Saturday, September 7, 2024

తెలంగాణ‌లో కాంగ్రెస్ భారీ స్కెచ్‌!

Must Read
  • మెజార్టీ పార్ల‌మెంట్ స్థానాల్లో గెలిచేలా వ్యూహం
  • ప్ర‌జాసంఘాల నేత‌లను రంగంలోకి దించే యోచ‌న‌
  • గ‌ద్ద‌ర్‌, కోదండ‌రాం, ఆకునూరి, మంద‌కృష్ణ, కూర‌పాటి త‌దిత‌రుల‌తో మంత‌నాలు?
  • వ‌రంగ‌ల్ నుంచి గ‌ద్ద‌ర్ పోటీ..?
  • ప‌లువురు బీఆర్ఎస్ నేత‌ల‌కూ ఆహ్వానం..!
  • క‌డియం శ్రీ‌హ‌రికి భారీ ఆఫ‌ర్?
  • శ్రీ‌హ‌రికి పార్ల‌మెంట్ టికెట్‌, కూతురు కావ్య‌కు స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ స్థానం..
  • చ‌క్రం తిప్పుతున్న కొప్పుల రాజు!
  • వేగంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు
  • రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో మెజార్టీ పార్ల‌మెంట్ స్థానాల్లో గెల‌వ‌డ‌మే ల‌క్ష్యంగా వ్యూహం ర‌చిస్తోందా..? ఉన్న 17 స్థానాల్లో సుమారు 10 నుంచి 12 స్థానాల‌ను సొంతం చేసుకోవ‌డ‌మే ధ్యేయంగా ముందుకు వెళ్తోందా..? రాష్ట్రంలో ప్ర‌జాధ‌ర‌ణ పొందిన కొంద‌రు ప్ర‌జాసంఘాల నేత‌ల‌ను బ‌రిలోకి దించే యోచ‌న‌లో ఉందా..? ఇదంతా కూడా కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీకి అత్యంత స‌న్నిహితుడిగా గుర్తింపు పొందిన కొప్పుల రాజు నాయ‌క‌త్వంలో జ‌రుగుతోందా..? అంటే తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో కాంగ్రెస్ పార్టీ సైలెంట్‌గా త‌న ప‌నితాను చేసుకుంటూ వెళ్తోంది. రాహుల్‌గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌తో ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డిన సానుకూల‌త‌ను కాపాడుకుంటూ మ‌రింత వేగంగా ముందుకు వెళ్లేలా ప్లాన్ చేస్తోంది. కేంద్రంలో అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా గెలిచే అవ‌కాశాలున్న‌ పార్ల‌మెంట్ స్థానాల‌పై ప్ర‌ధానంగా ఫోక‌స్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో ఉన్న మొత్తం 17స్థానాల్లో మెజారిటీ స్థానాల‌ను కైవ‌సం చేసుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను కొప్పుల రాజు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చేపడుతున్న‌ట్లు తెలుస్తోంది.

