Monday, June 17, 2024

మానుకోట కాంగ్రెస్‌లో జోష్

Must Read
  • కాంగ్రెస్ అభ్య‌ర్థి ముర‌ళీనాయ‌క్‌కు శ్రేణుల బ్ర‌హ్మ‌ర‌థం
  • ఉన్న‌త విద్యావంతుడిగా, సౌమ్యుడిగా,
    వైద్యుడిగా క్లీన్ ఇమేజ్
  • కలిసిరానున్న కుటుంబ నేప‌థ్యం
  • గెలుపు బాధ్య‌త‌ను భుజానికెత్తుకున్న‌
    డీసీసీ అధ్య‌క్షుడు భ‌ర‌త్‌చంద‌ర్‌రెడ్డి
  • పార్టీలోకి జోరుగా కొన‌సాగుతున్న చేరిక‌లు
  • ఈసారి కాంగ్రెస్ సునామీని ఎవ‌రూ అడ్డుకోలేర‌ని నేతల ధీమా..

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ఉద్య‌మ ఖిల్లా.. ఒకప్పటి కంచుకోట మానుకోటలో మ‌ళ్లీ కాంగ్రెస్ పూర్వ వైభ‌వం పొంద‌నుందా..? బ‌ల‌మైన పార్టీ నిర్మాణం, ఊరూరా క్యాడ‌ర్ ఉన్న‌ప్ప‌టికీ గ్రూపు త‌గాదాల‌తోనే రెండుసార్లు చేజారిన అధికారాన్ని ఈ ఎన్నిక‌ల్లో తిరిగి హ‌స్త‌గ‌తం చేసుకోనుందా..? ఓవైపు చేరిక‌ల జోరు.. మ‌రోవైపు నేత‌ల ఐక్య‌తారాగమే ఇందుకు సంకేత‌మా..? అంటే మానుకోట నియోజ‌క‌వ‌ర్గంలో తాజాగా చోటుచేసుకుం టున్న ప‌రిణామాలు ఔననే అంటున్నాయి. మానుకోట కాంగ్రెస్ టికెట్ కోసం కేంద్ర మాజీ మంత్రి బ‌ల‌రాంనాయ‌క్‌, జాతీయ నేత బెల్ల‌య్య‌నాయ‌క్‌, డాక్ట‌ర్ ముర‌ళీనాయ‌క్ ప్ర‌ధానంగా పోటీప‌డ్డారు. అయితే.. కుటుంబ నేప‌థ్యం, ప్ర‌జ‌ల‌తో ఉన్న సంబంధాల‌తోపాటు అనేక అంశాల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత హైక‌మాండ్ అనూహ్యంగా కాంగ్రెస్ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ ముర‌ళీనాయ‌క్ పేరు ప్ర‌క‌టించింది. ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌కు ధీటుగా డాక్ట‌ర్ మురళీనాయ‌క్‌ను పోటీకి దింపింది. ఉన్న‌త విద్యావంతుడిగా, అజాత శ‌త్రువుగా, సౌమ్యుడిగా, పార్టీలోని నాయ‌కులంద‌రినీ క‌లుపుకుపోయే నేత‌గా డాక్ట‌ర్ ముర‌ళీనాయ‌క్‌కు పేరుంది. అంతేగాక వైద్యుడిగా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో మంచి సంబంధాలున్నాయి. మ‌రోప‌క్క త‌న తండ్రి దగ్గర నుంచి ఇప్పటి వరకు కుటుంబం మొత్తం కాంగ్రెస్‌ను అంటిపెట్టుకొని ఉంది. ఈక్ర‌మంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్ట‌ర్ మురళీ నాయక్‌పై ప్ర‌జల్లో ఉన్న క్లీన్ ఇమేజ్ త‌మ‌కు క‌లిసివ‌స్తుంద‌ని, ఈ ఎన్నిక‌ల్లో మానుకోట‌లో కాంగ్రెస్ సునామీని అడ్డుకోవ‌డం ఎవ‌రిత‌రం కాదని ఆపార్టీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. రోజురోజుకు కాంగ్రెస్‌లోకి పెరుగుతున్న వ‌ల‌స‌లే ఇందుకు నిద‌ర్శన‌మ‌ని చెబుతున్నారు.

పట్టువదలని విక్రమార్కుడు

డాక్టర్ ముర‌ళీనాయ‌క్ 2014 ఎన్నికల సమయంలోనే మానుకోట అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అప్పుడు పార్టీ మాలోత్ కవితకు టికెట్ కేటాయించ‌గా, ఆమె గెలుపు కోసం తీవ్రంగా శ్ర‌మించారు. అయినప్పటికీ కవిత ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లోనూ టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ అధిష్టానం మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్‌కు కేటాయించింది. దీంతో మ‌రోమారు పార్టీ నిర్ణ‌యాన్ని గౌర‌వించి ఆ ఎన్నికల్లోనూ పార్టీ సూచించిన వ్యక్తికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రెండుసార్లు టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ దక్కకపోగా ఎలాంటి అసంతృప్తికి లోను కాకుండా అధిష్టానం సూచన మేరకు పని చేశారు. పార్టీకి విధేయుడిగా ఉంటూనే మానుకోట నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ బ‌లోపేతం కోసం శ‌క్తివంచ‌న లేకుండా కృషిచేశారు. ఈక్ర‌మంలోనే ముర‌ళీనాయ‌క్ పని తీరును గుర్తించిన కాంగ్రెస్ హైక‌మాండ్ ఈ ఎన్నిక‌ల్లో మానుకోట అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించింది. పట్టువదలని విక్రమార్కుడిగా టికెట్ సాధించిన ముర‌ళీనాయ‌క్ ఇక ఎన్నికల్లోనూ ఘ‌న విజయం సాధించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అంతకు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగుతున్నారు.

