Monday, June 17, 2024

వ‌రంగ‌ల్ తూర్పులో గెలుపు నాదే..

Must Read

– తూర్పున ఎగిరేది గులాబీ జెండానే..
– అభివృద్ధి ప‌నులే మ‌ళ్లీ గెలిపిస్తాయ్‌
– ఇక కాంగ్రెస్‌, బీజేపీల అడ్ర‌స్ గ‌ల్లంతే..
– నాన్‌లోకల్ అభ్య‌ర్థుల‌ను జ‌నం ఆద‌రించ‌రు
– ఓట్లు అడిగే నైతిక హ‌క్కు వారికి లేదు
– నేను ప‌క్కా లోకల్‌!
– వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే, బీఆర్ఎస్‌ అభ్య‌ర్థి న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌
– అక్ష‌ర‌శ‌క్తికి స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : అభివృద్ధికే ప‌ట్టం క‌ట్టేందుకు జ‌నం సిద్ధంగా ఉన్నారు. వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో రెండోసారీ గులాబీ జెండా ఎగుర‌వేస్తాం. రూ.4వేల కోట్ల‌కుపైగా నిధుల‌తో చేప‌ట్టిన అభివృద్ధి ప‌నులే న‌న్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయి. వ‌రంగ‌ల్ తూర్పు ప్ర‌జ‌ల‌ను అవ‌మాన‌ప‌ర్చిన కాంగ్రెస్ అభ్య‌ర్థి కొండా సురేఖకు ఓట్లు అడిగే నైతిక హ‌క్కులేదు. ఈ ఎన్నిక‌ల్లో ఆమెను చిత్తుగా ఓడించేందుకు జ‌నం సిద్ధంగా ఉన్నారు. ఇక తూర్పులో బీజేపీ జాడే లేదు. ఆ పార్టీ అభ్య‌ర్థి ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్‌రావును ఎవ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. రెండోసారీ నేనే గెలుస్తా.. వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్నిరంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్దుతా.. అని తూర్పు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్య‌ర్థి న‌న్న‌పునేని న‌రేంద‌ర్ ధీమా వ్య‌క్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం తుదిద‌శ‌కు చేరుకున్న త‌రుణంలో.. అక్ష‌ర‌శ‌క్తి ప‌త్రిక‌తో ఆయ‌న ప్ర‌త్యేకంగా మాట్లాడారు.

