Saturday, July 27, 2024

గులాబీ శిబిరంలో గుబులురేపుతున్న వ‌ల‌స‌ల ప‌ర్వం

Must Read
  • గులాబీ శిబిరంలో గుబులురేపుతున్న వ‌ల‌స‌ల ప‌ర్వం
  • పార్టీని వీడుతున్న ముఖ్య నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు
  • ఇటీవ‌లే కారుదిగిన జెడ్పీ చైర్‌ప‌ర్స‌న్ న‌ల్లాల భాగ్య‌ల‌క్ష్మి,
  • చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు
  • మొన్న టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన కార్పొరేట‌ర్ విజ‌యారెడ్డి
  • నిన్న పార్టీ వీడిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు,
  • క‌ర‌క‌గూడెం జెడ్పీటీసీ కాంతారావు
  • అప్ర‌మ‌త్త‌మైన అధిష్టానం
  • రంగంలోకి కేటీఆర్‌..!
  • అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన ప్ర‌తినిధి : అధికార టీఆర్​ఎస్ పార్టీకి షాక్​ల మీద షాక్​లు తగులుతున్నాయి. ఇటీవ‌ల వ‌రుస‌గా ప‌లువురు కీల‌క నేత‌లు కారు దిగిపోతుండ‌టం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. మొన్నటికి మొన్న జెడ్పీ చైర్మ‌న్‌గా ఉన్న న‌ల్లాల భాగ్య‌ల‌క్ష్మితోపాటు ఆమె భ‌ర్త, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే.. తాజాగా దివంగ‌త కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి పీ జ‌నార్ద‌న్‌రెడ్డి కుమార్తె, గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేటర్​ విజయారెడ్డి గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్​లో చేరిపోయారు. నిన్న మరో కీలక నేత, ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతోపాటు క‌ర‌క‌గూడెం జెడ్పీటీసీ కాంతారావు అధికార పార్టీతో తెగ‌దెంపులు చేసుకొని, హ‌స్తం గూటికి చేరారు. శుక్రవారం అనుచ‌రుల‌తో క‌లిసి హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈక్ర‌మంలోనే తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత, క‌నీస వేత‌నాల అమ‌లు బోర్డు చైర్మ‌న్ సామ వెంక‌ట‌రెడ్డి కూడా టీఆర్ఎస్‌ను వీడ‌నున్న‌ట్లు స‌మాచారం. అంతేగాక ఉమ్మ‌డి ఖ‌మ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెందిన ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చి, కాంగ్రెస్ కండువా క‌ప్పుకునేందుకు రెడీ అవుతున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

స్ఫ‌ష్ట‌మైన హామీతోనే చేరిక‌లు

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, పీసీసీ ఛీఫ్ రేవంత్‌రెడ్డితో సుదీర్ఘ చ‌ర్చ‌ల త‌ర్వాతే తాటి వెంకటేశ్వర్లు పార్టీ మారిన‌ట్లు తెలుస్తోంది. అశ్వారావుపేట నియోజకవర్గంలో మాస్ లీడర్‌గా గుర్తింపు ఉన్న తాటిని చేర్చుకోవ‌డం ద్వారా కాంగ్రెస్ మ‌రింత బ‌ల‌పడిన‌ట్లేన‌ని, టీఆర్ఎస్‌కు పెద్ద న‌ష్ట‌మేన‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇక కొద్ది వారాల క్రిత‌మే పార్టీలో చేరిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు చెన్నూరు కాంగ్రెస్ టికెట్ ఖాయమైందనే చర్చ సాగుతోంది. ఇక పీజేఆర్ కూతురు విజయారెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖైరతాబాద్ తరపున కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసే అవకాశం లభించిందని.. ఈ టికెట్‌పై రేవంత్ ఆమెకు స్పష్టమైన హామీ ఇవ్వడం వల్లే విజయారెడ్డి టీఆర్ఎస్‌కు టాటా చెప్పి హ‌స్తం పార్టీలో చేరారని వార్తలు వచ్చాయి.

దూకుడు పెంచిన కాంగ్రెస్‌..

ముంద‌స్తు ