- భీమారం శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో చైర్మన్ బూర సురేందర్ గౌడ్ కీచక పర్వం
- పోలీసులకు ఫిర్యాదుచేసిన తల్లిదండ్రులు.. పరారీలో అధ్యాపకుడు
అక్షరశక్తి, హన్మకొండ క్రైం: హనుమకొండ జిల్లా భీమారంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాల చైర్మన్ బూర సురేందర్ గౌడ్ తన కళాశాలలోని విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన చైర్మన్ బూర సురేందర్ గౌడ్ వక్రబుద్దితో మైనర్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 5 రోజుల క్రితం చైర్మన్ సురేందర్ గౌడ్ విద్యార్థినులను కల్లు తాగాలని బలవంతం చేసినట్లు తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. నేను మీకు జీతాలు ఇస్తున్న.. నేను చెప్పిన పని చేయాలి.. అమ్మాయిలను రాత్రి వేళ తన రూంకి పంపాలి.. అని ట్యూటర్‌ను సురేందర్ గౌడ్ వేధింపులకు గురి చేస్తున్నట్లు విద్యార్థినుల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కారులో 2 బెడ్లు వేసుకొని పడుకోవాడానికి సరిపోతుందా ఎక్కి చూడమని వేధింపులకు పాల్పడ్డాడని, బూర సురేందర్ గౌడ్ ను కఠినంగా శిక్షించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులను కోరారు. వారి ఫిర్యాదు మేరకు
హనుమకొండ సీఐ కరుణకర్, కేయూ ఎస్సై సురేష్ శ్రీచైతన్య జూనియర్ కళాశాలలోని విద్యార్థినులను విచారిస్తున్నారు. కళాశాలలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కళాశాల చైర్మన్ బూర సురేందర్ గౌడ్ పరారీలో ఉన్నాడు.