Saturday, July 27, 2024

ప్రీతి కేసులో కీల‌క మ‌లుపు…. నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి సైఫ్ ..

Must Read

 

అక్షరశక్తి, హన్మకొండ క్రైమ్ : కేఎంసీ మెడికో ధ‌రావత్ ప్రీతి మృతి కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. డాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన ఎంఏ సైఫ్‌కు నాలుగు రోజులు పోలీస్ కస్టడీకి ఆదేశిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్ట్ ఇన్చార్జి జడ్జి సత్యేంద్ర ఆదేశాలిచ్చారు. ఈ కేసులో లోతైన విచారణ కోసం సైఫ్ ను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. పోలీసుల అభ్యర్థునతో ఏకీభవించిన జడ్జి గురువారం నుంచి ఆదివారం వరకు సైఫ్‌ను కస్ట‌డీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ నాలుగు రోజుల సైఫ్ కస్టడీతో ప్రీతి మృతి కేసులో కీలక సాక్షాలు దొరికే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఈక్ర‌మంలోనే మ‌ట్టెవాడ పోలీసులు విచారణ నిమిత్తం సైఫ్‌ను ఖమ్మం జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు. కాగా సైఫ్‌ దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ పెండింగ్‌లో ఉంది.
ప్రీతిని సైఫ్ ర్యాగింగ్ చేశాడు.. కమిటీ నిర్ధారణ
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ప్రీతి మరణంపై యాంటీ ర్యాగింగ్ కమిటీ బుధవారం సమావేశమైంది. దాదాపు నాలుగు గంటలపాటు కమిటీ సభ్యులు పలు అంశాలపై చర్చించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ప్రీతిని సైఫ్ మానసికంగా వేధించాని, ఇది కచ్చితంగా ర్యాగింగ్ కిందకి వస్తుందని, ర్యాగింగ్ జరిగిందని కమిటీ నిర్ధారించింది. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ అధ్యక్షతన మొత్తం 13 మంది యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి ముందు ఏం జరిగింది, అందుకు గల కారణాలపై కీలకంగా చర్చ జరిగింది.
ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చామన్న హెచ్ఓడీ
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో గత ఏడాది నవంబర్ 18న ప్రీతి అడ్మిషన్ పొందింది. అయితే సీనియర్ సైఫ్, ప్రీతికి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి అనే అంశంపై కమిటీ చర్చించింది. జీఎంహెచ్ ఆసుపత్రిలో అనస్తీషియా రిపోర్ట్ విషయం ఒక్కటే సైఫ్, ప్రీతికి మధ్య గొడవకు కారణం కాదని తేలింది. సైఫ్ తనను టార్గెట్ చేసి వేధిస్తున్నాడని హెచ్ఓడీ నాగార్జున రెడ్డికి ప్రీతి ఫిర్యాదు చేసింది. ఏడుస్తూ తనకు తలెత్తిన సమస్యను, వేధింపులను ప్రీతి ఫిర్యాదు చేసినట్లు హెచ్ఓ‌డీ వెల్లడించారు. దీనిపై ప్రీతి, సైఫ్ ను పిలిచి కొందరు వైద్యుల సమక్షంలో ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి జాగ్రత్తగా నడుచుకోవాలని సూచించినట్లు యాంటీ ర్యాగింగ్ కమిటీకి హెచ్ వోడీ తెలిపారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చిన తరువాత సైతం ప్రీతిని సైఫ్ వేధించాడని కమిటీ గుర్తించింది. కనుక మానసిక వేధింపులు సైతం ర్యాగింగ్ కిందకే వస్తుందని, ర్యాగింగ్ జరిగినట్లు ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. అయితే మానసిక వేధింపులు జరిగాయి, కానీ లైంగిక వేధింపులు లేవన్నారు. ఇదే నివేదికను ఢిల్లీలోని యూజీసీతో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు పంపిస్తామని చెప్పారు. పైనుంచి వచ్చే ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img