కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరిక
అక్షర శక్తి, కాజీపేట: డ్రగ్స్ సప్లయ్ చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. వరంగల్ సీపీ, డీసీపీ ఆదేశాల మేరకు గ్రేటర్ వరంగల్ కాజీపేటలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాజీపేట ప్రాంతంలో డ్రగ్స్ నిర్మూలనకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాజీపేట, ధర్మ సాగర్ ప్రాంతంలో గట్టి నిఘా పెట్టామని అన్నారు. యువతను కాపాడుకునే బాధ్యత మనందరిపైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు.
మాదకద్రవ్యాలకు అలవాటుపడిన వారి తల్లిదండ్రులు బయటకు చెప్పుకోలేక ఎంతో బాధపడుతున్నారని, వారిని తమ వద్దకు తీ సుకొస్తే సరైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. డ్రగ్స్ నిర్మూలన ప్రణాళిక అధికారిగా ఎస్సై ఫణిని నియమించామని తెలిపారు. ఎవరిపైనైనా అనుమానం వస్తే వరంగల్ సీపీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. కాజీపేటలో రైల్వే స్టేషన్ ఉండడం వల్ల.. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారు మాదక ద్రవ్యాలు తీసుకు వచ్చే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. మడికొండలో సాఫ్ట్‌వేర్‌కంపెనీలు ఉన్నాయని, అందులో ఎవరెవరు వస్తూ వెళ్తున్నారో తెలియడం లేదని, ప్రజలందరూ ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.