అక్షరశక్తి, హన్మకొండ : ప్రపంచ రక్త దాత దినోత్సవం జూన్ 14 సందర్బంగా బుధవారం హైదరాబాద్ రాజభవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్ లో ముందుగా తెలంగాణ రాష్ట గవర్నర్ అండ్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదాతలను అభినందించారు. అనంతరం సమాజంలో రక్తదాతలను మోటివేట్ చేసి రక్తదానశిబిరాలను నిర్వహించే వారికి, ఉత్తమ రక్తదాతలుగా ఎంపికైన వారికి అవార్డులు ప్రదానం చేసారు. ఈ సందర్బంగా రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ జిల్లాకు రాష్ట్ర అవార్డులు వరించాయి. రేర్ గ్రూప్ (నెగటివ్ బ్లడ్ గ్రూప్) కేటగిరీలో అత్యధికసార్లు రక్తదానం చేసి బాధితులను ఆదుకున్నందుకు హనుమకొండకు చెందిన టి. జనార్దన్ రెడ్డి (ఓ నెగటివ్ గ్రూప్ రక్తదాత) అవార్డు అందుకున్నారు.
హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ రక్తసేకరణ, రక్త పరీక్ష, పంపిణీ సమయంలో రక్త నాణ్యత ప్రమాణాలు పాటించి నాణ్యమైన రక్తం బాధితులకు అందిస్తున్నందుకు హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ ISO 9001 :2015 క్వాలిటీ సర్టిఫికేషన్ గుర్తింపునిచ్చారు. ఈ ఐఎస్‌వో సర్టిఫికెట్ తెలంగాణ రాష్ట గవర్నర్ అండ్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ చేతులమీదుగా హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈ. వి. శ్రీనివాస్ రావు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ సెక్రెటరీ సురేంద్ర మోహన్, తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అజయ్ మిశ్రా (ఐఏఎస్ రిటైర్డ్), ఐఆర్‌సీఎస్ స్టేట్ జెనరల్ సెక్రటరీ కె.మదన్ మోహనరావు, జిల్లాల చైర్మన్లు, కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.