Monday, September 9, 2024

డోర్న‌క‌ల్ బీఆర్ఎస్‌లో ఆధిప‌త్య పోరు

Must Read
  • ఉప్పునిప్పుగా మంత్రి స‌త్య‌వ‌తి, ఎమ్మెల్యే రెడ్యా
  • ఇద్ద‌రి మ‌ధ్య మూడు ద‌శాబ్దాల‌కుపైగా రాజ‌కీయ వైరం
  • గ‌తంలో వేర్వేరు పార్టీలు… ఇప్పుడు ఇరువురూ గులాబీ గూటిలోనే..
  • బీఆర్ఎస్‌ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో మ‌రోమారు బ‌హిర్గ‌తం
  • నేనెప్పుడు చస్తానా అని ఎదురుచూస్తున్నారు : రెడ్యానాయ‌క్
  • బీఆర్ఎస్‌లో క‌ల‌క‌లం రేపిన ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు
    ఉద్య‌మాల ఖిల్లా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ఎస్టీ రిజ‌ర్వ్‌డ్ స్థానమైన డోర్న‌క‌ల్‌లో ఇదే సామాజికవ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య రాజ‌కీయ వైరం మూడు ద‌శాబ్దాల‌కుపైగా కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రు నేత‌లు అధికార పార్టీలో ఉన్నా రాజ‌కీయ వైరం మాత్రం త‌గ్గ‌డంలేదు. వారిలో ఒక‌రు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వతి రాథోడ్ అయితే, మ‌రొక‌రు మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయ‌క్‌. ఒక‌ప్పుడు స‌త్య‌వ‌తి టీడీపీ నుంచి, రెడ్యానాయ‌క్ కాంగ్రెస్ నుంచి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా హోరాహోరీగా త‌ల‌ప‌డ్డారు. మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేపథ్యంలో ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు గులాబీ గూటికి చేరారు. అధికారాన్ని అనుభ విస్తున్నారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్నా.. ఇప్ప‌టికీ ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్ .. మంత్రి స‌త్య‌వ‌తి మ‌ధ్య ఆధిప‌త్య పోరు మాత్రం ఆగ‌డంలేదు. కుర‌వి మండ‌లంలో నిన్న నిర్వ‌హించిన బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో ప‌రోక్షంగా మంత్రి స‌త్య‌వ‌తిని ఉద్దేశించి ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్ చేసిన కీల‌క వ్యాఖ్య‌లు పార్టీలో క‌ల‌క‌లం రేపాయి. రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఉప్పూ.. నిప్పుగా..

డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు, మంత్రి సత్యవతి రాథోడ్‌కు మధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంది. డోర్న‌కల్ నియోజ‌క‌వ‌ర్గంలో భీష్ముడిగా, రాజ‌కీయ కురువృద్ధుడిగా, అజాత శ‌త్రువుగా పేరున్న రెడ్యానాయ‌క్‌… ఇక్క‌డి నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌భుత్వంలో మంత్రిగా పని చేశారు. ఇక గతంలో రెడ్యానాయక్‌తో తలపడి, హోరాహోరీగా పోరాడి ఓటమిపాలై, ఇప్పుడు అదే నియోజకవర్గంలో మంత్రిగా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు సత్యవతి రాథోడ్. గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రిగా మానుకోట జిల్లాలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. దీంతో స్థానికంగా రెడ్యాకు ఇబ్బందికరంగా మారింది. రాజకీయాల్లో తన కంటే జూనియర్, తన చేతిలో ఓటమిపాలైన నేత‌, ఒకప్పుడు ప్రత్యర్థి అయిన సత్యవతి రాథోడ్‌ను మంత్రిగా గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రెడ్యా కొంత అస‌హ‌నానికి, ఆవేద‌న‌కు, ఆగ్ర‌హానికి గుర‌వుతున్నార‌నే ప్ర‌చారం ఉంది. ఎమ్మెల్యే వచ్చిన ప్రోగ్రాంలో మంత్రి కనబడకపోవడం, మంత్రి ఉన్న కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే హాజ‌రుకాకపోవడం, ఒకవేళ వచ్చినా మంత్రి వచ్చేలోపే అక్కడి నుంచి వెళ్లిపోవడం నిత్యకృత్యంగా మారింది. సత్యవతి కార్యక్రమాలకు రెడ్యానాయ‌క్ హాజరు కావడం మానేశారు. వీరిద్దరి మధ్య అడ్డు వస్తున్న ఇగోలు పార్టీ నేతలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. తాజాగా కుర‌వి మండ‌లం అయ్య‌గారిప‌ల్లిలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నం రెడ్యా, స‌త్య‌వ‌తిల మ‌ధ్య వైరాన్ని బ‌హిర్గ‌తంచేసింది.

చావు కోసం ఎదురు చూస్తున్నారు : రెడ్యా

కురవి మండలం అయ్యగారిప‌ల్లి గ్రామంలో బుధ‌వారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స‌భ‌లో ఆయ‌న ప్రసంగిస్తూ … బీఆర్ఎస్‌లో ఇంటి దొంగలు ఉన్నారని.. వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నేనెప్పుడు చస్తానా అని.. కొందరు తన చావు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. వాళ్లు తన ఓటమి కోసం గతంలో పనిచేశారని.. భవిషత్తులోనూ పనిచేస్తారని అన్నారు. కొందరు వ్యక్తులు పార్టీ పేరు చెప్పుకొని లక్షలు సంపాదిస్తున్నారని, అలాంటి వారిని గుర్తు పెట్టుకోవాలని రెడ్యానాయక్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఓడించాడానికి ప్రయత్నాలు చేస్తారని అన్నారు. అయితే… పరోక్షంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఉద్దేశించే ఎమ్మెల్యే రెడ్యా ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరుగుతోంది. తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పోరాటమే చేస్తున్నానని, ప్రజల ఆశీర్వాదంతోనే గెలుస్తున్నానన్నారు. తన పనితనానికి నియోజకవర్గ అభివృద్ధే నిదర్శనమన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజలకు వివరించాలని రెడ్యానాయక్ పిలుపిచ్చారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img