- అమలుకు నోచుకోని వరంగల్ మాస్టర్ ప్లాన్-2041
- మూడునాలుగేళ్లుగా ప్రభుత్వం వద్దే ముసాయిదా
- ఆమోదించకపోవడంలో ఆంతర్యమేమిటో..?
- అధికార పార్టీ నేతల రియల్ దందా కోసమేనా..?
- డ్రాఫ్ట్ ప్లాన్ ప్రకారమే ఇష్టారాజ్యంగా కుడా అనుమతులు
- నగరం చుట్టూ రియల్ ఎస్టేట్ వెంచర్లు
- ఓరుగల్లుపై టీఆర్ఎస్ ప్రభుత్వం దారుణ వివక్ష
- పాలనా తీరుపై నగరవాసుల్లో తీవ్ర అసంతృప్తి
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : ఓరుగల్లు మహానగరం.. తెలంగాణకు హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా మన నేతలు పదేపదే చెబుతుంటారు. కానీ.. ఆచరణలో మాత్రం వరంగల్‌పై దారుణమైన వివక్ష కొనసాగుతోంది. ఇటీవల కుడా చేపట్టిన ల్యాండ్ పూలింగ్ తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో మహానగరం అభివృద్ధికి దిక్సూచిగా చెప్పుకునే మాస్టర్ ప్లాన్ -2041 అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మాస్టర్ ప్లాన్ ఇప్పటికీ అమలు చేయకపోవడం ఓరుగల్లుపై టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్షకు, నిర్లక్ష్యానికి నిదర్శనమనే విమర్శలు నగరవాసుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కటికాదు రెండు కాదు.. ఏకంగా మూడు నాలుగేళ్లుగా ముసాయిదా మాస్టర్ ప్లాన్ ప్రభుత్వం వద్దే మూలుగుతోంది. ఆమోదించకపోవడంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నేళ్లుగా ఎందుకు ఆమోదించడం లేదు..? ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఆలస్యం చేస్తున్నారు..? నగరం చుట్టూ అధికార పార్టీ నేతల రియల్ దందా కోసమే ఆపుతున్నారా..? వారివారి భూ సర్దుబాటు అంతా అయిపోయాక అమలు చేస్తారా..? అసలు మాస్టర్ ప్లాన్ లేకుండా కుడా ఎలా అనుమతులు ఇస్తుంది..? ఇందులో ఉన్న మతలబు ఏమిటి..? అన్న ప్రశ్నలు ఇప్పుడు నగర ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలనే డిమాండ్ వారి నుంచి వస్తోంది.
1971 నుంచి అదే మాస్టర్ ప్లాన్..
వరంగల్ నగరానికి 1971 నుంచి అమల్లోకి వచ్చిన మాస్టర్ ప్లానే ఇప్పటికీ కొనసాగుతోంది. నిజానికి.. సుమారు 15 నుంచి 20ఏళ్లకు ఒకసారి నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సి ఉంటుంది. కానీ.. పాలకుల తీరుతో సుమారు 50ఏళ్లుగా అదే మాస్టర్ ప్లాన్ కొనసాగుతోంది. దీంతో వరంగల్ మహానగర విస్తరణ, అభివృద్ధి ఒక దిశానిర్దేశం లేకుండా అస్తవ్యస్తంగా ఉంటుందనే విమర్శలు వచ్చిపడుతున్నాయి. అయితే.. 2013లో కొత్త మాస్టర్ ప్లాన్ కుడా ఆధ్వర్యంలో రూపొందించారు. ఇంతలోనే తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడడం, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ మాస్టర్ ప్లాన్‌ను పక్కన పడేసి.. కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాలంటూ సీఎం కేసీఆర్ సూచించడంతో లీ అసోసియేట్స్ సంస్థకు అప్పగించారు. ఆ వెంటనే సంస్థరంగంలోకి దిగి మాస్టర్ ప్లాన్ -2041ను రూపొందించడం, అప్పటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గౌతమ్ ఆధ్వర్యంలో ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత 2018లో ఆమోదం కోసం ముసాయిదా మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వానికి అందజేశారు. ఇక అప్పటి నుంచి అప్పుడు.. ఇప్పుడు.. అంటూ ఇన్నేళ్లుగా ప్రభుత్వం వద్దే డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్-2041 మూలుగుతోంది.
ఆమోదించకపోవడంలో ఆంతర్యం ఏమిటో..?
వరంగల్ మహానగరానికి స్వరాష్ట్రంలోనైనా మాస్టర్ ప్లాన్ అమలై.. నగరం అభివృద్ధి చెందుతుందని నగర వాసులు, మేధావులు కలలు కన్నారు. కానీ.. ముసాయిదా మాస్టర్ ప్లాన్-2041ను కూడా ఇన్నేళ్లుగా ఆమోదించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముస్తాయిదా మాస్టర్ ప్లాన్ ప్రకారమే పనులు, అనుమతులు ఇచ్చేసుకోండి.. అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంపై కూడా అనేక విమర్శలు వచ్చిపడుతున్నాయి. చట్టబద్ధంగాని మాస్టర్ ప్లాన్ ప్రకారం అనుమతులు ఎలా ఇస్తారనే ప్రశ్నలు కూడా నగర వాసుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. వరంగల్ మహానగరానికి దిక్సూచిగా ఉండే మాస్టర్ ప్లాన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓరుగల్లుపై టీఆర్ఎస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనమంటూ మండిపడుతున్నారు. ఆమోదించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నేతలు కూడా లోలోపల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ నేతల రియల్ దందా కోసమేనా..?
హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా చెప్పుకునే వరంగల్ మహానగరం చుట్టూ ఉన్నభూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆ భూములపై కొందరు అధికార పార్టీ నేతలతోపాటు రియల్టర్ల కన్నుపడింది. పంటలు పండే భూములను కొనుగోలు చేస్తూ.. ఇష్టారాజ్యంగా కుడా లేఔట్ పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్లు, నాన్‌లేఔట్ వెంచర్లు చేస్తూ జోరుగా రియల్ దందా నడిపిస్తున్నారు. బినామీల పేర్లపై వెంచర్లు చేసి డబ్బు సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారనే ఆరోపణలు వచ్చిపడుతున్నాయి. అయితే.. ముసాయిదా మాస్టర్ ప్లాన్ -2041 అమలులోకి రాకుండా ఏ ప్రాతిపదికన కుడా( కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ) అనుమతులు ఇస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలా విచ్చల విడిగా రియల్ వెంచర్లకు అనుమతులు ఇస్తే.. రానున్న రోజుల్లో వరంగల్ నగరంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరం చుట్టూ ఉన్న నాయకుల రియల్ వెంచర్లన్నీ పూర్తి అయి, వారి భూముల సర్దుబాటు అంతా అయిపోయిన తర్వాత వాటన్నింటినీ ముసాయిదా మాస్టర్ ప్లాన్‌లో పొందుపర్చడానికే ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ ప్రభుత్వం నుంచి ఎప్పుడు సమాధానం లభిస్తుందో చూడాలి మరి.