా బిల్లు పై రైతు సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు తమ సూచనలను అందజేయాలని కలెక్టర్ కోరారు. నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై సలహాలు సూచనలు ఏమైనా ఉంటే రాతపూర్వకంగా 2,3 రోజులలో కలెక్టరేట్ కార్యాల యానికి అందిస్తే, వాటిని ఒక నివేదిక రూపంలో సిద్ధం చేసి తుది చట్ట రూపకల్పన కోసం ప్రభుత్వానికి అందజేస్తామని కలెక్టర్ అన్నారు. ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న
ఆంధ్రప్రదేశ్ ఆదనవు జాయింట్ కలెక్టర్ విఠల్, విశ్రాంత రెవిన్యూ అధికారి సురేష్ కోతార్, సీనియర్ సైంటిస్ట్ మల్లేశం, ప్రభుత్వ ప్లీడర్ నర్సింహ రావు, టిజిటీఏ అధ్యక్షులు మహ్మద్ ఇక్బాల్ , ట్రెసా అధ్యక్షులు రియజోద్దీన్, న్యాయవాదులు తమ తమ సూచనలు సలహాలు తెలిపారు. గ్రామాలలోని ఆబాది భూ రికార్డులు అప్డేట్ చేయాలని, పోజిషన్ కాలం ఉండాలని, అప్పిలేట్ అథారిటీ ఆర్డిఓ స్థాయిలో ఉండాలని, భూదార్ నంబర్ తొలగించాలని, ఆపిల్ కాల పరిమితిని 30 నుండి 90 రోజులకు పెంచాలని అన్నారు. 1971 సంవత్సరంలో ఆర్వోఆర్ చట్టం తెస్తే 1989 లో రూల్స్ అందించారని, 2020 ఆర్వోఆర్ చట్టానికి ఇప్పటివరకు రూల్స్ తయారు చేయలేదని, నూతన ఆర్వోఆర్ చట్టం 2024 అమలు చేసిన నెలరోజుల లోపల రూల్స్ రూపొందించాలని తెలిపారు. నూతన ఆర్వోఆర్ చట్టం అమలు కోసం ప్రతి గ్రామంలో రెవెన్యూ ఉద్యోగి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, భూ సమస్యల అప్పిలేట్ అథారిటీ జిల్లా స్థాయిలోనే ఉండే విధంగా చూడాలని తెలిపారు. ఈ చర్చ కార్యక్రమంలో సీనియర్ సైంటిస్ట్ మల్లేశం, ప్రభుత్వ ప్లీడర్ నర్సింహ రావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జీవన్ గౌడ్, సెక్రెటరీ ముదస్సిర్ అహ్మద్, విద్యాసాగర్, తహసిల్దార్ లు, నిపుణులు, న్యాయవాదులు, రైతులు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు సంబంధిత అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై చర్చ కార్యక్రమం- కలెక్టరేట్ సమావేశ మందిరం వరంగల్
Must Read