Monday, September 9, 2024

12మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం

Must Read
  •  ప్రజలతో ఒత్తిడి చేయించుకుని రాజీనామా చేయబోతున్నారు
  • త్వరలో మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయి
  •  ఆర్టీసీని మళ్లీ ప్రైవేటుపరం చేసే కుట్ర
  •  ‘చీకోటి’ దందా వెనుక కేసీఆర్ కుటుంబ హస్తం
  •  మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించబోతోంది
  •  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 62 స్థానాలకుపైగా బీజేపీ కైవసం
  •  బీజేపీకి 40 నుండి 53 శాతం వరకు ఓట్లొస్తాయని సర్వే నివేదికలు చెబుతున్నాయి
  •  మీడియాతో ఇష్టాగోష్టిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నుండి 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కేసీఆర్ కుటుంబంపై అనేక ఆరోపణలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదనే నిర్ణయానికి ఆయా ఎమ్మెల్యేలు వచ్చారన్నారు. త్వరలోనే మునుగోడు తరహాలోనే తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు. అందులో భాగంగా తమ తమ నియోజకవర్గ ప్రజల చేత ఒత్తిడి చేయించుకుని ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయబోతున్నారని పేర్కొన్నారు. చీకోటి ప్రవీణ్ కుమార్ క్యాసినో దందా వెనుక కేసీఆర్ కుటుంబ హస్తంతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హస్తం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. నయీం కేసుతోపాటు మొత్తం వ్యవహారంపై బీజేపీ అధికారంలోకి వచ్చాక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నయీం ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కొనుగోలు చేయొద్దని… ఒకవేళ ఎవరైనా ఆ పని చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడతారని హెచ్చరించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేసిన బండి సంజయ్ ఈ ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దబోయే ఎన్నిక కాబోతోందని పేర్కొన్నారు.

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుండి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారని… అదే సమయంలో ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ విధానాలను పలుమార్లు ప్రశంసించారని గుర్తు చేశారు. బీజేపీ సిద్ధాంతాలు, మోదీ నాయకత్వాన్ని నమ్మే వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే కుట్రకు మళ్లీ తెరలేపారని ఆరోపించారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 62 సీట్లతోపాటు 47 నుండి 53 శాతం ఓట్లు వస్తాయని అనేక సర్వే సంస్థలు నివేదికల్లో వెల్లడైందన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత పెరగబోతోందని, తద్వారా బీజేపీకి సీట్లు, ఓట్ల శాతం మరింతగా పెరగబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ కుమార్ 3వ రోజు భువనగిరి శివారు నుండి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా దారి మధ్యలోనున్న పాదయాత్ర సహప్రముఖ్ జిట్టా బాలక్రిష్ణారెడ్డి ఫాంహౌజ్ వద్దకు వచ్చి జర్నలిస్టులతో కొద్దిసేపు ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన పలు అంశాలపై ముచ్చటించారు.

మీడియా మిత్రులకు ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామ‌ని, రైల్వే పాసులను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తామ‌ని, హెల్త్ కార్డులు, ఇండ్ల తో పాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనపై ప్రజలు తిరగబడుతున్నారు… మునుగోడు ఉప ఎన్నికతో కేసీఆర్ పతనం పతాక స్థాయికి చేరుకుంటుంది. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది బీజేపీనే. మునుగోడు ఉప ఎన్నిక… తెలంగాణ ప్రజల భవిష్యత్ ను నిర్దేశించేది కాబోతోంది.. మునుగోడు అభ్యర్థి ఎవరనే విషయంపై పార్టీ నిర్ణయిస్తుంది.. అని బండి సంజయ్ స్ప‌ష్టం చేశారు.

తెలంగాణలోని చాలా నియోజకవర్గాల్లో త్వరలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోందని, అందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కారణం కాబోతున్నారని అన్నారు. ఇప్పటికే 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఒక రహస్య ప్రదేశంలో సమావేశమై, తమ భవిష్యత్ ఏంటి అని ఆలోచించుకుంటున్నారని.. టీఆర్ఎస్ ఏక్ నిరంజన్ పార్టీ అని అన్నారు. టీఆర్ఎస్ లో కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్తు దెబ్బతినబోతుందనే భయం వాళ్లకు పట్టుకుందని, అందుకే ప్రజల చేత వాళ్లే ఒత్తిడి చేయించుకుని ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలనుకుంటన్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాళేశ్వరం మునగడానికి ప్రధాన కారకుడు కేసీఆరే. కేసీఆర్ శంకర్ దాదా ఎంబీబీస్ లాంటి ఇంజినీరింగ్ తోనే ఇలా అయిందని అంటున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img