- గోచీ పెట్టుకుని బడికెళ్లేది…
- సెలవుల్లో పశువులు కాస్తూనే టెన్త్ కంప్లీట్ చేశా..
- పదో తరగతిలోనే పెళ్లి.. అయినా చదువు ఆపలే..
- తరగతిలో ఎప్పుడూ మొదటి ర్యాంకే..
- ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదివా..
- ఉమ్మడి రాష్ట్రంలోనే ఫస్ట్ డాక్టరేట్ ఆదివాసీని..
- కేయూలో ఒకేఒక్క ఆదివాసీ ఉద్యోగిని..
- భార్య ప్రోత్సాహం మరువలేను
- ప్రొఫెసర్ చింత సమ్మయ్య సార్ ఆశీర్వాదంతోనే ఈ గౌరవం
- అడవినుంచి ఆదివాసీలను వెళ్లగొట్టేందుకు ప్రభుత్వాల కుట్రలు
- కేయూ ప్రొఫెసర్, యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ
ఏండ్లు గడుస్తున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా ఆదివాసీల జీవితాల్లో మార్పురావడంలేదు. అడవినే నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీలను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయి. చదువుకున్న మాలాంటి వాళ్ల వల్ల కుటుంబాలు బాగుపడుతున్నాయి తప్ప వ్యవస్థలో మార్పు రావడంలేదు. జాతి తలరాత మారడంలేదు. ఎక్కడో మారుమూల కుగ్రామంలో పట్టిన నేను అనేక కష్టాలు ఎదుర్కొని చదువునే నమ్ముకొని ఈస్థాయికి చేరుకున్నా. ప్రభుత్వాలు మారినా, దశాబ్దాలు గడిచినా నేటికీ పరిస్థితుల్లో ఎటువంటి మార్పురావడంలేదు. మా పిల్లలకు విద్యా, వైద్యం అందడంలేదు. ఆదివాసీలను చదువుకు దూరంచేస్తున్నజీవో 13ను ప్రభుత్వం రద్దు చేయాలి. ఆదివాసీలను కూడా మనుషులుగా గుర్తించాలి, వారి హక్కులను కాపాడాలి అని అంటున్నారు కేయూ అసోసియేట్ ప్రొఫెసర్, యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న మారుమూల కుగ్రామం మడగూడ నుంచి కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఎదగడం వెనుక ఆయన పడిన కష్టం అంతా ఇంతాకాదు. గేదెలు కాస్తూ, తునికాకు సేకరించిన డబ్బులతోనే ఉన్నత చదువులు చదివారు. వెనక్కి లాగేస్తున్న ఆర్థిక పరిస్థితులు, ముందుకు నడిపించలేని కుటుంబ నేపథ్యం మధ్య ఆయన సాగించిన ప్రస్థానం నేటి యువతకు స్ఫూర్తిదాయకం.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ ఈసం నారాయణను అక్షరశక్తి పలకరించింది. ఒక్కసారిగా గతంలోకి వెళ్లిన ఆయన.. తన అనుభవాలు, అనుభూతులను పంచుకున్నారు. ప్రపంచానికే పాఠాలు చెప్పిన తనజాతి కోల్పోతున్న అస్థిత్వాన్ని తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రశ్న : మీ ఊరు, తల్లిదండ్రులు, కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం..?
జవాబు : మాది మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని మారుమూల కుగ్రామం మడగూడెం. పాఖాల నుంచి 40 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవిలో, అభివృద్ధికి ఆమడదూరంలో, సమస్యలకు సమీపంలో ఉంటుంది. నాన్న ఈసం దూలయ్య, అమ్మ రామక్క.. భార్య పేరు వెంకటలక్ష్మి. మేం మొత్తం నలుగురం సంతానం. నేనే పెద్దవాడిని. తల్లిదండ్రులకు సెంటు భూమిలేదు. పోడు వ్యవసాయమే ఆధారం, ఇప్పపూవు సేకరణతోనే కుటుంబాన్ని పోషించేవాళ్లు. నాకు చిన్నప్పటి నుంచే చదువంటే ఇష్టం. మడగూడలోనే ప్రాథమిక విద్య పూర్తయింది. గోచీ పెట్టుకుని బడికెళ్లేది. హాస్టల్‌కు పోతేనే అన్నందొరికేది. తల్లిదండ్రులు నిరక్ష్యరాస్యులు. సెలవుల్లో గేదెలు కాసేవాడిని, తునికాకు సేకరించగా వచ్చిన డబ్బులతోనే 1987లో ఎస్సెస్సీ పూర్తిచేశా.
