Friday, July 26, 2024

లోక్‌స‌భ రేసులో డీఈ ఎట్టి వెంక‌న్న

Must Read
  • మ‌హ‌బూబాబాద్‌ కాంగ్రెస్ టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు
  • నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో స‌గానికిపైగా ఆదివాసీల ఓటుబ్యాంకు
  • సామాజిక న్యాయ‌వేదిక‌తో అన్నివ‌ర్గాల్లో గుర్తింపు
  • మెజార్టీ ఆదివాసీ సంఘాల మ‌ద్ద‌తు
  • ఇటీవ‌ల మంత్రి పొంగులేటిని క‌లిసిన‌ వెంక‌న్న
  • ఆస‌క్తిగా మారుతున్న ప‌రిణామాలు

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : తెలంగాణ‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఇక లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. మొత్తం 17 స్థానాల్లో మెజార్టీ స్థానాల‌ను కైవ‌సం చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. ప్ర‌ధానంగా రిజ‌ర్వుడ్ స్థానాల‌పై ప్ర‌త్యేక దృష్టిపెడుతోంది. ఈ రిజ‌ర్వుడ్ స్థానాల్లో సామాజిక స‌మీక‌ర‌ణాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటూ ఉన్న‌త విద్యావంతుల‌ను బ‌రిలోకి దించేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎస్టీ రిజ‌ర్వుడ్ స్థాన‌మైన మ‌హ‌బూబాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం టీఎస్ఎస్పీడీఎల్ డీఈ ఎట్టి వెంక‌న్న గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ మేర‌కు ఆయ‌న పార్టీకి ద‌ర‌ఖాస్తు కూడా పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే మ‌హ‌బూబాబాద్ పార్ల‌మెంట్ స్థానానికి ఇన్‌చార్జిగా ఉన్న‌పొంగులేని శ్రీ‌నివాస్‌రెడ్డిని కూడా వెంక‌న్న క‌లిసారు. త‌న‌కు టికెట్ కేటాయించాల‌ని కోరిన‌ట్లు తెలిసింది. మ‌హ‌బూబాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్య‌ధిక ఓటుబ్యాంకు ఉన్న కోయ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వెంక‌న్న పేరును పార్టీ పెద్ద‌లు కూడా సీరియ‌స్‌గా ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో లోక్‌స‌భ ఎన్నిక‌ల రాజ‌కీయం అత్యంత ఆస‌క్తిక‌రంగా మారుతోంది.

నిరుపేద కుటుంబం నుంచి…
ఎట్టి వెంక‌న్న స్వ‌గ్రామం మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు మండ‌లం మ‌ర్రిమిట్ట. నిరుపేద కుటుంబంలో జ‌న్మించిన ఆయ‌న‌.. ఏటూరునాగ‌రాం ఐటీడీఏ నుంచి పాఠ‌శాల విద్య హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌లో పూర్తి చేశారు. ఆ త‌ర్వాత జేఎన్‌టీయూ అనంత‌పూర్‌లో బీటెక్ పూర్తి చేశారు. ఇక 1994లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరిన ఆయ‌న‌.. స‌మ‌ర్థ‌వంతంగా విధులు నిర్వ‌ర్తిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. ప్ర‌స్తుతం టీఎస్ఎస్పీడీసీఎల్‌లో సంగారెడ్డి ఏరియాలో డివిజ‌న‌ల్ ఇంజినీర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ఉద్యోగ బాధ్య‌త‌లు నిర్వర్తిస్తూనే.. సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ప్ర‌ధానంగా.. ఆదివాసీ పిల్ల‌ల చ‌దువుల కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నారు. ఆదివాసీ విద్యార్థుల ఉన్న‌త విద్య కోసం త‌నవంతు సాయం అందిస్తున్నారు. అంతేగాకుండా, ఆదివాసీ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై కూడా పోరాడుతున్నారు. సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడిగా త‌న‌వంతు బాధ్య‌త‌లు స‌మ‌ర్థ‌వంతంగా చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో 2021 నుంచి సామాజిక న్యాయ‌వేదిక స్వ‌చ్ఛంద సంస్థ నిర్వ‌హిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇలా, తాను చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌తో అన్నివ‌ర్గాల‌తోనూ స‌త్సంబంధాలు ఏర్ప‌డ్డాయి.

వెంక‌న్న‌కు ఆదివాసీ సంఘాల మ‌ద్ద‌తు
మ‌హ‌బూబాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో మ‌హ‌బూబాబాద్‌, డోర్న‌క‌ల్‌, ఇల్లందు, పిన‌పాక‌, భ‌ద్రాచ‌లం, ములుగు, న‌ర్సంపేట అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఇల్లందు, పినపాక, భద్రాచలం, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట నియోజకవర్గాలలో ఆదివాసీల జనాభా 7 లక్షలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. గత 15ఏళ్లుగా అంటే.. 2009 నుండి గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు లంబాడి సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్‌ ఇస్తున్నారని, ఈసారి ఆదివాసీల‌కు ఇవ్వాల‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డిని క‌లిసి ఎట్టి వెంక‌న్న కోరిన‌ట్లు స‌మాచారం. మ‌హ‌బూబాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో మొత్తం 14ల‌క్ష‌లకుపైగా ఓట్లు ఉంటే.. అందులో సుమారు స‌గం ఓటు బ్యాంకు ఉన్న ఆదివాసీల‌దేన‌ని తెలిపిన‌ట్లు తెలిసింది. మెజారిటీ ఆదివాసీలు సంఘాలు తుడుండెబ్భ, ఆదివాసీ సంక్షేమ సంఘం, ఆదివాసీ విద్యార్థి సంఘం, ఉద్యోగ సంఘాల మ‌ద్ద‌తు త‌న‌కు ఉంద‌ని కూడా పొంగులేటికి డీఈ ఎట్టి వెంక‌న్న వివ‌రించిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో పార్టీ పెద్ద‌లు కూడా వెంక‌న్న పేరును సీరియ‌స్‌గా ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img