Tuesday, September 10, 2024

హైడ్రా పేరుతో బెదిరిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు..

Must Read

అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చ‌రిక‌

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : హైదరాబాద్‌లో కొంద‌రు కింది స్థాయి అధికారులు హైడ్రా పేరుతో భయపెట్టి.. బెదిరించి అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. గ‌తంలో ఇచ్చిన‌ నోటీసులు, రెండు మూడేండ్ల కింద‌టి ఫిర్యాదుల‌ను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని.. అటువంటి వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఇలాంటి వ‌సూళ్ల‌కు పాల్ప‌డే వారిపై ఫోక‌స్ పెట్టాల‌ని ఏసీబీ, విజిలెన్స్ అధికారుల‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రాకు అప్పగించేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్టు ఆమె తెలిపారు. చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణ‌న‌లోకి తీసుకుంటూ, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకై హైడ్రాకు మరిన్ని అధికారాలను, సిబ్బందిని అప్పగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై నేడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ మహేష్ భగవత్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అడిషనల్ అడ్వకెట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, ఏసీబీ డైరెక్టర్ త‌రుణ్ జోషి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img