అక్షరశక్తి, హన్మకొండ క్రైం: హన్మకొండ కాకతీయ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామారం పెట్రోల్ బంక్ ఎదుట శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే… రామారంలోని స్కిల్ స్టోక్ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న సునయన (27) తన ద్విచక్రవాహనంపై హనుమకొండ నుండి కరీంనగర్ వైపుగా వెళ్తున్నారు. ఈక్రమంలో వెనుకనుంచి వచ్చిన మరో ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో సునయన లారీ కింద పడగా , ద్విచక్రవాహనదారుడు ఎడమవైపు పడిపోయారు. సునయన రెండు కాళ్ళు, పొట్ట కింది భాగం లారీ కింద పడి నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో సుమారు గంటకుపైగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కేయూ ఇన్ స్పెక్టర్ ముసుకు అబ్బయ్య, ఎస్సై సురేష్, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. అనంతరం108 అంబులెన్స్ వాహనంలో ఫస్ట్ రెస్పొండర్ యుగంధర్ ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్తితి విషమంగా ఉందని ఎంజీఎం వైద్యులు తెలిపారు.