- కాకతీయ యూనివర్సిటీలో సీనియర్ అధ్యాపకుడిగా గుర్తింపు
- ప్రొఫెసర్‌గా 15 ఏండ్ల సుదీర్ఘ అనుభవం
- హిస్టరీ హెచ్‌వోడీగా, బోర్ట్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా,
కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా అనేక కీలక బాధ్యతలు - కలిసిరానున్న సమాజిక సమీకరణాలు
- మే నెలతో ముగియనున్న
వైస్ ఛాన్స్‌లర్ రమేశ్ పదవీకాలం - కొత్త వీసీ నియామకంపై ప్రభుత్వం కసరత్తు
- అనుభవం, అర్హతను బట్టే అవకాశం
- ఆశావహుల్లో చిగురిస్తున్న ఆశలు
అక్షరశక్తి, హన్మకొండ: తెలంగాణలోని పలు యూనివర్సిటీల్లో వీసీల పదవీకాలం మే నెలతో ముగియనుంది. కాకతీయ యూనివర్సిటీలోనూ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య తాటికొండ రమేశ్ మరో నాలుగు నెలల్లో రిటైర్ కానున్నారు. దీంతో ఆయా విశ్వ విద్యాలయాలకు కొత్త వీసీలను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈక్రమంలోనే రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద యూనివర్సిటీగా పేరొందిన కేయూలో వైస్ ఛాన్స్‌లర్ పదవి ఎవరిని వరిస్తుందనే చర్చ మొదలైంది. ఎంతో ఘన చరిత్రగల కాకతీయ యూనిర్సిటీ గత ప్రభుత్వాల కాలంలో అనేక అవినీతి ఆరోపణలతోపాటు కోర్టు కేసులతో అప్రతిష్టపాలైంది. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీల పాలనను గాడిలో పెట్టే పనిలో ఉంది. ఎలాంటి పైరవీలకు తావులేకుండా, రాజకీయాల ప్రమేయం లేకుండా సమర్థతను, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పారదర్శకంగా వీసీల నియామకం చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే కేయూలో సీనియార్టీ ప్రకారం.. వీసీ రేసులో ఆచార్య నూకపంగు కనకరత్నం ముందు వరుసలో ఉన్నారు. పోటీలో నలుగురు ఉన్నప్పటికీ వర్సిటీలో అందరికంటే సీనియర్‌గా ఉన్న కనకరత్నం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అంతేగాక రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఎస్సీ (మాదిగ) సామాజికవర్గానికి చెందిన వారు ఒక్కరు కూడా వీసీ పదవిలో లేకపోవడంతో ఈసారి కాకతీయ యూనివర్సిటీకి అదే వర్గానికి చెందిన వారినే వైస్ ఛాన్స్‌లర్‌గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.
పేదరికాన్ని జయించి.. అవాంతరాలు అధిగమించి..
వరంగల్ లేబర్‌కాలనీకి చెందిన ప్రొఫెసర్ నూకపంగు కనకరత్నం పేదరికాన్ని అధిగమించి అంచెలంచెలుగా యూనివర్సిటీలో అత్యున్నత సీనియర్ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు. పేద దళిత కుంటుంబంలో పుట్టిన ఆయన అనేక కష్టాలు, ఒడిదొడుకులు ఎదుర్కుంటూ అవాంతరాలు అధిగమిస్తూ ఉన్నత విద్యనభస్యసించి ఆదర్శంగా నిలిచారు. కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ, పీహెచ్‌డీ చదివిన కనకరత్నం హైదరాబాద్‌లో ఎంఫిల్ పూర్తిచేశారు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. వికారాబాద్ ఎయిడెడ్ కాలేజీలో మూడేండ్లు విధులు నిర్వహించారు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీలో 2003 నుంచి 2009 వరకు అసోసియేట్, 2009 నుంచి 2020 వరకు ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాకతీయ యూనివర్సిటీకి వచ్చారు. ప్రస్తుతం హిస్టరీ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. 15 సంవత్సరాల అనుభవంలో వర్సిటీలో అనేక బాధ్యతలు, కీలక పదవులు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించారనే పేరుంది. హాస్టల్ వార్డెన్‌గా 8 సంవత్సరాలు, హిస్టరీ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీగా 10 సంవత్సరాలు, బోర్ట్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా 10 సంవత్సరాలు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌లో రెండేళ్లు, సోషల్ సైన్స్ డీన్‌గా 4 సంవత్సరాలు, డైరెక్టర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌గా పలు కీలక పదవులు చేపట్టారు. 2016 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు దక్కించుకున్నారు. ప్రొఫెసర్ కనకరత్నం ఇప్పటి వరకు తొమ్మిది పుస్తకాలు రాయగా, 100కిపైగా ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి.
జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. అనేక సెమినార్లు నిర్వహించారు. అంతేగాక రాష్ట్రస్థాయి క్రీడాకారుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు.
అర్హత, అనుభవం..
యూజీసీ నిబంధనల ప్రకారం ఏదైనా యూనివర్సిటీల్లో వైస్ ఛాన్స్‌లర్ పదవి దక్కాలంటే ప్రొఫెసర్‌గా కనీసం 10 ఏండ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. కాకతీయ విశ్వవిద్యాలయంలో వీసీ రేసులో ఉన్న నలుగురు, ఐదుగురు సీనియర్లకు 10 ఏండ్లకు మించి అనుభవంలేదు. సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్న ఆచార్య కనకరత్నంకు 15 సంవత్సరాల అనుభవం ఉండటంతో ఆయనకే వీసీ పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతేగాక గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో జనాభాలో 13 శాతంగా ఉన్న మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోపక్క కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ, ములుగులోని హార్టీకల్చర్ యూనిర్సిటీల్లో ఎస్సీ (మాల) సామాజికవర్గానికి చెందిన వారిని వీసీలుగా నియమించిప్పటికీ మాదిగలకు ప్రాధాన్యం దక్కలేదనే వాదన ఉంది. ఈపరిణామాల మధ్య త్వరలో భర్తీ చేయనున్న వీసీ నియామకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు సముచిత స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాకతీయ యూనివర్సిటీ వీసీగా మాదిగ సమాజికవర్గానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్ ఆచార్య కనకరత్నంకు అవకాశం దక్కనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.