కాంగ్రెస్ పార్టీని వీడకుండా జగ్గారెడ్డికి బుజ్జగింపు ప్రయత్నాలు మొదలయ్యాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఆపార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు శనివారం ఉదయం కలిశారు. కాంగ్రెస్‌కు దూరం కావొద్దని జగ్గారెడ్డికి వీహెచ్ విజ్ఞప్తి చేశారు.
పార్టీలోనే ఉంటూ అన్యాయాలపై కొట్లాడాలని సూచించారు. కాగా, వీహెచ్ మధ్యవర్తిత్వంతో కాస్త తగ్గిన జగ్గారెడ్డి కార్యకర్తలతో మాట్లాడి తదుపరి నిర్ణయం వెల్లడిస్తానని సందర్భంగా వీహెచ్‌కు తెలిపారు. మరోవైపు పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్.. జగ్గారెడ్డి కాళ్లు పట్టుకొని బతిమిలాడటం గమనార్హం. పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
‘నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పార్టీలో కొందరు కుట్రలు చేశారు.. నేను పార్టీ కోసం ఎంతగానో పనిచేసిన. అవమానించారు. తట్టుకోలేకే పార్టీని వీడాలని నిర్ణయం తీసుకుంటున్నా’ అని జగ్గారెడ్డి నిన్న మీడియాకు వివరించారు. ఇవాళ రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి సమర్పిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో తనపై, జగ్గారెడ్డిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వీహెచ్ అన్నారు. టీఆర్ ఎస్‌లో చేరుతున్నట్లు తమ ఫొటోలు మార్ఫింగ్ చేశారని చెప్పారు.
తెరాసకు అనుకూలంగా పని చేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసి దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేటట్లు కోరతానని వీహెచ్ చెప్పారు. ఈసందర్భంగా వీహెచ్ జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు.