ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి
బాషబోయిన సంతోష్
అక్షరశక్తి, హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగాన్ని విస్మరించడం అన్యాయం అని ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బాషబోయిన సంతోష్ అన్నారు. మొత్తం బడ్జెట్లో కేవలం రూ. 19093 కోట్లు, (6.57 శాతం) మాత్రమే కేటాయించటం విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అద్దంపడుతోందన్నారు. గత సంవత్సరం 7.30 శాతం నిధులు కేటాయించి ఈ ఏడు పెంచాల్సింది పోయి మళ్ళీ తగ్గించడం సరికాదన్నారు. మొత్తం 30 శాతం నిధులు ప్రభుత్వ విద్యారంగానికి కేటాయించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు. ప్రాథమిక విద్యకు రూ. 16, 092 కోట్లు, ఉన్నత విద్యకు రూ. 3001 కోట్లతో మొత్తం విద్యా రంగం అభివృద్ధి ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. కేవలం కొన్ని గురుకులాలు చూపించి ఇదే మన విద్యా వృద్ధి అని చెప్పడం దివాళాకోరుతునమని మండిపడ్డారు. గత రెండు సంవత్సరాలుగా రూ. 3500 కోట్లు ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, మన ఊరు -మన బడి పథకానికి నిధుల మాటే లేదని, ఈ బడ్జెట్లో విద్యా రంగానికి తీవ్ర నిరాశే మిగిలిందని అన్నారు. అదేవిధంగా విద్యను కాషాయీకరణ చేసే నూతన జాతీయ విద్యా విధానం 2020ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మబలిదానాలతో కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో నేడు ప్రభుత్వ విద్యా రంగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం విద్యారంగానికి 17 శాతం కేటాయిస్తే, నేడు స్వరాష్ట్రం తెలంగాణలో ప్రభుత్వం 6.57 శాతం నిధులు కేటాయించడం సిగ్గుచేటన్నారు. కొఠారి కమిషన్ ప్రకారం ఖచ్చితంగా మొత్తం బడ్జెట్లో 30 శాతం నిధులు విద్యకు కేటాయించాలని, ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సవరణలు చేయాలని సంతోష్ డిమాండ్ చేశారు. లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.