- ఎర్రబెల్లి స్వర్ణ, వరదరాజేశ్వర్‌రావు, నమిండ్లను కలిసిన పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు
- సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
- కలసికట్టుగా గెలుపే లక్ష్యంగా అడుగులు
- పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం
అక్షరశక్తి, వర్ధన్నపేట : వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులందరూ కలిసికట్టుగా ముందుకు కదులుతున్నారు. టికెట్ విషయంలో ఎవరికివారు చివరివరకూ ప్రయత్నాలు చేసినా.. అక్కడక్కడ కొన్ని విభేధాలు కనిపించినా.. నేడు వాటన్నింటినీ వదిలేసి.. ఐక్యంగా కాంగ్రెస్ సత్తాచాటే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే.. వర్ధన్నపేట కాంగ్రెస్ టికెట్ పొందిన ఎమ్మెల్యే అభ్యర్థి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఆదివారం.. పార్టీ నేతలు ఏఐసీసీ పరిశీలకులు ఉత్తమ్ రవీంద్రదల్వీ, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శోభ, పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ- వరదరాజేశ్వరరావు, వర్ధన్నపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు నమిండ్ల శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. అనంతరం నమిండ్ల శ్రీనివాస్ కేఆర్ నాగరాజును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ శ్రేణుల్లో సమరోత్సాహం
ఎన్నికల ముంగిట ఐక్యంగా ముందుకు కదలుతుండడంతో పార్టీ శ్రేణులు సమరోత్సాహంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా.. కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో కదులుతున్నారు. మొన్నటివరకూ ఎవరికివారుగా నియోజకవర్గంలో పర్యటించడంతో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే.. నేడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు, పార్టీ సీనియర్ నాయకుడు, వర్ధన్నపేట ఇన్చార్జి నమిండ్ల శ్రీనివాస్, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వరదరాజేశ్వరరావులు కలిసిపోవడంతో నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడిందని, ఇక అందరి లక్ష్యం కాంగ్రెస్‌ను గెలిపించడమేనని క్యాడర్ సంతోషపడుతోంది. ఇక నుంచి ఈ ఎన్నికల ప్రచారం హోరెత్తడం ఖాయమని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అయితే, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఆర్ నాగరాజు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. అన్నివర్గాల ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పథకాలను గడపగడపకూ తీసుకెళ్తున్నారు.