భోజనం ఎప్పుడు తినాలి? ఎలా తీసుకోవాలి? ఎంత తినాలి? ఏమి తినాలో కూడా చాలా మందికి తెలియదంటే నమ్మండి. టైం లేదంటూ గబగబా ఐదు నిమిషాల్లో తినేసి, గటగటా నీల్లు తాగేస్తారు. అది భోజనం చేసే పద్ధతి కాదని అంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ చిలువేరు సుదర్శన్. ఆహారాన్ని ఆకలి అయినప్పుడు మాత్రమే తినాలి. కానీ చాలామంది ఆకలి ఉన్నా, లేకపోయినా భోజనం టైం అయిపోందంటూ తింటుంటారు. కానీ, దీని వల్ల అజీర్ణం వస్తుంది.
ఆ తర్వాత విరేచనాలు కావొచ్చు. పిల్లలకు ఆకలి లేకపోయినా గుచ్చిగుచ్చి తినిపిస్తుంటారు కొందరు గృహిణులు. అందుకే పిల్లలకు చీటికిమాటికి జ్వరాలు వస్తుంటాయి. వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. కాబట్టి ఆకలి ఉన్నప్పుడే భోజనం చేయాలి. మలబద్ధకం ఉన్నప్పుడు ఆకలి ఉండదు. విరేచనం కాకుండా తినాలంటే ఇష్టం ఉండదు. అందుచేత సాఫీగా ఉండడానికి ఆకుకూరలు, కూరగాయలు బాగా తినాలి. మంచినీళ్లు బాగా తాగాలి. అప్పుడే ప్రతీరోజు ఉదయం లేవగానే విరేచనమవుతుంది. ఆ తర్వాత ఆకలి కూడా బాగా అవుతుంది.