Tuesday, June 18, 2024

గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డికి భారీ షాక్‌!

Must Read
  • బీఆర్ఎస్‌లో కొన‌సాగుతున్న రాజీనామాలు
  • పార్టీకి రేగొండ‌ ఎంపీపీ దంప‌తుల రాజీనామా
  • గండ్ర సోద‌రులు స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి, సాయిరెడ్డి..
  • ఇద్ద‌రు స‌ర్పంచ్‌లతోపాటు ప‌లువురు నాయ‌కులు కూడా..
  • రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరిక
  • ఏక‌మ‌వుతున్న తెలంగాణ ఉద్య‌మ‌కారులు
  • భూపాల‌ప‌ల్లిలో గులాబీద‌ళం డీలా..
  • హ‌స్తం పార్టీలో ఫుల్ జోష్‌

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ఎన్నిక‌ల ముంగిట భూపాల‌ప‌ల్లి నియోజ‌వ‌క‌ర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించ‌ని ఎదురుదెబ్బలు త‌గులుతున్నాయి. ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కాంగ్రెస్ గూటికి చేరుకునేందుకు క్యూ క‌డుతున్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో గులాబీద‌ళం డీలా ప‌డిపోతుండ‌గా కాంగ్రెస్‌లో ఫుల్ జోష్ క‌నిపిస్తోంది. తాజాగా, రేగొండ మండ‌ల ఎంపీపీ దంప‌తులు పున్నం ల‌క్ష్మి, ర‌వి బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. శ‌నివారం రాత్రి హైద‌రాబాద్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా, గ‌ణ‌పురం మండ‌లం క‌ర్క‌ప‌ల్లి స‌ర్పంచ్ పొట్ల న‌గేష్‌, చిట్యాల మండ‌లం జ‌డ‌ల్‌పేట స‌ర్పంచ్ కామిడి ర‌త్నాక‌ర్‌రెడ్డి(స‌ర్పంచ్‌ల ఫోరం మండ‌ల ప్రెసిడెంట్‌), గ‌ణ‌పురం మండ‌లం చెల్పూర్ గ్రామానికి ఎమ్మెల్యే వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి సోద‌రులు సింగిల్ విండో చైర్మన్, ఓడీసీఎంఎస్ డైరెక్టర్ గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి, గండ్ర సాయిరెడ్డి, ప‌ర‌కాల మార్కెట్ క‌మిటీ మాజీ చైర్మ‌న్‌, బీజేపీ స్టేట్ కౌన్సిల్ స‌భ్యుడు చాడ రఘునాథ‌రెడ్డిలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి షాక్ ఇచ్చారు. మ‌రో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్‌లోకి భారీగా చేరిక‌లు ఉంటాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఈ ప‌రిణామాలు ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డికి అత్యంత ప్ర‌తికూలంగా మారుతున్నాయని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్ క‌నిపిస్తోంది. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావుకు తిరుగులేని విజ‌యం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర‌
తెలంగాణ రాష్ట్రా సాధ‌న ఉద్య‌మంలో పున్నం ర‌వి అత్యంత కీల‌క పాత్రో పోషించారు. అనేక నిర్బంధాలు, లాఠీదెబ్బ‌లు, కేసులు ఎదుర్కొంటూ తెలంగాణ రాష్ట్ర సాధ‌నే ధ్యేయంగా ఆయ‌న ముందుకు వెళ్లారు. 2001లో మొద‌లైన ఆయ‌న ప్ర‌స్థానం.. ఎంత ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదురైనా.. త‌ట్టుకుని నిల‌బ‌డి రాష్ట్ర సాధ‌న కోసం క‌ల‌బ‌డ్డారు. ఇలా.. భూపాలప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీల‌క పాత్ర పోషించారు. దాదాపు 16ఏళ్ల‌పాటు రేగొండ మండ‌ల బీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడిగా కొన‌సాగారు. మండ‌ల జేఏసీ క‌న్వీన‌ర్‌గా ప‌నిచేశారు. ఈ క్ర‌మంలో 369రోజుల పాటు దీక్ష‌లు చేసిన ఘ‌న‌త సాధించారు. అలాగే, 2001లో రేగొండ మండ‌లం రంగ‌య్య‌ప‌ల్లి టీఆర్ఎస్ ఎంపీటీసీగా పున్నం ర‌వి, 2013లో రంగ‌య్య‌ప‌ల్లి స‌ర్పంచ్‌గా ఆయ‌న భార్య పున్నం ల‌క్ష్మి, 2019లో గ్రామ ఎంపీటీసీగా పున్నం ల‌క్ష్మి గెలిచి సిరికొండ మ‌ధుసూద‌నాచారి చొర‌వ‌తో రేగొండ ఎంపీపీగా బాధ్య‌త‌లు చేప‌ట్టి కొన‌సాగుతున్నారు. ఇలా అప్ప‌టి నుంచి పున్నం ర‌విదంప‌తులు ప్ర‌జాజీవితంలో ఉన్నారు. అయితే.. మొద‌టి నుంచి బీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, తెలంగాణ తొలి స్పీక‌ర్, ఎమ్మ‌ల్సీ సిరికొండ మ‌ధుసూద‌నాచారి కీల‌క అనుచ‌రుడిగా పున్నం ర‌వికి గుర్తింపు పొందారు. అంతే స్ఫూర్తిగా పార్టీలో కొన‌సాగారు.

ఉద్య‌మ‌కారుల‌కు అవ‌మానాలు…
ప్ర‌స్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి ఉద్య‌మ‌కారుల‌కు త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌కుండా అవ‌మాన‌ప‌ర్చార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అంతేగాకుండా, ప‌లువురిపై అకార‌ణంగా కేసులు పెట్టించి వేధించార‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఇందులో ప్ర‌ధానంగా సిరికొండ మ‌ధుసూద‌నాచారి వ‌ర్గాన్ని గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి ఎక్కువ‌గా టార్గెట్ చేశార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే అనేక మంది ఉద్య‌మ‌కారులు, ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. ఇందులో భాగంగానే.. రేగొండ మండ‌ల బీఆర్ఎస్ పార్టీలోకి అత్యంత కీల‌క నేత‌గా ఉన్న పున్నం ర‌విదంప‌తులు కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డికి ఇక క‌ష్ట‌కాలం మొద‌లైన‌ట్టేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన అనేకమంది కీల‌క నేత‌లు కాంగ్రెస్ పార్టీలోకి క్యూక‌డుతుండ‌డంతో గులాబీద‌ళం రోజురోజుకూ డీలా ప‌డిపోతోంద‌ని అంటున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img