Sunday, September 8, 2024

వ‌దిలేదే లే..!

Must Read
  • డోర్న‌క‌ల్‌పై కాంగ్రెస్ స్పెష‌ల్ ఫోక‌స్‌
  • కంచుకోట‌లో పూర్వ వైభ‌వం కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నం
  • కేడ‌ర్‌లో నూత‌నోత్సాహానికి ప్ర‌ణాళిక‌లు
  • గెలుపే ల‌క్ష్యంగా వ్యూహాత్మ‌క అడుగులు
  • అంత‌ర్గ‌త కుమ్ములాట‌కు చెక్ పెట్టేందుకు రెడీ
  • రాహుల్ ప‌ర్య‌ట‌న తర్వాత మార‌నున్న స‌మీక‌ర‌ణాలు

ఒక‌ప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్‌కు కంచుకోట‌.. 1957 నుంచి 2004 దాకా ఐదు ద‌శాబ్ధాలపాటు హ‌స్తం పార్టీ ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా ఏలిన గ‌డ్డ‌.. 2009, 2018 మిన‌హా.. అన్ని అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యాలు సాధించి, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్రదేశ్‌లోనే చ‌రిత్ర సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ ఓట‌మెరుగ‌ని నియోజ‌క‌వ‌ర్గంగా రికార్డుల‌కెక్కి దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఇప్పుడీ నియోజ‌క‌వ‌ర్గంపై హైక‌మాండ్ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన‌ట్లు స‌మాచారం. తెలంగాణలో తిరిగి సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్య‌మ ప్ర‌భావం, ప్ర‌త్యేక రాష్ట్ర ఆవిర్భావం, పార్టీ ఫిరాయింపుల నేప‌థ్యంలో కొంత బ‌ల‌హీన‌ప‌డినప్ప‌టికీ, సాంప్ర‌దాయ ఓటు బ్యాంక్‌తోపాటు క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన పునాధులు పార్టీకి క‌లిసి వస్తాయ‌ని అధిష్టానం అంచ‌నా వేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈక్ర‌మంలోనే ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో డోర్న‌క‌ల్‌ను హ‌స్త‌గ‌తం చేసుకుని, తిరిగి పూర్వ వైభ‌వం ద‌క్కించుకోవాల‌ని ఆ పార్టీ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఓట‌మి ఎరుగ‌ని నియోజ‌క‌వ‌ర్గంగా ఖ్యాతి..

డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డిన 1957 నుంచి 2004 వ‌ర‌కు వ‌రుస‌గా అసెంబ్లీకి జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ అభ్య‌ర్థులే ఘ‌న విజయం సాధిస్తూ వ‌చ్చారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌రుకు మొత్తం 14 సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. ఇందులో 12 ప‌ర్యాయాలు ఆ పార్టీ నేత‌లే గెలుపొందడం విశేషం. 1957 నుంచి 1978 వ‌ర‌కు వ‌రుస‌గా నాలుగు ప‌ర్యాయాలు నూక‌ల రాంచంద్రారెడ్డి, 1978 నుంచి 1989 వ‌ర‌కు మూడుసార్లు రామ‌స‌హాయం సురేంద‌ర్‌రెడ్డి, 1989 నుంచి 2009 ఎన్నిక‌ల వ‌ర‌కు నాలుగుసార్లు డీఎస్ రెడ్యానాయ‌క్ నాయ‌క్ గెలుపొందారు. 2009, 2018 ఎన్నిక‌ల్లో మాత్ర‌మే ఆ పార్టీ ఇక్క‌డ ఓట‌మి చ‌విచూసింది. 2009 ఎన్నిక‌ల్లో తొలిసారిగా కాంగ్రెస్ అభ్య‌ర్థి డీఎస్ రెడ్యానాయ‌క్‌ను ఓడించి టీడీపీ నుంచి స‌త్య‌వ‌తి రాథోడ్ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. 2014 ఎన్నిల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన స‌త్య‌వ‌తిని కాంగ్రెస్ అభ్య‌ర్థి రెడ్యా ఓడించారు. ఆ త‌ర్వాత 2018లో జ‌రిగిన ముందుస్తు ఎన్నిక‌ల్లో రెడ్యా టీఆర్ఎస్ త‌రుపున పోటీ చేసి స‌మీప కాంగ్రెస్ అభ్య‌ర్థి జాటోత్ రాంచంద్రునాయ‌క్‌పై 17, 381 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రెడ్యానాయ‌క్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంద‌గా, అందులో ఐదుసార్లు కాంగ్రెస్ నుంచే ప్రాతినిధ్యం వ‌హించ‌డం విశేషం. రెడ్యానాయ‌క్ టీఆర్ఎస్‌లోకి వెళ్లి అధికార పార్టీ నుంచి 2018 ఎన్నిక‌ల్లో పోటీ చేసి 88, 307 వేల ఓట్లు సాధించ‌గా, కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన జాటోత్ రాంచంద్రునాయ‌క్ 70, 926 ఓట్లు సాధించ‌డం గ‌మ‌నార్హం.

వచ్చే నెల‌లో రాష్ట్రానికి రాహుల్‌గాంధీ..

తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యంగా ముందుకుసాగుతున్న కాంగ్రెస్‌.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితిని ఇప్ప‌టికే అంచ‌నా వేసిన హైక‌మాండ్ గ‌తంలో కాంగ్రెస్‌కు గట్టి ప‌ట్టు ఉండి, చేజారిన నియోజ‌వ‌ర్గాలను గుర్తించింది. ఈ నేప‌థ్యంలోనే ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కాంగ్రెస్‌కు గ‌ట్టి ప‌ట్టున్న డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంపై ఆ పార్టీ క‌న్నేసిన‌ట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఇక్క‌డ కాంగ్రెస్ జెండా మ‌ళ్లీ ఎగ‌రేయాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈక్ర‌మంలోనే పార్టీలో నెల‌కొన్న విభేదాల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని, అదే క్ర‌మంలో పార్టీకి న‌ష్టం జ‌రిగేలా వ్య‌వ‌హ‌రించే నాయ‌కుల‌పై కొర‌డా ఝ‌లిపించేందుకు రెడీ అవ్వాల‌ని హైక‌మాండ్ నుంచి రాష్ట్ర పార్టీకి ఆదేశాలు అందిన‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే నెల 6, 7 తేదీల్లో ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. 6న వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించ‌నున్న రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌లో ఆయ‌న పాల్గొననున్నారు. 7వ తేదీన హైద‌రాబాద్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొననున్న ఈ స‌మావేశంలో రానున్న అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పార్టీ అనుస‌రించాల్సిన వ్యూహంపై రాహుల్ దిశానిర్దేశం చేయ‌నున్నారు. ఈ స‌మావేశంలో డోర్న‌క‌ల్ అంశం కూడా చ‌ర్చకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img