అక్షర శక్తి పరకాల: గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని పరకాల పట్టణాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారం అవసరమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. పరకాల పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ అధ్యక్షతన పలు అభివృద్ధి పనుల పై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరించరాదాని హెచ్చరించారు. అదేవిధంగా వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అభివృద్ది పనుల పురోగతి గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల వారీగా వాటి పురోగతి, తదితర వివరాలతో ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. మున్సిపాలిటీలో పెండింగ్ పనులను త్వరలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు. వర్షా కాలం కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, డ్రైనేజీలను విధిగా శుభ్రం చేసి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రెగూరి విజయపాల్ రెడ్డి, పలువురు కౌన్సలర్లూ, మున్సిపల్ కమిషనర్ నరసింహ, సిబ్బంది పాల్గొన్నారు.