- కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం డాక్టర్ రామకృష్ణ ప్రయత్నాలు
- పార్టీ అగ్రనేతల దృష్టిలో పేరు
- విద్యార్థి దశ నుంచే పార్టీతో ప్రయాణం
- ఏఐపీసీలో వరంగల్ నుంచి కీలక పాత్ర
- నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటన
- వైద్యుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, సామాజిక సేవకుడిగా ప్రజల్లో గుర్తింపు
అక్షరశక్తి, హన్మకొండ : వరంగల్ లోక్‌సభ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకూ పోటీ పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ముమ్మర కసరత్తు చేస్తున్న నేపథ్యంలో హన్మకొండకు చెందిన ప్రముఖ వైద్యుడు, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన.. ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన వరంగల్ ఎంపీ టికెట్ దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని పరకాల, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, భూపాలపల్లి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపులో తనవంతు కృషి చేశారు. ఈ క్రమంలోనే పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తోపాటు రాష్ట్ర కీలక నేతలనూ ఆయన కలిసారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యావంతుడిగా, ప్రముఖ వైద్యుడిగా, సామాజిక సేవకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఎమ్మార్పీఎస్(టీఎస్) నేతగా.. జనంలో గుర్తింపు పొందిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ పేరు పార్టీ పెద్దల దృష్టిలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
మొదటి నుంచీ కాంగ్రెస్ కుటుంబమే..
డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ స్వగ్రామం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం. మొదటి నుంచీ కాంగ్రెస్ నేపథ్య కుటుంబమే. బీపీటీ, ఎంపీటి, సీడీఎన్‌టీ, ఎంటీసీ, ఎంఎస్సీ సైకాలజీ పూర్తి చేసిన డాక్టర్ రామకృష్ణ.. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం సాగిస్తున్నారు. ప్రస్తుతం హన్మకొండలో మల్టీస్పెషలిటీ ఆస్పత్రిలో పేదలకు ఉచిత వైద్యం అందిస్తూ.. ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్(ఏఐపీసీ) వరంగల్ చాప్టర్‌తోపాటు ఎస్సీ విభాగం చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధాలానాలమీద ఉద్యమం చేస్తే ఎన్నో అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా నిత్యం బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహకారంతో జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి గారితో కలిసి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలనలో భాగంగా, ప్రజల కోసం పార్టీ బలోపేతం కోసం మంత్రులు కొండా సురేఖ సీతక్క ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, యశస్విని రెడ్డి, దొంతి మాధవరెడ్డిలతో కలిసి కృషి చేస్తున్నారు. అంతేగాకుండా, ఎమ్మార్పీఎస్(టీఎస్) ఉద్యమంలోనూ పెరుమాండ్ల రామకృష్ణ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2016 నుంచి ఎమ్మార్పీఎస్(టీఎస్) మెడికల్ ఫోరమ్ రాష్ట్ర కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలాగే, 104 ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. డాక్టర్ రామకృష్ణ 1999 నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ, రాయల్ యూత్ అసోసియేషన్, పెరుమాండ్ల చారిటబుల్ ట్రస్టు స్థాపించి, వ్యవస్థపాక చైర్మన్‌గా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల ఫోరమ్ చైర్మన్ గా ఉద్యమకారులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ, మెడికల్ జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా స్వరాష్ట్ర సాధన కోసం పోరుబాటపట్టారు. విస్తృతంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా, అనేక సార్లు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. మరెన్నోసార్లు అరెస్టు అయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ వద్ద పోలీసుల డమ్మీ బుల్లెట్ల వర్షంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలా ఎన్ని నిర్బంధాలు ఎదురైనా.. వెనకడుగు వేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జేఏసీ నాయకుడిగా పెరుమాండ్ల రామకృష్ణ ముందుకుసాగారు. ఆ తర్వాత స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేశారు. 2016లో గాంధీ ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టు ఉద్యోగానికి రాజీనామా చేశారు. హన్మకొండలో పేదలకు సేవ చేయటమే లక్ష్యంగా ఆస్పత్రి నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలపై కార్యక్రమాలు చేపట్టి ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా ప్రజల్లోకి వెళ్లారు. 2007 నుంచి ఫిజియోథెరపి డాక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్‌గా కొనసాగుతున్న రామకృష్ణకు అన్నివర్గాల ప్రజలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ తనకు కలిసివస్తాయన్న ధీమాలో ఉన్న ఆయన.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపి స్థానం నుంచి టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
అనేక అవార్డులు..
వృత్తిలో రాణిస్తున్న డాక్టర్ పెరుమాండ్ల రామృష్ణకు రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అనేక అవార్డులు దక్కాయి. బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డును తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుకున్నారు. నేషనల్ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు, దక్షిణ భారత స్థాయిలో బాబూ జగ్జీవన్ రామ్ అవార్డు, జాతీయ స్థాయిలో ఫిజియోథెరపీ సర్వీస్ ఎక్స్‌లెన్స్ అవార్డు, అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్స్‌లెన్స్ ఇన్ ఫిజియోథెరపీ అవార్డు, గుడ్ సామరిటన్ అవార్డును కూడా డాక్టర్ రామకృష్ణ అందుకున్నారు. అంతేగాకుంగా, స్వేరోస్‌తో కలిసి.. అనేక ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం ఆయన కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో యూత్‌లోనూ డాక్టర్ పెరుమాండ్ల రామృష్ణకు మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే.. రామకృష్ణ పేరును ముఖ్యంగా కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో తనకే వరంగల్ ఎంపీ టికెట్ వస్తుందన్న ధీమాలో ఆయన ఉన్నారు. ఇందులో భాగంగానే.. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో డిజిటల్ స్క్రీన్ వాహనాలతో విస్తృతంగా పర్యటిస్తున్నారు.