- తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్నాం..
- ఆప్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు
- కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్‌లతో జనం విసిగిపోయారు
- ఆ పార్టీల అవినీతి పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు
- కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య, వైద్యం అందిస్తాం..
- మహిళలు, కార్మికులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తాం
- ఆప్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ తాళ్లపల్లి సురేష్‌గౌడ్
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో జనం విసిగిపోయారు. ఆ పార్టీల అవినీతి, ప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పుడు జనమంతా ఆమ్ ఆద్మీ పార్టీవైపు చూస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్ తరహా ప్రభుత్వాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆప్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. వేగంగా పార్టీ విస్తరిస్తోంది. కార్మికులు, కర్షకులు, విద్యావంతులు, మేధావులు, నిరుద్యోగులు, మహిళలు.. అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని ఊడ్చేయడానికి ఆప్ వస్తోంది. కేసీఆర్‌ను ఫాంహౌస్‌కే పరిమితం చేయడానికి సామాన్యుల అస్త్రమై దూసుకొస్తోంది… అని అంటున్నారు ఆప్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ తాళ్లపల్లి సురేష్‌గౌడ్. తెలంగాణతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ విస్తరణ, కార్యాచరణ, ప్రజాసమస్యలపై అక్షరశక్తితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. పంజాబ్‌లో ప్రజలు ఎలాంటి తీర్పును ఇచ్చారో.. రేపటి రోజున తెలంగాణ ప్రజలూ అలాంటి తీర్పునే ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని సురేష్‌గౌడ్ అంటున్నారు.
ప్రశ్న : వరంగల్ ఉమ్మడి జిల్లాలో పార్టీ నిర్మాణం ఎలా ముందుకు సాగుతోంది?
సురేష్‌గౌడ్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ వేగంగా విస్తరిస్తోంది. పకడ్బందీ వ్యూహంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఉమ్మడి జిల్లాలో 12 వనియోజకవర్గాల్లో అన్నివర్గాలకు దగ్గరయ్యే దిశగా ముందుకు వెళ్తున్నాం. నేను వరంగల్ పార్లమెంట్ కన్వీనర్‌గా పని పనిచేస్తున్నా. వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్. ఇప్పటి వరకు వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, జనగామ, పాలకుర్తి నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జ్‌లను నియమించాం. నేను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నా. డబ్బు, కులం, మతంతో సంబంధం లేకుండా నిజాయితీపరులు, ప్రజల కోసం పనిచేసేవాళ్లు, విద్యావంతులు, సమాజం పట్ల సేవాదృక్పథం కలిగి ఉన్నవారికి, ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నవారికి పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నాం.
ప్రశ్న : ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉంది..?
సురేష్‌గౌడ్ : ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు ఉన్న జాతీయ, రాష్ట్ర పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఆ పార్టీల అవినీతి, అప్రజాస్వామిక పాలనతో ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీవైపు చూస్తున్నారు. అవినీతి, అక్రమాలు లేని ఆప్ ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలం చెందిన టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పరిమితం చేసేందుకు రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్నివర్గాల ప్రజలు ఆప్‌ను అక్కున చేర్చుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్‌లలో ఉన్న ప్రభుత్వాలు తెలంగాణలో కూడా రావాలని కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు, విద్యావంతులు, నిరుద్యోగులు కోరుకుంటున్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు మేం వస్తున్నాం. అవినీతి, అక్రమాలను ఊడ్చేస్తాం. ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తాం. పంజాబ్‌లో ఆప్ ఏం చేసిందో.. రేపటి రోజున తెలంగాణలోనూ అదే చేయబోతోంది.
ప్రశ్న : ప్రజలకు మీరిచ్చే హామీలు?
సురేష్‌గౌడ్ : ఈ రోజుల్లో ప్రజల ఖర్చులు, కష్టాలన్నీ కూడా విద్య, వైద్యం చుట్టే ఉన్నాయి. కేవలం ఉన్నతవర్గాలకే విద్య, వైద్యం అందుతోంది. ఆ రెండు కష్టాలను నుంచి ప్రజలను కాపాడడమే ఆప్ అధినేత కేజ్రీవాల్ లక్ష్యం. కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. డబ్బున్నవాళ్ల పిల్లలకు, ఉన్నత ఉద్యోగుల పిల్లలకు ఏస్థాయి విద్య అందుతుందో.. అదేస్థాయి విద్యను పేదల పిల్లలకూ అందిస్తాం. వైద్యం కూడా ఉచితంగా అందిస్తాం. అలాగే, సత్వర న్యాయం అందిస్తాం. అప్పుడిక ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా పోతాయి. సంతోషంగా జీవించే కాలం తెస్తాం. అదేవిధంగా పంట నష్టపోయిన రైతుకు రూ.50వేల పరిహారం అందిస్తాం. నిరుద్యోగులకు వందశాతం ఉద్యదోగాలు కల్పిస్తాం. మహిళలకు, కార్మికులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తాం. సీనియర్ సిటిజన్స్‌ను తీర్థయాత్రలకు ఉచితంగా ప్రభుత్వమే తీసుకెళ్తుంది. ప్రతీ డివిజన్‌లో బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తాం. 24గంటల పాటు తాగునీటి సదుపాయం కల్పిస్తాం. ప్రజలందరికీ 24గంటలపాటు విద్యుత్ సరఫరా, ఇందులో 200 యూనిట్స్ ఫ్రీ, అదనపు యూనిట్ల బిల్లులో 50శాతం తగ్గింపు చేస్తాం. మహిళలు, బాలికల రక్షణ కోసం మార్షల్స్(రక్షక వస్తాదులు) అందుబాటులో ఉంచుతాం. తెలంగాణలో అమరవీరుల కోసం ప్రత్యేకంగా అమరవీరుల కాలనీ ఏర్పాటు చేస్తాం. మురికివాడ నివాసులకు పక్కాగృహ నిర్మాణం చేపడుతాం. కాలుష్య రహిత సిటీ కోసం ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా మా పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌లలో చేసి చూపిస్తున్నాం. ఇక్కడా చేస్తాం.
ప్రశ్న : వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు ?
సురేష్‌గౌడ్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోన్ని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు. స్వరాష్ట్రంలో వరంగల్‌కు టీఆర్ఎస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. దారుణమైన వివక్ష చూపిస్తోంది. మహానగరంలో సౌకర్యాల కల్పనలో, ఉపాధి కల్పనలో, పరిశ్రమల ఏర్పాటులో టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు కూడా గప్‌చుప్‌గా ఉండిపోతున్నారు. వరంగల్‌కు కావాల్సింది అడగడం లేదు. ఇవే అంశాలను మేం జనంలోకి తీసుకెళ్తున్నాం. ఇక నేను వరంగల్ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నా. నియోజకవర్గంలో పెద్దమొత్తంలో విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు, వాణిజ్య వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. నియోజకవర్గంలో ఉన్న 27 డివిజన్ల ప్రజల నుంచి అపూర్వమైన ఆదరణ వస్తోంది. ఇక్కడున్నవాళ్లందరూ విద్యావంతులే. అందరూ చైతన్యవంతులే. అందుకే అవినీతిలేని పార్టీ కోసం, నాయకుడి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావాలని కోరుతున్నారు.