- కేసులు కొత్తకాదు.. బెదిరింపులకు భయపడను..
- ఓటమి భయంతోనే వినయ్‌భాస్కర్ నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిండు
- నాయిని రాజేందర్‌రెడ్డి వెనుక మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే వినయ్ ఉన్నరు
- మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
అక్షశక్తి, హన్మకొండ: తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అన్యాయం అని, అయినా నాకు కేసులు కొత్త కాదని, బెదిరింపులకు తాను భయపడనని మాజీ డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని జంగా ఆరోపించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్.. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి వెనుక ఉండి పెద్దమ్మగడ్డకు చెందిన అంబేద్కర్ రాజు చేత తనపై అక్రమంగా కేసు నమోదు చేయించారని మండిపడ్డారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని స్ఫష్టంచేశారు. హనుమకొండ హంటర్ రోడ్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జంగా మాట్లాడారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ వినయ్‌భాస్కర్‌తోపాటు నాయిని రాజేందర్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెండు రోజుల క్రితం 4వ డివిజన్ పెద్దమ్మ గడ్డకు వెళ్ళామన్నారు. నాయిని అనుచరుడు అంబేద్కర్ రాజు మమ్మల్ని ఆపి ఇక్కడ ప్రచారం చేయొద్దని మాపై దాడికి యత్నించాడని తెలిపారు. ఇది నాయిని అడ్డా అని ఇక్కడకు రావొద్దని గొడవ చేశాడన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా ప్రచారం చేసుకునే హక్కు ఉందని, మేము 100 మంది ఉన్నామని, వాళ్ళు 10 మంది ఉన్నారని, అడుగడుగునా అడ్డు పడ్డారని అన్నారు. ఈక్రమంలోనే మా ఎస్సీ సెల్ సేవా దళ్ నాయకులు అశోక్‌తోపాటు మహిళా నాయకులు కత్తుల కవిత, రేణుకపై దాడి చేశారని అన్నారు. ఈ ఘటనపై మేము పిటిషన్ ఇచ్చామని, వాళ్ళు ఇచ్చారని తెలిపారు. కాలనీవాసులు కూడా మాకే మద్దతుగా ఉన్నారని, తాము చట్టానికి కట్టుబడి ఉన్నామని జంగా తెలిపారు. తాను ఎప్పుడూ ఎస్సీ లను కించపర్చలేదని, దళిత సామాజికవర్గమే నాకు అండ అని జంగా అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా కిసాన్ సేవాదళ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ, జంగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.