Friday, July 26, 2024

వ‌న్ నేష‌న్‌..వ‌న్ ఎల‌క్ష‌న్‌.. వ‌న్ చాంబ‌ర్‌!

Must Read
  • దేశం ముందు స‌రికొత్త నినాదం
  • సంచ‌ల‌నం రేపుతున్న రాజ్యాంగ నిపుణుడు పూస‌ల శ్రీ‌కాంత్‌స్మిత్ ప్ర‌తిపాద‌న‌
  • ఆలోచ‌న‌లో ప‌డిపోతున్న మేధావివ‌ర్గాలు
  • ఇటీవ‌ల చెన్నై కాన్ఫ‌రెన్స్‌లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం
  • రాష్ట్రాల‌పై కేంద్రం పెత్త‌నానికి చెక్ పెట్టే వ్యూహం
  • ద‌క్షిణ భార‌త్ కేంద్రంగా కార్యాచ‌ర‌ణ దిశ‌గా అడుగులు

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : వ‌న్ నేష‌న్‌.. వ‌న్ ఎల‌క్ష‌న్‌.. వ‌న్ చాంబ‌ర్‌! తాజాగా, దేశం ముందుకు దూసుకొస్తున్న‌ స‌రికొత్త నినాదం. అత్యున్న‌త న్యాయ‌స్థానంలో ప్ర‌ముఖ న్యాయ‌వాది, రాజ్యాంగ నిపుణులు శ్రీ‌కాంత్‌స్మిత్ చేసిన ఈ ప్ర‌తిపాద‌న‌ మేధావివ‌ర్గాల‌ను ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది. రాజ‌కీయ‌వ‌ర్గాల‌కు స‌వాల్ విసురుతోంది. ఇటీవ‌ల చెన్నైలో నిర్వ‌హించిన కాన్ఫ‌రెన్స్‌లో తెలంగాణ ప్ర‌తినిధిగా మాట్లాడుతూ.. ఇప్పుడు కావాల్సింది వ‌న్ నేష‌న్‌.. వ‌న్ ఎల‌క్ష‌న్ మాత్ర‌మే కాదు.. వ‌న్ చాంబ‌ర్ అంటూ వేదిక‌పై వినిపించిన నినాదంతో స‌భంతా సైలెన్స్ అయిపోయింది. ద‌క్షిణ భార‌త్ కేంద్రంగా కొత్త రాజ‌కీయ ఆలోచ‌న‌ల‌కు పునాది ప‌డింది. ఒకే దేశం.. ఒకే ఎన్నిక గురించి తెలుసుగానీ.. ఏక‌ స‌భ అంటే ఏమిటి..? ఎందుకీ ప్ర‌తిపాద‌న‌..? అనే దానిపై మేధావి వ‌ర్గాల‌తోపాటు రాజ‌కీయ‌వ‌ర్గాల్లోనూ విస్తృత‌మైన చ‌ర్చ‌కు దారితీస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు హ‌క్కుల‌ను సాధించిపెట్ట‌డంతోపాటు ద‌క్షిణాదిపై దారుణ వివ‌క్ష‌ను రూపుమాప‌డానికి వ‌న్ చాంబ‌ర్ నినాదం ఆచ‌ర‌ణ‌కు ద‌గ్గ‌ర‌గా ఉంద‌నే వాద‌న బ‌లం పుంజుకుంటోంది.

ఎవ‌రీ పూస‌ల‌ శ్రీ‌కాంత్‌స్మిత్‌
పూస‌ల శ్రీ‌కాంత్‌స్మిత్ స్వ‌గ్రామం గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప‌రిధిలోని గొర్రెకుంట. అతిసాధార‌ణ కుటుంబం. హ‌న్మ‌కొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ క‌ళాశాల‌లో బీఏ పూర్తి చేసి, ఢిల్లీలో లా పూర్తి చేశారు. ఆ త‌ర్వాత సుప్రీం కోర్టులో న్యాయ‌వాదిగా ప్రాక్టీస్ చేసి మంచి గుర్తింపు సాధించారు. రాజ్యాంగ నిపుణులుగా పేరుగాంచారు. ప్ర‌స్తుతం హైకోర్టులోనూ ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే.. ఈ క్ర‌మంలోనే ద‌క్షిణ భార‌త్‌పై ఉత్త‌ర‌భార‌త పెత్త‌నం, రాష్ట్రాల‌పై కేంద్రం పెత్త‌నం, దాదాపు ఎక్కువ అధికారాల‌న్నీ కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్దే కేంద్రీకృత‌మై ఉండ‌డం, దీంతో రాష్ట్రాల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుండ‌డం.. ఇలా అనేక అంశాల‌పై విస్తృతంగా ప‌ర్య‌టిస్తూ అధ్య‌య‌నం చేశారు. ఈ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దిశ‌గా మేధావివ‌ర్గాల‌తో స‌మాలోచ‌న‌లు చేస్తూ ముందుకుసాగుతున్నారు. ప్ర‌ధానంగా ద‌క్షిణ భార‌త్‌పై ఉత్త‌ర భార‌త వివ‌క్ష‌ను రూపుమాప‌డానికి, అన్ని రాష్ట్రాల‌కు స‌మాన హ‌క్కులు ద‌క్కేలా కొన్ని ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తున్నారు.