ప్రశ్న : పదో తరగతిలోనే పెళ్లి అయినప్పటికీ చదువు ఎలా కొనసాగించారు..?
జవాబు : పదో తరగతి అవగానే మా మేన మరదలుతో పెళ్లిచేశారు. తర్వాత సంవత్సరం ఇంటివద్దే ఉన్నా. పెళ్లి చదువుకు అడ్డంకి కారాదనే భావించి 1988లో ఏపీఆర్జేసీ రాసి ఉట్నూర్‌లో 1990లో ఇంటర్ బైపీసీ పూర్తి చేశా. అక్కడ కూడా క్లాస్‌లో నేనే నంబర్ వన్. ఇంటర్ లో ఉండగానే ఐటీడీఏ ఏటూరు నాగారంలో అన్ ట్రైన్డ్ టీచర్ జాబ్‌లు పడగా, అప్లై చేశా. 22 పోస్టులకు 2వేల మంది అభ్యర్థులు పోటీపడగా పరీక్షలో నేనే ఫస్ట్ ర్యాంక్ సాధించా. ఇంటర్వ్యూకు మొత్తం 30 మంది హాజరుకాగా, నేను ఫస్ట్ ప్లేస్‌లో సెలక్ట్ అయ్యా. టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నప్పటికీ చదువును ఆపలేదు. డాక్టర్ బుర్రా రమేశ్ సార్ సలహా మేరకు 1997లో బీఈడీ కంప్లీట్ చేశా. యూనివర్సిటీలో చదివితేనే జీవితం మారుతుందని చెప్పిన డాక్టర్ జంగం చిన్నయ్య మాటలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. చిన్నయ్య సలహా మేరకు 1999లో కేయూలో పీజీ ర్యాంక్ సాధించి (ఎమ్మెస్సీ జువాలజీ) 2001లో పూర్తిచేశా. ఆ తర్వాత బయాలజీ టీచర్ (బోటనీ స్కాలర్ ) డాక్టర్ పసునూరి వజ్రయ్యసార్ సూచనల మేరకు పీహెచ్డీలో చేరాలని నిర్ణయించుకున్న. 2002లో పీహెచ్డీ జాయినై, ప్రొఫెసర్ సమ్మయ్య సార్ పర్యవేక్షలో 2006లో జువాలజీలో డాక్టరేట్ పట్టా పొందిన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఆదివాసీ కమ్యూనిటీలో ఫస్ట్ డాక్టరేట్ పట్టా పొందింది నేనే. భార్య వెంకటలక్ష్మి, గురువులందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది.
ప్రశ్న : యూనివర్సిటీలో ఉద్యోగం ఎలా వచ్చింది..? ఇప్పటి వరకు మీరు చేపట్టిన బాధ్యతలు ఏంటి ..?
జవాబు : 2007లో సుబేదారి ఆర్ట్స్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరా. 2016లో కేయూలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా జాయినయ్యా. 2022లో ప్రొఫెసర్‌గా ప్రమోషన్ పొందిన. ఆర్ట్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా, కేయూలో హాస్టళ్ల జాయింట్ డైరెక్టర్గా, ఎస్ డీ ఎల్ సీ ఈ అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్‌గా, జువాలజీ హెచ్‌వోడీగా, సెరీ కల్చర్, బయో కెమిస్ట్రీ ఇన్‌చార్జిగా, ఎన్ఎస్ఎస్ కాకతీయ యూనివర్సిటీ కోర్డినేటర్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నా.