అక్షరశక్తి, ఖానాపూర్ : పెద్దలు వద్దంటున్నా ప్రేమించినవాడిని వదులుకోలేకపోయింది. తల్లిదండ్రులను ఒప్పించి రెండేళ్ల క్రితం ఆ యువుకుడిని పెళ్లి చేసుకుంది. రెండేళ్లు సజావుగా సాగిన వారి కాపురంలో వరకట్నం చిచ్చుపెట్టింది. కట్నం తీసుకువస్తేనే ఇంటికి రావాలని లేకపోతే, నువ్వు అవసరం లేదని భర్తతోపాటు అత్తింటివారు తెగేసి చెప్పడంతో సదరు యువతి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది.
అయినా భర్త మనసు కరగకపోవడంతో అత్తవారి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళ్తే… స్థానికుల కథనం ప్రకారం… వరంగల్ జిల్లా అశోక్ నగర్ గ్రామానికి చెందిన మక్కా వినోద్ అదే గ్రామానికి చెందిన ఏల్ది రవళి రెండు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులు కాపురం సజావుగా కొనసాగింది. తరువాత కట్నం తీస్తేనే ఇంటికి రావాలని భర్తతోపాటు అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించినప్పటికీ వారిలో మార్పురాలేదు. దీంతో విసుగుచెందిన రవళి గ్రామస్తుల సహకారంతో భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని, భర్త వచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించింది. ఇంటి ముందే వంటావార్పు మొదలుపెట్టింది. రవళి అత్తవారింటికి రావడంతోనే భర్తతో సహా అత్తమామలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.