- కేంద్రంలో అధికారంలోకి రాగానే అమలు చేస్తాం..
- నరేంద్ర మోడీ చేతుల్లో సీఎం కేసీఆర్
- బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటే..
- ఈ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలను ఓడించండి
- తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు అండగా నిలవండి
- ఆదివాసీల భూములను, హక్కులను కాపాడుతాం
- ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం..
- ములుగు విజయభేరి సభలో రాహుల్‌గాంధీ
- పాల్గొన్న ప్రియాంకగాంధీ
- రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు
- ఆలయం నుంచి విజయభేరి బస్సు యాత్ర
- భారీగా తరలివచ్చిన జనం
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : కేంద్రంలో అధికారంలోకి రాగానే.. సమ్మక – సారలమ్మ మేడారం మహా జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామాంజపురంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విజయభేరి సభలో ప్రియాంక గాంధీతో కలిసి ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రామప్ప ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి విజయభేరి బస్సు యాత్ర చేపట్టి.. సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సభలో ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే…
ఈ సుందరమైన రామప్ప ఆలయం చూసి ఆనందిస్తున్నా.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీని కాంగ్రెస్ పార్టీ 2004లో చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్. ఇది ప్రపంచానికి తెలుసు. రాజకీయాల లాభనష్టాలను పక్కనబెట్టి.. తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని మేం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడున్న సీఎం కేసీఆర్ చాలా మాటలు చెప్పారు. చాలా హామీలు ఇచ్చారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారు. మిమ్మల్ని అడుగుతున్నా.. మీలో ఎంతమందికి మూడెకరాల భూమి వచ్చిందో చెప్పాలి.. వచ్చిందా..? అందరికీ ఉద్యోగాలు ఇస్తానని హామీలు ఇచ్చారు.. ఉద్యోగాలు వచ్చాయా..? నీతిమంతమైన పాలన అందిస్తానని చెప్పారు.. కానీ.. అవినీతిపాలన సాగించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ధరణితో మోసం చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎంతమందికి కట్టించారు..? లక్ష రూపాయల రుణ మాఫీ చేశారా..? కానీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వాలు నెరవేర్చాయి. రాజస్తాన్‌లో అందరికీ ఉచితంగా వైద్యం ఇస్తామని చెప్పి.. హామీ నెలబెట్టుకున్నాం. రూ.25లక్షల వరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తోంది. ఛత్తీస్‌ఘడ్‌లో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పాం.. మాఫీ చేశాం. ఛత్తీస్‌ఘడ్‌లో వరిధాన్యాన్ని రూ.2500కు కొనుగోలు చేశాం. మొత్తం భారతదేశంలో ఎక్కువ ధరకు ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోంది. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఇచ్చాం. మొదటి రోజు నుంచే అమలు చేశాం. మీరు కర్ణాటకకు వెళ్లి చూడండి.. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. మేం ఏమాట ఇచ్చినా నిలబెట్టుకుంటున్నాం.
ఇది ఆదివాసీ ప్రాంతం.. అన్నింటికంటే ముఖ్యమైనది మీ భూముల విషయం. నేను ఈ వేదికపై నుంచి మాట ఇస్తున్నా.. మీ భూములు.. మీ హక్కులను ఇస్తాం. కాపాడుతాం. పోడు భూముల విషయంలో అసైన్డ్ భూముల విషయంలో న్యాయం చేస్తాం.. మేం ఏమాట అయితే.. ఇచ్చామో.. అది నిలబెట్టుకున్నాం.. ఈరోజు కూడా మేం ఇచ్చే మాట నిలబెట్టుకుంటాం. మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, భూమిలేని రైతులకు కూలీలకు ప్రతీ ఏడాది రూ.12వేలు, గృహజ్యోతి పథకంతో అందరి కరెంటు బిల్లుల్లో 200యూనిట్లు ఉచితం, ఇందిరమ్మ ఇళ్లకు రూ.5లక్షలు, ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారో వారికి ఇంటి స్థలం కింద 250 గజాల స్థలం ఇవ్వబోతున్నాం. యువకులకు, నిరుద్యోగులకు రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తాం..
ఇది చాలా పెద్ద ప్రకటన.. సమ్మక – సారలమ్మ మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తాం.. కుంభమేళాలాగా మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా చేయబోతున్నాం.. కేంద్రంలో మా ప్రభుత్వం రాగానే జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తాం.. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ ఇప్పటికే ఓడిపోయింది. గుర్తుపెట్టుకోండి.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. వీరితోపాటు ఎంఐఎం కూడా కలిసే ఉంది. పార్లమెంట్‌లో బీజేపీ ఏం కోరుకుంటే.. బీఆర్ఎస్ దానికి మద్దతు పలికింది. జీఎస్టీకి మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ప్రయత్నిస్తున్నాయి. దీనికి పెద్ద ఆధారం.. కేసీఆర్‌పై చిన్న కేసు కూడా ఉండకపోవడమే. నన్ను కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేధించింది. కేసులు పెట్టింది. కానీ.. కేసీఆర్‌పై మాత్రం ఒక్క కేసు కూడా ఉండదు. మొత్తం దేశంలో బీజేపీ కాంగ్రెస్‌పై యుద్ధం ప్రకటిస్తోంది. మా నాయకులపై దాడి చేస్తున్నారు. మాపై కేసులు పెడుతున్నారు. ఎందుకంటే వారికి తెలుసు.. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పార్టీ.. మనకు తెలుసు.. కేసీఆర్ నరేంద్రమోడీ చేతుల్లో ఉన్నాడని..! అందుకే మీరందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి.. మేం ప్రజా వ్యతిరేక బీజేపీతో పోరాడుతున్నాం.. కర్ణాటకలో బీజేపీని ఓడించాం.. ఇప్పుడు తెలంగాణతోపాటు మిగతా రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఓడిస్తాం.. అంటూ రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగించారు.