Tuesday, June 18, 2024

ఎర్ర‌బెల్లిపై గాజ‌ర్ల అశోక్‌!

Must Read
  • పాల‌కుర్తిలో కాంగ్రెస్ న‌యా వ్యూహం
  • రంగంలోకి మాజీ మావోయిస్టు నేత‌
  • 1995-2001 వ‌ర‌కు ఈ ప్రాంతంలో ద‌ళ‌క‌మాండ‌ర్‌గా ప‌నిచేసిన అశోక్‌
  • రంగ‌న్న‌, జ‌నార్ద‌న్ పేర్ల‌తో జ‌నంలో..
  • 1996లో క‌డ‌వెండిలో గ‌న్ మిస్ ఫైర్‌
  • తెగిపోయిన మూడు చేతివేళ్లు
  • ప్ర‌తీ గ్రామంలో విస్తృత ప‌రిచ‌యాలు
  • నియోజ‌క‌వ‌ర్గంలో అనూహ్య ప‌రిణామాలు
  • ఉత్కంఠ రేపుతున్న రాజ‌కీయాలు

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ప‌లు నియోజవర్గాలో అభ్యర్థుల ఖరారుకు సంబంధించి గంట గంటకు సమీకరణాలు మారిపోతున్నాయి. ఇందులో ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల, పాలకుర్తి నియోజకవర్గాలు అత్యంత ఆసక్తికర రాజకీయ పరిణామాలకు కేంద్రంగా మారుతున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన మావోయిస్టు పార్టీ కేంద్ర క‌మిటీ మాజీ సభ్యుడు, సుమారు 25 ఏళ్ల పాటు విప్లవ ఉద్యమంలో పనిచేసిన గాజర్ల అశోక్ అలియాస్ ఐతుకు పరకాల కాంగ్రెస్ టికెట్ ఖాయమని అందరూ అనుకున్నారు.. కానీ ఇంతలోనే ఊహించ‌ని ప‌రిణామం నెల‌కొంది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమవడం, ఆయన కూడా పరకాల టికెట్ ఆశిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. అయితే, గాజర్ల అశోక్‌తోపాటు రేవూరి ప్రకాశ్ రెడ్డికి ఎలాగైనా టికెట్లు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరిని పాలకుర్తి నుంచి బరిలో దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

పాలకుర్తి నుంచి గాజర్ల అశోక్..
మొద‌టి నుంచీ పాల‌కుర్తిలో ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావును ఎలాగైనా ఓడించాల‌న్న వ్యూహంతో ఉన్న‌ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సరికొత్త ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి భారతీయ పౌరసత్వ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆమెకు భారతీయ పౌరసత్వం లభించే అవకాశాలు కనిపించకపోవడంతో పాలకుర్తి నుంచి గాజర్ల అశోక్ పేరును పార్టీ అధిష్టానం పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పాలకుర్తి ప్రాంతంతో గాజర్ల అశోక్‌కు సుమారు ఆరేడేళ్ల విప్లవోద్యమ అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా ఝాన్సీ రెడ్డి స్థానంలో అశోక్ పేరు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్క‌డి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావును ఎదుర్కొన‌డానికి అశోక్ బ‌ల‌మైన అభ్య‌ర్థిగా నిల‌బ‌డ‌తార‌ని, జ‌నం నుంచి సానుకూల స్పంద‌న వ‌స్తుంద‌న్న ఆలోచ‌న‌లో అగ్ర‌నేత‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

రంగ‌న్న పేరుతో…
1995 నుంచి 2001 వరకు వర్ధన్నపేట, పాలకుర్తి, జనగామ, చేర్యాల, స్టేషన్ ఘన్పూర్ ప్రాంతాల్లో గాజర్ల అశోక్ అలియాస్ రంగన్న, జనార్దన్ పేర్లతో దళ కమాండర్‌గా పనిచేశారు. ప్రధానంగా పాలకుర్తి నియోజకవర్గ ప్రాంతంలో రంగన్నగా గుర్తింపు పొందారు. ఇక్కడ పనిచేస్తున్న సమయంలోనే 1996 అక్టోబర్ నెలలో దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో గన్ మిస్ ఫైర్ కావడంతో కుడి చేయి 3 వేళ్ళు తెగిపోయాయి. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనంగా మారింది. హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంగన్నను పట్టుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. పాలకుర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాల ప్రజలతో సంబంధాలు ఉండడం గాజర్ల అశోక్ కలిసి వచ్చే అంశమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అశోక్‌కు మ‌ద్ద‌తుగా ఏఐసీసీ నేత‌ల నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img