Tuesday, September 10, 2024

అగ్గిరాజేసిన అగ్నిపథ్..!

Must Read
  • ర‌ణ‌రంగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్
  • నాలుగు రైళ్ల‌కు నిప్పుపెట్టిన ఆందోళ‌కారులు.. స్టేషన్‌లో ఫర్నిచర్ ధ్వంసం
  • పోలీసుల కాల్పులు.. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం
  • హైద‌రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త‌త‌
  • అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం..
  • అన్ని రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద పోలీసుల మోహ‌రింపు

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అగ్నిపథ్ అగ్గిరాజేసింది. ఆర్మీలో నియామకాలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొన‌సాగుతున్నాయి. నిన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఆందోళనలు జరగ్గా.. ఆ మంటలు ఇప్పుడు తెలంగాణకు కూడా విస్తరించాయి. శుక్రవారం కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్య‌లో ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ముట్టడించారు. కొందరు ఆందోళనకారులు స్టేషన్‌లో బీభత్సం సృష్టించారు. స్టేషన్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ప్లాట్‌ఫారంలపై నిలిపి ఉన్న మూడు రైళ్లను తగులబెట్టారు. స్టేషన్‌లో ఉన్న పార్సిళ్లను పట్టాలపై వేసి నిప్పంటించారు. పలు రైళ్ల మంటల్లో తగలబడడంతో రైల్వే పోలీసులు అప్రమత్తమ్యారు. అగ్నిమాపక యంత్రాలను రప్పించి.. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సికింద్రాబాద్‌లో రైళ్లు తగలబడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

ర‌ణ‌రంగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్
సికింద్రాబాద్‌ స్టేషన్‌ రణరంగంగా మారింది. అగ్నిపథ్‌తో తమ జీవితాలతో ఆడుకోవద్దంటూ ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో బీభత్సం సృష్టించారు. ఒక్కసారిగా విరుచుకుపడిన విద్యార్థులతో రైల్వే స్టేషన్‌ ప్రాంగణం, ప్లాట్‌ఫారమ్స్‌ల దగ్గర యుద్ధవాతావరణం నెలకొంది. అరంగట పాటు కొనసాగిన ఆందోళనతో రైలు బోగీలు మంటల్లో మాడిమసయ్యాయి. పార్సిల్‌ కార్యాలయంలో ఉన్న బైకులు, ఇతర సామన్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. రైల్వేట్రాక్‌, ప్లాట్‌ఫామ్‌లు గందరగోళంగా మారిపోయాయి. వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఏం జరుగుతుందో తెలియక అక్కడికి వచ్చిన ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈక్ర‌మంలోనే పోలీసులు ఆందోళ‌కారుల‌పై కాల్పులు జ‌రిపారు. ఇందులో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం..

అగ్నిపథ్‌ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల వ‌ద్ద భద్రతను పెంచింది. రైల్వే స్టేషన్ల దగ్గర భారీగా పోలీసులను మోహరించింది. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పందించారు. ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చెందవద్దని, అగ్నిపథ్‌ వల్ల యువతకు ప్రయోజనమని తెలిపారు. అగ్నిపథ్‌ ఆందోళనపై నితిన్‌ గడ్కరీ స్పందించారు. అగ్నిపథ్‌ను యువత సరిగా అర్థం చేసుకోవాలని సూచించారు. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం పోతుందని అనుకోవద్దన్నారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయన్నారు. అందులో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img