- వరంగల్ లోక్‌సభ బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నాలు
- మెండుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆశీస్సులు..
- ప్రజాసేవ కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా..
- ఉన్నత విద్యావంతురాలిగా, సామాజిక సేవకురాలిగా గుర్తింపు
- ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్‌గా వేలాది మహిళల జీవితాల్లో వెలుగులు..
అక్షరశక్తి, తొర్రూరు: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు బీఆర్‌ఎస్ పార్టీ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ లోక్‌సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. అభ్యర్థుల ప్రకటన, ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా రిజర్వుడ్ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటూనే ఉన్నత విద్యావంతులను, కొత్తవారిని బరిలోకి దించేలా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన వరంగల్ పార్లమెంట్ టికెట్ కోసం పలువురు ఆశావహులు పోటీపడుతున్నారు. ఈనేపథ్యంలోనే తొర్రూరుకు చెందిన పంజా కల్పన తనవంతుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తన రాజకీయ గురువైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆశీస్సులతో ఆమె పార్లమెంట్ టికెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉన్నత విద్యావంతురాలైన కల్పన ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో ఉద్యోగాన్ని వదిలేసి సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ఉద్యోగం వదిలి ప్రజా సేవకు..
వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామానికి చెందిన పంజా కల్పన తొర్రూరులో అమ్మమ్మ తాతయ్య దగ్గర పుట్టి పెరిగారు. ఉన్నత విద్యావంతురాలైన కల్పన ప్రజాసేవ చేయాలన్న ఆలోచనతో టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2019లో జాబ్‌కు రిజైన్ చేసిన ఆమె తొర్రూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి కోసం పోటీ పడగా అనివార్య కారణాల వల్ల ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అనంతరం పాలకుర్తి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రోత్బలంతో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టారు. 5 సంవత్సరాలుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక సేవా కార్యక్రమాల్లో కీలకంగా పనిచేశారు. వేలాది మంది విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి పోటీ పరీక్షల్లో తర్ఫీదునిచ్చారు. అంతేగాక ఆర్థికంగా వెనుకబడిన బడుగు, బలహీన వర్గాల మహిళల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటు అందించేందుకు స్త్రీనిధి, సెర్ప్ సహాయ సహకారాలతో 10 వేల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించారు. సుమారు 6 వేల మందికి కుట్టు మిషన్లను పంపిణీ చేయడంలో క్రియాశీలకంగా పనిచేశారు.