- వర్ధన్నపేట బీఆర్ఎస్‌లో కీలక పరిణామాలు
- ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే అరూరికి టికెట్ డౌటే?
- గ్రూపు రాజకీయాలు చేస్తున్నారంటూ రమేష్‌పై ఆరోపణలు
- కొందరు నేతలను జనంలో పలచన చేసేందుకు యత్నం
- తీవ్ర అసంతృప్తిలో అనుచరులు
- పార్టీ అగ్రనేతలకు కీలక నాయకుల ఫిర్యాదు
- రంగంలోకి తెలంగాణ ఉద్యమకారులు
- అధిష్ఠానం ప్రత్యేక దృష్టి
- నియోజకవర్గ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయా..? వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు టికెట్ దక్కడం కష్టమేనా..? గ్రూపు రాజకీయాలతో కొందరు కీలక నేతలను జనంలో పలచన చేసే ప్రయత్నం చేస్తున్నారా..? ఇదంతా తెలిసిన అనుచరులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా..? ఆయనకు టికెట్ ఇస్తే తామ పనిచేయబోమని పార్టీ అగ్రనేతలను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అంటే తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఔననే అంటున్నాయి. నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు ఇదే అంశంపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. ముందుముందు ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన అరూరి స్థానంలోకి వరంగల్ ఎంపీగా కొనసాగుతున్న పసునూరి దయాకర్‌తోపాటు తెలంగాణ ఉద్యమ నాయకులు రాబోతున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఊరూరా గ్రూపు రాజకీయాలు..
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గంలో అరూరి రమేష్‌ను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. పలువురు నేతలు, నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు శ్రమించి గెలుపులో కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే.. రెండోసారి గెలిచిన తర్వాత అరూరి తీరులో పూర్తి మార్పులు వచ్చాయని, సెకండ్ క్యాడర్ ఎదగకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు అనుచరుల నుంచే బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య గ్రూపు రాజకీయాలతో చిచ్చుపెట్టి, ఒకరికి తెలియకుండా మరొకరికి మద్దతు ఇస్తూ, పరస్పరం పగలు పెంచుకునేలా.. కేసుల పాలు అయ్యేలా.. చేస్తున్నారనే విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి ముందే.. గ్రూపు రాజకీయాలు చేస్తే సహించేదిలేదంటూ నియోజకవర్గానికి చెందిన ఓ కీలక నేత మాస్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే తీరుతో నియోజకవర్గంలో పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని, ఆయనకు టికెట్ ఇస్తే తాము పనిచేయబోమంటూ పార్టీ అధిష్ఠానికి ఫిర్యాదు చేసేందుకు నియోజకవర్గంలోని కీలక అనుచరులు, నాయకులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
మీ ఓట్లతోనే అరూరి గెలిచిండా..!
నాయకులు, కార్యకర్తలంటే ఎమ్మెల్యే అరూరి రమేష్‌కు కనీస గౌరవం లేదంటూ పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ సమీక్షా సమావేశాలు, ఇతర పర్యటనల సందర్భంగా ఎవరైనా తమ గ్రామ అభివృద్ధి పనుల కోసం అడిగితే ఎమ్మెల్యే తీవ్ర అసహనంతో ఊగిపోతున్నట్లు సమాచారం. కొంతకాలం కిందట ఓ గ్రామంలో జరిగిన సమావేశంలో ఓ కార్యకర్తపై విరుచుకుపడినట్లు తెలుస్తోంది. నీ ఊరు ఎంత? ఉన్నవే పి…కుంట్ల ఓ వెయ్యి ఓట్లు? ఈ అరూరి రమేష్ మీ ఓట్లతోనే గెలిచిండా? మీ అవకత్ ఎంత? అంటూ మీటింగ్‌లోనే బూతుపురాణం అందుకున్నట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యే తీరుపై
కార్యకర్తలు మండిపడుతున్నట్లు తెలిసింది. పి..కుంట్ల ఊర్లే మావి.. పి..కుంట్ల ఓట్లే.. మా పి..కుంట్ల ఊర్లతో నీకేం పని.. వెళ్లిపోవాలి నీ ఘనపూర్‌కి.. అని మండి పడుతున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని కుగ్రామం ఉప్పుగల్ నుండి వచ్చిన అరూరి.. మా గ్రామాలను.. మా నాయకులను తిట్టడం ఏంటని ఎదురుదాడికి దిగుతున్నారు. అయితే, నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నా.. ఎమ్మెల్యేపై కార్యకర్తల్లో, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌వర్గాలు కూడా పార్టీ అధిష్ఠానానికి తెలిపినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో అరూరికి టికెట్ డౌటేననే టాక్ వినిపిస్తోంది.
రంగంలోకి తెలంగాణ ఉద్యమ నాయకులు?
వర్ధన్నపేట నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న బీఆర్ఎస్ అధిష్ఠానం వచ్చే ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే అరూరిని తప్పించి, ఆయన స్థానంలో మరో నాయకుడిని రంగంలోకి దింపే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే… ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పసునూరి దయకర్‌తోపాటు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నాయకులు కూడా వర్ధన్నపేట నుంచి పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికివారుగా నియోజకవర్గంలో కూడా పర్యటిస్తూ కీలక నేతలు, నాయకులు, కార్యకర్తలను కలుస్తున్నట్లు సమాచారం. వారి నుంచి కూడా సానుకూల స్పందన వస్తున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే, వర్ధన్నపేట నుంచి అరూరి రమేష్‌ను తప్పిస్తే.. మరి ఎక్కడ అవకాశం కల్పిస్తారు..? ఎమ్మెల్సీగా పంపిస్తారా..? లేక వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దించుతారా..? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే మరి.