- ఎమ్మెల్సీ సిరికొండకు వరుస అవమానాలు
- మొన్న కవిత సమక్షంలో, ఇటీవల కేటీఆర్ సభలో
స్థాయి తగ్గించేందుకు కుయుక్తులు - ఎదురులేని నేతగా ప్రజల్లో మధుసూదనాచారికి ప్రత్యేక గుర్తింపు
- ఉద్యమనేతగా, ప్రగతి ప్రదాతగా అపార గౌరవం
- జీర్ణించుకోలేని సొంతపార్టీ నేతలు ?
- ప్రాధాన్యం తగ్గించేందుకు ప్రయత్నాలు !
- ఆగ్రహంతో రగిలిపోతున్న అభిమానులు
- రసవత్తరంగా భూపాలపల్లి నియోజకవర్గ రాజకీయం
అక్షరశక్తి, భూపాలపల్లి : సిరికొండ మధుసూదనాచారి.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ విలక్షణ నేత. అజాత శత్రువుగా పేరున్న ఆయన పదవిలో ఉన్నా.. లేకున్నా.. నిత్యం ప్రజల మధ్య ఉంటారు. జనంతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నేటి దాక కేసీఆర్ వెంట నడిచిన అతి కొద్ది మంది నేతల్లో ఆయన ప్రముఖులు. పార్టీ ఏర్పాటులోనూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలోనూ కీలక భూమిక పోషించారు. 2014 సాధారణ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేగాక తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్‌గా అత్యంత ప్రాధాన్యత గల పదవి చేపట్టిన బీసీ నేతగా రికార్డు సృష్టించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతోపాటు ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడిగా, వీర విధేయుడిగా గుర్తింపు దక్కించుకున్న ఆయన భూపాలపల్లి జిల్లా ఏర్పాటులోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే.. తాజాగా నియోజకవర్గంలో మధుసూదనాచారి ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. నియోజకవర్గంలో ఎదురులేని నేతగా తన హవా కొనసాగిస్తున్న చారిని కట్టడి చేసేందుకు తెరవెనుక కుట్ర జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. దీంతో సిరికొండ అభిమానులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ అభివృద్ధి..
భూపాలపల్లి జిల్లా, నియోజకవర్గ ప్రగతిలో మధుసూదనాచారి పాత్ర ఎంత ఉందో ఆయన చేసిన అభివృద్ధి ని చూస్తేనే తెలుస్తుంటున్నారు ఆయన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు. గతంలో ఎన్నడూ లేనంత ప్రగతి చారిసాబ్ హయాంలోనే జరిగిందని ప్రజలతోపాటు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. వందల కోట్ల నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సిరికొండకే దక్కుతుందని చెబుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో నియోజకవర్గం అంతా పర్యటించడంతోపాటు అట్టడుగు వర్గాలకు చెందిన వారి ఇండ్లలోకి వెళ్లి సమస్యలు తెలుసుకున్న ఘనత ఆయకే దక్కిందంటున్నారు. ఎస్సారెస్పీ కాలువలపై బైక్ పై తిరుగుతూ చివరి ఆయకట్టుకు సాగు నీరందించారని, గతంలో ఎవరూ చేయని సాహసం చేసి చెంచులను బయట ప్రపంచానికి పరిచయం చేయడంతోపాటు వారికి ఇళ్లను నిర్మించారని పేర్కొంటున్నారు. కోతులతో జీవనం సాగించే కోతులోల్లకు ప్రత్యేక కాలనీనే కట్టించి అందరి చేత ప్రశంసలు పొందారని చెబుతున్నారు. అంతేగాక వందల కోట్ల నిధులతో నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో సీసీ రహదారులు నిర్మాణం చేపట్టారని, 35 ముదిరాజ్ కమ్యూనిటీ హాళ్లను నిర్మించారని, కొత్తగా 45 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయించిన ఘనత సిరికొండకే దక్కిందని అంటున్నారు.
20 రోజులు నియోజకవర్గంలోనే ..
రామప్ప – ఘన్పూర్ చెరువులను అనుసంధానం చేసి తాగు సాగునీటి కష్టాలను లేకుండా చేయడంలో సిరికొండ పాత్ర అతి ముఖ్యమైనది. వర్షాకాలం వచ్చిందంటే చాలు లోలెవెన్ వంతెనలతో ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయే గ్రామాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో నూతన బ్రిడ్జిలను నిర్మించారు. ప్రతి గ్రామానికి లక్షలాది రూపాయలు కేటాయించి వాటి అభివృద్ధికి బాటలు వేశారు. స్పీకర్‌గా మధ్యాహ్నం రెండు గంటల వరకు శాసనసభ నడిపిన మధుసూదనాచారి సాయంత్రం 5 గంటల వరకు భూపాలపల్లి చేరుకుని రాత్రి 11 గంటలకు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేశారని పేర్కొంటున్నారు. శాసనసభ్యుడిగా, స్పీకర్‌గా నెలకు 20 రోజులు నియోజకవర్గంలోనే కాలికి బలపం కట్టుకొని తిరిగారని, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పని చేశారని నియోజకవర్గ ప్రజలు కొనియాడుతున్నారు.
ఎందుకీ విష ప్రచారం ?
తెలంగాణ తొలి స్పీకర్, ప్రస్తుతంగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్న సిరికొండ మధుసూదనాచారిపై ఇటీవల విష ప్రచారం కొనసాగుతోందని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేర ప్రజల గుండెల్లో నిలిచిన సిరికొండను కొందరు కావాలనే వారి నుంచి దూరం చేసే పన్నాగం పన్నుతున్నారని చారి అభిమానులు మండిపడుతున్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదనాచారిపై కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో గెలిచిన, ఓడిన అభ్యర్థులు ఇద్దరూ ఒకే పార్టీలో ఉండడంతో 2023లో జరిగే సాధారణ ఎన్నికల్లో టికెట్ ఎవరికి లభిస్తుందన్న ప్రశ్న అటు పార్టీలో, ఇటు నియోజకవర్గంలో ప్రజలను తొలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అండదండలతో మధుసూదనాచారికే టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికే టికెట్ వస్తుందన్న ప్రచారం కూడా బలంగా ఉంది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది.
ఆధిపత్యాన్ని తగ్గించేందుకే..
ఇటీవల కేటీఆర్ భూపాలపల్లి పర్యటన సందర్భంగా సిరికొండ మధుసూదనాచారిని అవమానించారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత పర్యటనలో కూడా టీబీజీకేఎస్ భవన్ నిర్మాణ శంకుస్థాపన ఫలకంలో సిరికొండ పేరు లేకపోవడం ఆయన అనుచరులను ఆగ్రహానికి గురిచేసింది. అప్పుడు కూడా చారి అనుచరులు కవిత ముందే నినాదాలతో హోరెత్తించారు. కావాలనే చారి ప్రాధాన్యతను తగ్గించడానికి ఒక వర్గం ప్రయత్నం చేస్తుందన్న చర్చ జోరుగా జరుగుతుంది. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం సిరికొండ మధుసూదనాచారి పేరు ఎక్కడా లేకుండా చేస్తున్నారని మధుసూదనాచారి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇక మంత్రి కేటీఆర్ సభలోనూ ఆధ్యంతం బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు కనిపించడం కలకలంరేపింది. మొత్తానికి ఒకప్పుడు భూపాలపల్లి నియోజకవర్గంలో ఏకచిత్రాధిపత్యంగా ఉన్న సిరికొండ మధుసూదనాచారి ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుందని స్థానికంగా చర్చ జరుగుతుంది.