ద‌క్షిణ‌భార‌త్‌పై వివ‌క్ష‌…
ద‌క్షిణ భార‌త్‌పై ఉత్త‌ర భార‌త పెత్త‌నం ఎక్కువ‌గా ఉంటుంద‌ని, పార్ల‌మెంట్‌లో నిర్ణ‌యాధికారం ఉత్త‌ర‌భార‌త స‌భ్యుల‌దే ఎక్కువ‌గా ఉంటుంద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. జ‌నాభా ప్రాతిప‌దిక‌న‌ పార్ల‌మెంట్‌లో లోక్‌స‌భ స్థానాలు మొత్తం 543 ఉన్నాయి. ఇందులో ద‌క్షిణ భార‌త దేశం నుంచి కేవ‌లం 129 స్థానాలు మాత్ర‌మే ఉన్నాయి. త‌మిళ‌నాడులో 39, తెలంగాణ‌లో 17, కేర‌ళలో 20, క‌ర్నాట‌క‌లో 28, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 25 లోక్‌స‌భ స్థానాలు ఉన్నాయి. ఇక మిగ‌తా స్థానాలు మొత్తం 414 ఉత్త‌ర‌భార‌త నుంచే. ఇందులోనూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌-80, ప‌శ్చిమ‌బెంగాల్‌-42, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌-29, మ‌హారాష్ట్ర‌-48 నుంచే ఎక్కువ‌. కేవ‌లం మూడునాలుగు రాష్ట్రాల్లో అత్య‌ధిక సీట్లు గెలిస్తేచాలు.. ఇక వారిదే కేంద్ర ప్ర‌భుత్వం అనే ప‌రిస్థితులు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంట్‌లో అనేక బిల్లులు, ఇత‌ర అంశాల స‌మ‌యంలో ద‌క్షిణ‌భార‌త్‌తో సంబంధం లేకుండా ఉత్త‌ర‌భార‌త్‌దే పైచేయిగా ఉంటోంది. ఈ క్ర‌మంలో తీవ్ర వివ‌క్ష‌ చూపిస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం. ద‌క్షిణ భార‌త రాష్ట్రాల హ‌క్కులు, అవ‌స‌రాలతో సంబంధం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇదిలా ఉండ‌గా, ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌త్ అనే తేడాలేకుండా రాష్ట్రాల‌పై కేంద్రం పెత్త‌నం పెరిగిపోతోంద‌నే విమ‌ర్శ‌లూ ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే వ‌న్ నేష‌న్‌.. వ‌న్ ఎల‌క్ష‌న్‌తోపాటు వ‌న్ చాంబ‌ర్ నినాదాన్ని రాజ్యాంగ నిపుణులు శ్రీ‌కాంత్‌స్మిత్ వినిపిస్తున్నారు.

