- జనగామ, స్టేషన్ ఘన్‌పూర్‌లో రంగంలోకి షాడో టీంలు..
- ముత్తిరెడ్డి, తాటికొండ రాజయ్య కదలికలపై ప్రత్యేక నజర్
- అధికార పార్టీకి సహకరించరనే అనుమానంతోనే..?
- ఉత్కంఠ రేపుతున్న పరిణామాలు
అక్షరశక్తి ప్రధాన ప్రతినిధి: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విశ్వసించడంలేదా..? ఈ ఇద్దరు ఎమ్మెల్యేల కదలి కలను పసిగట్టడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారా..? ఇందుకోసం ప్రత్యేకంగా షాడో టీంలను రంగంలోకి దింపారా..? అంటే ఆయా నియోజకవర్గాల్లో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం ఇస్తున్నాయి. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యకు ఈసారి ఎన్నికల్లో మొండిచేయి చూపిన కేసీఆర్ ఆయన స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. దీంతో అలకబూనిన రాజయ్యకు రైతుబంధు సమితి చైర్మన్ పదవి కట్టబెట్టి బుజ్జగించారు. ఇక జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కూడా టికెట్ దక్కలేదు. జనగామ టికెట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి దక్కడంతో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే పల్లాకు లైన్ క్లియర్ చేస్తూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కేసీఆర్ ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చి చల్లబర్చారు. స్టేట్ కార్పొరేషన్ పదవులు పొందిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పైకి మెత్తబడినట్లే కనిపిస్తున్నా లోలోపల మాత్రం అధిష్టానంపై గుర్రుగా ఉన్నారన్న అనుమానం పార్టీ పెద్దలను ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీలోనే ఉంటూ, తమవెంటే నడుస్తూ సమయం వచ్చినప్పుడు అదును చూసి దెబ్బకొడతారన్న భయం అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో అభ్యర్థులు ఇదే విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో అప్రమత్తమైన ఆయన జ నగామ, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగానే షాడో టీంలను నేరుగా రంగంలోకి దింపినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ షాడో టీంల ద్వారా కేసీఆర్ నిత్యం ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, రాజయ్య కదలికలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది.
సహకరిస్తారా..? హ్యాండిస్తారా..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అసంతృప్తులపై భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. ఈనేపథ్యంలోనే… స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలకు కీలక పదవులు కట్టబెట్టారు. తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని నియమించిన కేసీఆర్ తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్ పదవి నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డిని తప్పించి తాటికొండ రాజయ్యకు అప్పగించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి కట్టబెట్టడంతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి జనగామలో లైన్ క్లియర్ అయింది. మరోవైపు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు రైతుబంధు సమితి చైర్మన్ పదవి ఇవ్వగా…కడియం శ్రీహరి ప్ర చారానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది. అయితే.. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులతో ఈ ఇద్దరు నేతలు సంతృప్తి చెందారా.. లేదా అన్నది పక్కనపెడితే, తీరా ఎన్నికల ముంగిట అభ్యర్థులకు వీళ్లు పూర్తిగా సహకరిస్తారా.. ? లేదా..? అన్న అనుమానం పార్టీ పెద్దలను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమం లోనే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజ్ఙప్తి మేరకు కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జనగామ, స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, తాటికొండ రాజయ్యపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కేసీఆర్.. షాడో టీంలను తిప్పుతున్నట్లు సమాచారం.