- కాంగ్రెస్‌లోకి జెడ్పీటీసీ, ఇద్దరు ఎంపీపీలు, ఇద్దరు ఎంపీటీసీలు
- రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
- చక్రం తిప్పుతున్న కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి
- బిగ్‌షాక్‌లో చల్లా ధర్మారెడ్డి
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల ముంగిట పరకాల రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓ జెడ్పీటీసీ, ఎంపీపీ, మరో ఇద్దరు ఎంపీటీసీలు, పలువురు కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి నాయకత్వంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరుకున్నారు. ఊహించని పరిణామాలతో పరకాల బీఆర్ఎస్‌లో కలకలం రేగుతోంది. హ్యాట్రిక్ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్న చల్లా ధర్మారెడ్డికి అత్యంత ప్రతికూలంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతా సవ్యంగా ఉందని భావిస్తున్న వేళ.. ఈ పరిణామాలు గులాబీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇదే దారిలో మరికొంతమంది నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
ఆట మొదలు పెట్టిన రేవూరి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఊహించని విధంగా పరకాల కాంగ్రెస్ టికెట్‌ను కైవసం చేసుకున్నారు. రేవూరి స్వగ్రామం దుగ్గొండి మండలం కేశవపురం పరకాల నియోజకవర్గానికి ఆనుకుని ఉండడం.. ఈ ప్రాంతంలో విస్తృతమైన పరిచయాలు ఉండడంతో రేవూరి.. అంతే వేగంతో తన బలం చాటుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంలో తన సత్తా చూపించేందుకు, కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో అత్యంత కీలకమైన ఆత్మకూరు నుంచే తన రాజకీయ చతురత చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆత్మకూరు జెడ్పీటీసీ, ఎంపీపీ, మరో ఇద్దరు ఎంపీటీసీలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ప్రత్యర్థులకు ఊహించని షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ముందుముందు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు ఉంటాయని అనుచరులు ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
బీఆర్ఎస్ నుండి పలువురు సస్పెన్షన్..
బీఆర్ఎస్ పార్టీ నుండి ఆత్మకూరు మండల ఎంపీపీ మార్క సుమలత రజినీకర్, జెడ్పీటీసీ కక్కెర్ల రాధిక రాజు, నీరుకుళ్ల ఎంపీటీసీ అర్షం వరుణ్ గాంధీలను సస్పెండ్ చేస్తున్నట్లు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి తెలిపారు. పార్టీకి నష్టం వాటిల్లే కార్యకలాపాలు, పార్టీకి నమ్మకద్రోహం చేసినందుకే పార్టీ నుండి సస్పెండ్ తెలిపారు. వీరందరూ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని తెలిసిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా.. పరకాలలో చల్లాకు హ్యాట్రిక్ విజయం ఖాయమని అనుకుంటున్న తరుణంలో ఈ పరిణామాలు బీఆర్ఎస్‌లో కలకలం రేపుతున్నాయి.