కలిసిరానున్న కుటుంబ నేపథ్యం..

డాక్ట‌ర్ ముర‌ళీనాయ‌క్ కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉంది. ముర‌ళీనాయ‌క్ తండ్రి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి మానుకోట జెడ్పీటీసీగా గెలుపొందారు. అంతేగాక ముర‌ళీనాయ‌క్ భార్య ఉమ‌ కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్‌గా విజయం సాధించి మానుకోట మున్సిపల్ తొలి చైర్ పర్సన్‌గా రికార్డు సృష్టించారు. ఆమె మున్సిపల్ చైర్ పర్సన్‌గా పనిచేసిన సమయంలో పార్టీలకు అతీతంగా అందరితో మ‌మేకం అయ్యేవార‌న్న పేరుంది. స్థానికుడైన ముర‌ళీనాయ‌క్ పట్టణంలో ప్ర‌ముఖ వైద్యుడిగా అందరికీ సుపరిచితుడు. వైద్యుడిగా మానుకోటతోపాటు డోర్నకల్ నియోజకవర్గంలోనూ ఆయ‌న‌కు మంచి గుర్తింపు ఉంది. ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం డాక్టర్ ముర‌ళీనాయ‌క్ విజయానికి దోహదపడే అవకాశం ఉంది. మ‌రోప‌క్క మురళీనాయక్‌కు కాంగ్రెస్‌తోపాటు అన్ని పార్టీలు, సంఘాల నేత‌ల‌తో మంచి సంబంధాలున్నాయి. ఇవి కూడా ఎన్నిక‌ల్లో డాక్ట‌ర్ ముర‌ళీనాయ‌క్‌కు సానుకూలంగా మార‌నున్నాయి.

అంతా కాంగ్రెస్ గ్రూపే..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మానుకోట నియోజకవర్గంలో అనేక ఇబ్బందులు పడ్డారు. కొంద‌రు పార్టీ మార‌గా, మ‌రికొంద‌రు అరెస్టులు, కేసులపాలు అయ్యారు. ఈక్ర‌మంలోనే మానుకోట కాంగ్రెస్ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ ముర‌ళీనాయ‌క్ పేరు ప్ర‌క‌టించ‌డంతో పార్టీ నాయ‌కులంతా యాక్టివ్ అయ్యారు. మ‌రోప‌క్క పార్టీని వ‌ద‌లివెళ్లిన వారుకూడా తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. అంతేగాక అన్ని మండ‌లాల్లో అధికార పార్టీతోపాటు ఆయా పార్టీల్లో కీల‌క నాయ‌కులు, ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈక్ర‌మంలోనే సొంత పార్టీలోని ముఖ్య నేత‌లంతా ఒక్క‌ట‌వుతున్నారు. గతంలోలాగా గ్రూపుల కొట్లాటకుపోయి ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడద‌ని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ముందుకుసాగుతున్నారు. నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులంతా ఏక‌తాటిపైకి వ‌చ్చి మురళినాయక్ వెంట నడుస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ సైతం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడిన తర్వాత సానుకూలంగా ఉన్నారు. మురళీనాయక్ గెలుపే లక్ష్యంగా ముందుకుసాగుతామని చెబుతున్నారు. ఈక్రమంలోనే మానుకోట, నెల్లికుదురు, గూడూరు, కేసముద్రం, ఇనుగుర్తి ఇలా ఏ మండలానికి వెళ్లినా మురళీనాయక్ ప్రచారానికి కాంగ్రెస్ శ్రేణులు జైకొడుతున్నారు. ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

అన్నీతానై..

మానుకోట నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్య‌త‌ను డీసీసీ అధ్య‌క్షుడు భ‌ర‌త్‌చంద‌ర్‌రెడ్డి భుజాని కెత్తుకున్నారు. జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయ‌న ప్ర‌చారంతోపాటు చేరిక‌ల విష‌యంలో అన్నీ తానై కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఓప‌క్క నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేస్తూనే, మ‌రోప‌క్క పార్టీ అభ్య‌ర్థి ముర‌ళీనాయ‌క్ గెలుపు కోసం వ్యూహాలు ర‌చిస్తున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ నేత‌ల ను ఆక‌ర్షించ‌డంపై ప్ర‌త్యేక దృష్టిసారించి విజ‌య‌వంతంగా అమలు చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌కుడు, రెడ్యాల గ్రామ స‌ర్పంచ్ వెన్నం శ్రీకాంత్‌రెడ్డి పార్టీ గెలుపు కోసం శ్ర‌మిస్తున్నారు. గ‌తం లో బీఆర్ఎస్ పార్టీ మండ‌ల అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. మానుకోట ప్రాంతంలోని ఆయా పార్టీల నేత‌ల‌తోనూ మంచి సంబంధాలున్నాయి. ఇవ‌న్నీకూడా కాంగ్రెస్ అభ్య‌ర్థికి క‌లిసిరానున్నాయి. ఈక్ర‌మంలో నే మానుకోట కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాల‌యంలో మునుపెన్న‌డూ లేనంత సందడి నెల‌కొంది. ప్ర‌తి రోజు ఆయా పార్టీల నాయ‌కుల చేరిక‌ల‌తో కోలాహ‌లంగా మారుతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img