- పరకాలకు 100పడకల ప్రభుత్వ ఆస్పత్రి మంజూరు
- 30పడకల సీహెచ్‌సీని అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ
- అందుబాటులోకి కార్పొరేట్‌స్థాయి వైద్యం
- తీరనున్న ఈ ప్రాంత ప్రజల కష్టాలు
- తగ్గనున్న వైద్యఖర్చుల భారం
- ఫలించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కృష్టి
అక్షరశక్తి, పరకాల టౌన్ : పరకాల ప్రజల కల నెరవేరింది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కృషి ఫలించింది. ఈ ప్రాంత ప్రజలకు కార్పొరేట్‌స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. 30 పడకలతో ఉన్న సీహెచ్‌సీ ఆస్పత్రిని 100పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు రూ.35కోట్లలో ఆస్పత్రి నిర్మాణం చేపట్టి… ప్రతీ సంవత్సరం రూ.7కోట్లకు పైగా నిధులను ఆస్పత్రికి విడుదల చేయనుంది. త్వరితగతిన ఆస్పత్రి నిర్మాణం పూర్తి అయితే.. ఇక ఈ ప్రాంత ప్రజలకు అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా.. ప్రభుత్వ ఆస్పత్రిలోనే కార్పొరేట్ వైద్యం పొందే అవకాశాలు ఉండనున్నాయి. దీంతో ప్రజలకు వైద్యఖర్చుల భారం తగ్గిపోనుంది. అంతేగాకుండా.. వరంగల్ ఎంజీఎం, ఇతర ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం కూడా లేకుండా పోతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
30 నుంచి 100పడకలకు..
ప్రస్తుతం పరకాల పట్టణంలో ఉన్న 30 పడకల సీహెచ్‌సీలో ప్రస్తుతం ముగ్గురు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. ప్రతీరోజు ఓపీకి సుమారు 200 నుంచి 300మంది వరకు ప్రజలు వచ్చి వైద్యసేవలు పొందుతున్నారు. నిరంతరం అందుబాటులో ఉంటూ.. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. అయితే.. ఈ ఆస్పత్రిని 100పడకల ఆస్పత్రిగా మార్చడం వల్ల ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. 22మంది డాక్టర్లు, ప్రతీరోజు సుమారు పేషెంట్ కేర్, శానిటైజేషన్ 30 మంది, అదనంగా 24మంది స్టాఫ్‌నర్స్ ఆస్పత్రిలో సేవలు అందించనున్నారు. సుమారు 15రకాల వైద్యసేవలు, అత్యవసర సమయంలో చికిత్స అందనుందని స్థానిక వైద్యసిబ్బంది అంటున్నారు.
అనేక ప్రాంతాల ప్రజలకు సేవలు
పరకాల పట్టణంలో వందపడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తి అయితే.. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. భూపాలపల్లి, మహదేవ్‌పూర్, చిట్యాల, కాటారం, రేగొండ, మొగుళ్లపల్లి, తదితర మండలాల నుంచి వచ్చే వారికి 24గంటలపాటు వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రధానంగా ఇక్కడి నుంచి వరంగల్‌కు రావాల్సిన అవసరం లేకుండా పోతుంది. ప్రయాణభారం, వైద్యఖర్చుల భారం చాలా వరకూ తగ్గుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంగా ఉన్న పరకాల పట్టణంలో పెద్దాస్పత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే చల్లా కృషి చేస్తున్నారు. ఇన్నాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేసిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.