- కొత్తపల్లి గ్రామంలో విషాదం
అక్షరశక్తి, భీమదేవరపల్లి: గత సర్పంచ్ పదవి కాలంలో గ్రామపంచాయతీ అభివృద్ధి పనులకు చేసిన బిల్లులు రాక అప్పులపాలై ఓ మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. కొత్తపల్లి గ్రామ మాజీ సర్పంచ్ భర్త రేణిగుంట్ల చంద్రయ్య అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గత ఐదేళ్ల క్రితం తన భార్య సర్పంచ్ గా ఉన్నప్పుడు గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి, అభివృద్ధి పనులకు బయట అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినా బిల్లులు ఇంకా రాకపోవడం చంద్రయ్య ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పులను తీర్చడానికి తమకున్న 20 గుంటల భూమి కూడా అమ్మినా సరిపోలేదని మరో 10 గుంటల భూమి అమ్మి అప్పులు తీరుద్దామని సముదాయించినా చంద్రయ్య తీవ్ర ఆందోళనకు గురయ్యారని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా కూడా చాలా అప్పులపాలై ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియజేశారు. ఘటనా స్థలానికి ములకనూరు పోలీసులు చేరుకొని మృతికి కారణమైన వివరాలను నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.