వ‌న్ చాంబ‌ర్ అంటే ఏమిటి!
కొంత‌కాలంగా దేశంలో వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ పై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించాలంటూ ప్ర‌తిపాద‌న‌లు వ‌స్తున్నాయి. దీంతో స‌మ‌యంతోపాటు ఖ‌ర్చు ఆదా అవుతుంద‌ని కొన్నిరాజ‌కీయ‌వ‌ర్గాల‌తోపాటు మేధావివ‌ర్గాలు అంటున్నాయి. అయితే.. వీటితోపాటు వ‌న్‌చాంబ‌ర్ అంశాన్ని కూడా శ్రీ‌కాంత్‌స్మిత్ ప్ర‌తిపాదిస్తున్నారు. మొత్తంగా లోక్‌స‌భ‌ను ర‌ద్దు చేసి, కేవ‌లం రాజ్య‌స‌భ‌తోనే దేశాన్ని పాలించే అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. జ‌నాభా ప్రాతిప‌దిక‌న గాకుండా, అన్ని రాష్ట్రాల నుంచి స‌మాన సంఖ్య‌లో ప్ర‌తినిధుల‌ను రాష్ట్రాల నుంచి రాజ్య‌స‌భ‌కు పంపించాల‌ని, అప్పుడే మాత్ర‌మే అన్నిరాష్ట్రాల‌కు స‌మాన ప్రాధాన్యం ల‌భిస్తుంద‌ని, వివ‌క్ష‌కు తావులేకుండా ఉంటుంద‌ని ఆయ‌న ప్ర‌తిపాదిస్తున్నారు. 1946 నుంచి 1952వ‌ర‌కు భార‌త‌దేశం కేవ‌లం ఏక స‌భ‌తోనే పాలించ‌బ‌డింద‌ని ఆయ‌న పేర్కొంటున్నారు. ఇక్క‌డే ఆయ‌న మ‌రొక అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. బ్రిటిష్ నుంచి స్వాతంత్య్రం పొందిన ఇండియా.. అంత‌ర్గ‌తంగా ఉన్ననిజాం త‌దిత‌ర రాజ్యాల‌ను కేవ‌లం ఏక‌స‌భతోనే జ‌యించ‌గ‌లిగింద‌ని, అలాంటప్పుడు అత్యవసర సమయంలో కూడా ధ్విసభ అవసరం లేదని అంటున్నారు.

ద‌క్షిణాది కేంద్రంగా కార్యాచ‌ర‌ణ‌
మేధావివ‌ర్గాల‌ను, రాజ‌కీయ‌వ‌ర్గాల‌ను ఆలోచింప‌జేస్తున్న శ్రీ‌కాంత్ స్మిత్‌ ప్ర‌తిపాద‌న ఆధారంగా ద‌క్షిణాది కేంద్రంగా ప‌క‌డ్బందీగా కార్యాచ‌ర‌ణ దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. శ్రీ‌కాంత్ స్మిత్ చెబుతున్న వ‌న్ చాంబ‌ర్ నినాదం.. ద‌క్షిణాదిపై వివ‌క్ష‌ను రూపుమాప‌డంతోపాటు కేంద్ర‌, రాష్ట్రాల మ‌ధ్య ఉన్న అనేక స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపుతుంద‌న్న అంచ‌నాకు మేధావివ‌ర్గాలు వ‌స్తున్నాయి. ఈ దిశ‌లో ఇప్ప‌టికే శ్రీ‌కాంత్ స్మిత్ తెలంగాణ ద్ర‌విడ లాయ‌ర్స్ అసోసియేష‌న్ ఏర్పాటు చేసి, రాష్ట్ర అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు. త‌న నినాదాన్ని మ‌రింత బ‌లంగా జ‌నంలోకి తీసుకెళ్లే దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వంపై పోరాటం..
తెలంగాణ ద్ర‌విడ లాయ‌ర్స్ అసోసియేష‌న్ స్టేట్ ప్రెసిడెంట్‌గా కొన‌సాగుతున్న పూస‌ల శ్రీ‌కాంత్ స్మిత్ తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న అనేక వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌పై పోరాడుతున్నారు. తెలంగాణ‌లో ప్రైవేట్ యూనివ‌ర్సిటీ బిల్‌ను చాలెంజ్ చేశారు. అలాగే జెడ్పీ టీచ‌ర్ల‌ను, ప్ర‌భుత్వ టీచ‌ర్ల‌లో క‌ల‌ప‌డం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని వాదించారు. గురుకుల టీచ‌ర్స్ నియామకాల్లో బీసీ రిజ‌ర్వేష‌న్ల విధానాన్ని రోస్ట‌ర్ విధానంతో దెబ్బతీస్తున్న వైనాన్ని బ‌య‌ట‌పెట్టారు. అంతేగాకుండా, రాష్ట్రపతి ఉత్తర్వులను పదే పదె ఉల్లంఘిస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున తెలంగాణ ప్రభుత్వాన్ని న్యాయస్థానంలో అడుగడుగునా నిలదీస్తూ తెలంగాణ జాతి కోసం న్యాయపోరాటం చేస్తున్న న్యాయ‌వాదిగా శ్రీ‌కాంత్‌స్మిత్ గుర్తింపు పొందారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img