వ్యూహాత్మ‌క అడుగులు…
బీఆర్ఎస్ ప్ర‌భుత్వ పాల‌న‌పై ప్ర‌ధానంగా విద్యార్థినిరుద్యోగులు, ఉద్యోగ‌, ప్ర‌జాసంఘాలతోపాటు సామాన్య‌జ‌నంలోనూ తీవ్ర అసంతృప్తి ఉంద‌న్న‌ అంచ‌నాకు వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. తెలంగాణ‌లో మంచి గుర్తింపు ఉన్న ప్ర‌జా సంఘాల నేత‌ల‌ను క‌ల‌వ‌డం, వీలైతే నేరుగా కాంగ్రెస్ టికెట్‌పైనే పోటీ చేయించ‌డం, లేదంటే మ‌ద్ద‌తు ఇచ్చే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. సాధ్య‌మైనంత వ‌ర‌కు కాంగ్రెస్ నుంచే బ‌రిలోకి దించేందుకు కొప్పుల రాజు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగానే ఇప్ప‌టికే ప‌లువురు నాయ‌కుల‌ను క‌లిసి.. వారికి చెప్పాల్సిన‌దంతా చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో రాజ‌కీయాల్లో మంచి పేరుండి, ప్ర‌స్తుతం బీఆర్ఎస్‌లో తీవ్ర అసంతృప్తి ఉన్న నేత‌ల‌ను కూడా కాంగ్రెస్ పార్టీ క‌లిసి ఆహ్వానిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందుకు కొంద‌రు నాయ‌కులు కూడా సానుకూల‌త‌ను వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఆ నాయ‌కుల‌కు కాంగ్రెస్ ఆహ్వానం
తెలంగాణ‌లో అత్యంత కీల‌మైన వ‌రంగ‌ల్, క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్ స్థానాల‌తోపాటు మ‌రో ప‌ది స్థానాల‌పై కాంగ్రెస్ పార్టీ ఎక్కువ‌గా దృష్టిసారిస్తోంది. సుమారు 10 నుంచి 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవ‌కాశాలున్న‌ట్లు ఇప్ప‌టికే ఇంటెలిజెన్స్‌వ‌ర్గాల నుంచి స‌మాచారం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌జాయుద్ధ‌నౌక గ‌ద్ద‌ర్‌, ప్రొఫెస‌ర్ కోదండ‌రాం, ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌కుడు మంద‌కృష్ణ మాదిగ‌, ప్రొఫెస‌ర్ కూర‌పాటి వెంక‌ట‌నారాయ‌ణ‌, ఐఏఎస్ ఆకునూరి ముర‌ళి, విప్ల‌వోద్య‌మంలో సుదీర్ఘ‌కాలంపాటు ప‌నిచేసిన ఓ నేత‌ను కూడా కాంగ్రెస్ నేత‌లు క‌లిసి మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. అనుకున్న‌ది అనుకున్న‌ట్లు జ‌రిగితే.. వీరికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం.. లేదంటే.. నేరుగా కాంగ్రెస్ టికెట్‌పైనే బ‌రిలోకి దించే యోచ‌న‌లో ఉన్నట్లు స‌మాచారం. ప్ర‌ధానంగా వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్థానం నుంచి గ‌ద్ద‌ర్‌ను రంగంలోకి దించితే.. గెలుపు సులువు అవుతుంద‌న్న అంచ‌నాలో కాంగ్రెస్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. అదేవిధంగా క‌రీంన‌గ‌ర్ నుంచి పోటీ చేయాల‌ని విప్ల‌వ నేప‌థ్యం ఉన్న నేత‌ను కోర‌గా… అందుకు ఆయ‌న నిరాక‌రించిన‌ట్లు స‌మాచారం. ఇలా అంద‌రితో చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు అత్యంత విశ్వాస‌నీయ స‌మాచారం.

క‌డియం కోసం య‌త్నం..!
ఉమ్మ‌డి రాష్ట్రంలోనే మంచి రాజ‌కీయ విలువలున్న నేత‌గా గుర్తింపు పొందిన‌, ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్న క‌డియం శ్రీ‌హ‌రిని కూడా కాంగ్రెస్ పార్టీ నేత‌లు భారీ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌డియం శ్రీ‌హ‌రికి పార్ల‌మెంట్ స్థానంతోపాటు ఆయ‌న కూతురు క‌డియం కావ్య‌కు స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ టికెట్‌ను ఇస్తామ‌ని కాంగ్రెస్ చెబుతున్న‌ట్లు స‌మాచారం. నిజానికి, కొంత‌కాలంగా క‌డియం శ్రీ‌హ‌రి రాజ‌కీయ క‌ద‌లిక‌ల‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. గ‌తంలో ఆయ‌న బీజేపీలోకి వెళ్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఇప్ప‌టికీ స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌కు, క‌డియంకు మ‌ధ్య ఆధిప‌త్య‌పోరు న‌డుస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో క‌డియం శ్రీ‌హ‌రికి కాంగ్రెస్ పార్టీ భారీ ఆఫ‌ర్ ఇచ్చిందంటూ వ‌స్తున్న వార్త‌లు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌లో కాంగ్రెస్ నుంచి కడియం కావ్య పోటీ చేస్తే సులువుగా గెలుస్తుందున్న టాక్ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img