 • ప్ర‌శ్న‌: మీ ఎన్నిక‌ల‌ ప్ర‌చారానికి ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న ఎలా ఉంది?
  న‌రేంద‌ర్ : వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు గొప్ప‌గా ఆలోచిస్తారు. జ‌నం కోసం ప‌నిచేసిన నాయ‌కుడికే అండ‌గా ఉంటారు. అభివృద్ధి చేసిన పార్టీనే ఆద‌రిస్తారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల స‌హ‌కారంతో నియోజ‌క‌వ‌ర్గంలో కోట్లాది రూపాయల‌తో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాం. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ సంక్షేమ ఫ‌లాలు అందించాం. అందుకే ఈరోజు బీఆర్ఎస్‌ను జ‌నం అద్భుతంగా ఆద‌రిస్తున్నారు. ఎక్క‌డికి వెళ్లినా.. ఎవ‌రిని ప‌ల‌క‌రించినా.. అన్నా.. అభివృద్ధికే మా ఓటు.. మ‌ళ్లీ మిమ్మ‌ల్నే గెలిపించుకుంటాం.. అంటూ సంతోషంగా చెబుతున్నారు. స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. సంస్థ‌లు, సంఘాలు.. ఏక‌గ్రీవంగా తీర్మానాలు చేస్తున్నాయి. ఇలా ఒక పార్టీ అభ్య‌ర్థికి గ‌తంలో ఎన్న‌డూ ఇలాంటి ఆద‌ర‌ణ ల‌భించ‌లేద‌ని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌చారం తుది ద‌శ‌కు చేరుకుంది. నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని డివిజ‌న్ల‌లో ప్ర‌చారం చేప‌ట్టాం. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ చేరుకున్నాం. మా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బీఆర్ఎస్ గెలుపుకోసం కృషి చేస్తున్నారు.
 • ప్ర‌శ్న‌: రెండోసారి న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌కు ఓటెందుకు వేయాలి?
  న‌రేంద‌ర్ : నేను ఇక్క‌డే పుట్టిపెరిగిన‌. పేద‌రికం నుంచి ఎదిగిన‌వాడిని. ఇక్క‌డి ప్ర‌జ‌ల క‌ష్ట‌సుఖాలు తెలుసు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌రిక నిర్మూల‌నే నా ధ్యేయం. అందుకే కార్పొరేట‌ర్‌గా, మేయ‌ర్‌గా, ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టా. కుల‌మ‌తాలు, రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌జ‌ల‌కు సేవ చేశా. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల స‌హ‌కారంతో కోట్లాది రూపాయ‌లు తీసుకొచ్చి ప‌నులు చేప‌ట్టా. వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో రూ.4100కోట్లతో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టా. కలెక్టరేట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, 24 అంత‌స్తుల సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌, రింగ్ రోడ్, నూత‌న బ‌స్టాండ్ నిర్మాణం, ప్రతి వాడన రోడ్లు, ఏడు గురుకులాలు.. ఇలా మరెన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో 22వందల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు క‌ట్టించాం. పేదలకు అందిస్తాం. జ‌ర్న‌లిస్టుల‌కు కూడా డ‌బుల్‌బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాం. ఏండ్ల కొద్ది పాలించిన గ‌త పాల‌కులు చేయ‌లేని అనేక అభివృద్ధి ప‌నులు నేను చేసి చూపించా. మీరు చూడండి..ఈ రోజు ఏ గ‌ల్లీకి వెళ్లినా.. సీసీ రోడ్లు క‌నిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఒక విజ‌న్‌తో చేసిన ప‌నులే. ఇన్ని ప‌నులు చేశాం కాబ‌ట్టే.. మ‌ళ్లీ ఓటు కోసం జ‌నం వ‌ద్ద‌కు ధైర్యంగా వెళ్తున్నాం. వ‌రంగ‌ల్ తూర్పు ప్ర‌జ‌లు కూడా అభివృద్ధి ప‌ట్టం క‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేగాకుండా, ఈసారి మా ఎన్నిక‌ల మేనిఫెస్టోలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మ‌రెన్నో అద్భుత‌మైన ప‌థ‌కాలు పొందుప‌ర్చారు. అధికారంలోకి రాగానే అమ‌లు చేసి తీరుతాం.
 • ప్ర‌శ్న : బీజేపీ, కాంగ్రెస్ అభ్య‌ర్థులు స్థానికులు కాద‌ని ప‌దేప‌దే అంటున్నారు. ఎందుకు?
  న‌రేంద‌ర్ : అవును. కాంగ్రెస్‌, బీజేపీ అభ్య‌ర్థులిద్ద‌రూ స్థానికులు కాదు. కాంగ్రెస్ అభ్య‌ర్థి కొండా సురేఖ‌ది వంచ‌న‌గిరి. బీజేపీ అభ్య‌ర్థి ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్‌రావుది ప‌ర్వ‌తగిరి. వీళ్లిద్ద‌రూ ఏరోజు కూడా తూర్పు ప్ర‌జ‌ల క‌ష్ట‌సుఖాల్లో పాలుపంచుకోలేదు. జ‌నం కోసం ప‌నిచేయ‌లేదు. ఇక్క‌డ మీకు మ‌రో విష‌యం చెప్పాలి. తూర్పుకు వెళ్లి త‌ప్పు చేశాను.. అంటూ కొండా సురేఖ 2018 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప‌ర‌కాల‌లో అన్నారు. అంటే తూర్పు ప్ర‌జ‌ల‌ను అవ‌మానించిన‌ట్టేక‌దా.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌పై న‌మ్మ‌కంలేన‌ట్టేక‌దా..! అలా అవ‌మానించిన కొండా సురేఖ‌.. మ‌ళ్లీ ఇప్పుడు ఇక్క‌డికి ఎందుకొచ్చారు? ఇదంతా కూడా ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో, వ‌ర‌ద ఆప‌ద‌లో జ‌నం మ‌ధ్య‌లో లేరు. ఇలాంటి వారికి ఓట్లు అడిగే నైతిక హ‌క్కే లేదు. నేను ప‌క్కా లోక‌ల్‌. నా ఇల్లు అండ‌ర్ రైల్వే గేట్ ద‌గ్గ‌రే ఉంటుంది. నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నా. వారి క‌ష్ట‌సుఖాల్లో పాలుపంచుకుంటున్నా. మీరంద‌రికీ తెలుసు. క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకున్నా. వ‌ర‌ద‌ల స‌మ‌యంలోనూ లోత‌ట్టు ప్రాంతాల్లో ప‌ర్య‌టించా. నా ఎత్తు వ‌ర‌ద వ‌స్తున్నా.. వెన‌క‌డుగు వేయ‌కుండా.. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాం. జ‌నం కోసం బ‌త‌క‌డం అంటే ఇదే క‌దా..! కానీ.. కాంగ్రెస్‌, బీజేపీ అభ్య‌ర్థులు ఎన్నడు కూడా జ‌నం కోసం ప‌నిచేయ‌లేదు. అందుకే వారికి ఓట్లు అడిగే నైతిక హ‌క్కులేదు.
 • ప్ర‌శ్న : ఈసారి కాంగ్రెస్ గాలి బ‌లంగా వీస్తుంద‌నే టాక్ వినిపిస్తోంది..? దీనిపై మీ కామెంట్‌?
  న‌రేంద‌ర్ : కాంగ్రెస్ లేదు.. గాలి అంత‌క‌న్నా లేదు..! ఇదంతా కూడా కావాల‌ని చేస్తున్న ప్ర‌చారం మాత్ర‌మే. కానీ క్షేత్ర‌స్థాయిలోకి వెళ్లి చూడండి. అర‌వై ఏళ్ల‌లో జ‌ర‌గ‌డ‌ని అభివృద్ధి.. కేవ‌లం ప‌దేళ్ల‌లో సీఎం కేసీఆర్ చేసి చూపించారు. ఈరోజు సంక్షేమ ఫ‌లం అంద‌ని గ‌డ‌ప‌లేదు. అభివృద్ధి జ‌ర‌గ‌ని వీధి లేదు. మీరు చూడండి.. మూడోసారి కూడా కేసీఆర్‌నే సీఎం చేయాల‌ని జ‌నం నిర్ణ‌యించుకున్నారు. మ‌ళ్లీ బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే రావాల‌ని కోరుకుంటున్నారు. అందుకే కారు గుర్తుకే ఓటు వేయాల‌ని న‌వంబ‌ర్ 30వ తేదీ కోసం జ‌నం ఎదురుచూస్తున్నారు. డిసెంబ‌ర్ 3వ తేదీన.. కాంగ్రెస్‌దంతా వ‌ట్టి గాలేన‌ని తేలిపోతుంది. ఇక వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోనూ జ‌న‌మంతా డిసైడ్ అయ్యారు. రెండోసారి న‌న్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరు చూడండి.. నేను భారీ మెజార్టీతో గెల‌వ‌బోతున్నా.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img