Monday, September 16, 2024

ప‌ర‌కాల‌లో మంత్రి పొంగులేటి ప‌ర్య‌ట‌న‌

Must Read

అక్షర శక్తి పరకాల: తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో రూ.5కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులు, రూ.11.74 కోట్లతో అమృత్ 2.0 పథకానికి సంబంధించిన పనుల ప్రారంభోత్సవానికి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా పరకాలకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరుకోగా స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, తదితరులు పూల మొక్కలు, పుష్పగుచ్చాలను అందించి ఘనంగా స్వాగతం పలికారు. మున్సిపాలిటీ ఆవరణలో అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పరకాల మున్సిపాలిటీ కార్యాలయంలో పరకాల శాసనసభ నియోజకవర్గ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు.అనంతరం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్ లో కూడా టెక్స్టైల్ పార్క్ తో పాటు అభివృద్ధి అంశాలపై సమీక్షించినట్లు చెప్పారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ తో ఈ ప్రాంత అభివృద్ధి రూపురేఖలు మారనున్నాయని అన్నారు. రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల కొరియా పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి టెక్స్టైల్ పార్క్ కు సంబంధించి పెద్ద కంపెనీలతో చర్చలు జరిపారని, ఆయా సంస్థల ప్రతినిధులు కొద్ది రోజుల్లో ఇక్కడ పర్యటించి టెక్స్టైల్ పార్కులో పరిశ్రమలు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఇది శుభవార్త అని అన్నారు.వరంగల్, హనుమకొండ మీదుగా వెళ్తున్న జాతీయ రహదారికి భూ సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం విలువైన భూములు అనేది వాస్తవమని, ప్రజలకు, రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా పరిహారం అందిస్తామన్నారు. భూములు ఇస్తున్న రైతులకు మంచి పరిహారం అందిస్తుందని, ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రజలకు రైతులకు అనుకూలంగా ఉండే విధంగా మంచి పరిహారం అందించాలని ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు. హైవే కోసం భూములు ఇస్తున్న రైతులకు 40 శాతం వరకు పరిహారం అందించినట్లు పేర్కొన్నారు. మిగతా పరిహారాన్ని అందించేందుకు స్థానిక శాసనసభ్యులు, ఇతర ముఖ్య నాయకులతో కలిసి రాబోయే కొద్ది రోజుల్లో గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం కావాల్సిన మొత్తం ఏరియాను కేంద్ర ప్రభుత్వానికి, ఎన్.హెచ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందజేయనున్నట్లు తెలిపారు. వాటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తుందన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జల యజ్ఞం కార్యక్రమంలో భాగంగా కోనయమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ కోసం సుమారుగా రూ. 41 కోట్లను మంజూరు చేశారని చెప్పారు. పనులను పూర్తి చేసేందుకు ఏజెన్సీని కూడా ఫైనల్ చేశారని అన్నారు. అప్పుడు ఒకపక్క గోదావరి పరివాహక ప్రాంతం, మరో పక్క కృష్ణా పరివాహక ప్రాంతంలోని రిడ్జ్ లో ఈ లిఫ్టు ఉంటుందని, కాకతీయ కెనాల్ మీద లిఫ్టు ఏర్పాటు చేయడం కోసం ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత గత ముఖ్యమంత్రి హయాంలో ఈ పనులకు సుమారుగా రూ.114 కోట్లకు పెంచారని పేర్కొన్నారు. 14వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు కొంతవరకైతే పనులను పూర్తి చేశారని , వాటికి మోటార్లను కొన్నారని, కాని వాటిని కనీసం డ్రై రన్ కూడా చేయలేదన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఆ లిఫ్టు ఇరిగేషన్ను ఈ ప్రభుత్వం ప్రారంభించబోతుందని ఈ ప్రాంత రైతులకు ఇక్కడి నుండి తెలియజేస్తున్నానని అన్నారు. గత ప్రభుత్వం పరకాల లోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆర్భాటంగా మొదలుపెట్టిందని అన్నారు. ఆసుపత్రిలో భవనం పైపెచ్చులు ఊడిపడుతూ ప్రమాదకరంగా మారిందని స్థానిక ఎమ్మెల్యే, అధికారులు చెబుతున్నారని వెంటనే పాత ఆసుపత్రిని తరలించి వైద్య సేవలు అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. రాబోయే నెల రోజుల్లోనే ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్ను పూర్తి చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. పరకాల మున్సిపాలిటీ ని ఆనుకుని ఉన్న సమీపంలోని చెరువు అలుగు పోస్తుండడంతో అక్కడి నుండి నీరంతా పరకాలను ముంచేత్తుతుందన్నారు. దానికి సంబంధించిన డ్రైన్ సరైన వెడల్పు, పొడవు లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం రూ.4కోట్లతో పనులను సరైన విధంగా టెక్నికల్గా చేపట్టలేదన్నారు. భవిష్యత్తుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరైన విధంగా డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గ్రామాలకు పట్టణాలకు మంచినీరు అందించేందుకు అమృత్ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందించాల్సి ఉండగా ఆనాటి ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తామని అన్నారని తెలిపారు. ఇటీవల మిషన్ భగీరథ కు సంబంధించి సర్వే నిర్వహించగా 51శాతం మంచి నీరు రావడం లేదని ఆ సర్వేలో తేలిందన్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు, ఇళ్లకు స్వచ్ఛమైన తాగునీటిని తమ ప్రభుత్వం అందజేస్తుందన్నారు. దీనిలో భాగంగానే 11 కోట్లకు పైగా నిధులతో పరకాలలో అమృత్ పథకానికి ప్రారంభోత్సవం చేసినట్లు తెలిపారు. అభివృద్ధిని సంక్షేమాన్ని సమతులంగా రాష్ట్రంలో చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మంజూరైన 11 కోట్ల రూపాయలతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు, డ్రైనేజీ, తదితర అభివృద్ధి పనులను పూర్తిస్థాయి వివరాలతో కూడిన ప్రగతి నివేదికతో చేపడితే బాగుంటుందని అన్నారు. మెగా టెక్స్టైల్ పార్క్ కోసం భూముల కోల్పోయిన రైతులకు ఇండ్లను కేటా స్తామని ముఖ్యమంత్రి ప్రకటించా రని వెంటనే వారి పేర్ల జాబితాను అధికారులు రూపొందించి ఇవ్వాలన్నారు. సెప్టెంబర్ మూడో వారంలో మెగా జాబ్ మేళాను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. మెగా జాబ్ మేళా తో టెక్స్టైల్ పార్క్ లో ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై ఇంచార్జ్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టిని పెట్టారని అన్నారు. ఉమ్మడి జిల్లాను మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ నేషనల్ హైవే కోసం పరకాల నియోజకవర్గ పరిధిలో భూ సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. భూములు ఇచ్చిన ఆయా గ్రామాల రైతులకు పరిహారం అందించినట్లు తెలిపారు. మిగతా రైతులకు పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. పరిహారం విషయంలో ఆయా గ్రామాల రైతులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా వరద ముంపు ప్రభావం తప్పేవిధంగా పరకాలలో నాలా విస్తరణ పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ పరకాల నియోజకవర్గం పరిధిలో కోనాయమాకుల లిఫ్ట్ ఇరిగేషన్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, నేషనల్ హై వే ఉన్నాయన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కు సంబంధించి ఐదు కంపెనీలతో ఎం ఓ యు లు అయ్యాయని పేర్కొన్నారు. 52 కంపెనీలతో ఒప్పందాలు కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ ఛైర్ పర్సన్ అనిత, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, పరకాల ఆర్డీవో డాక్టర్ కె. నారాయణ, మున్సిపాలిటీ కమిషనర్ నరసింహ, తహసిల్దార్లు, ఇతర శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img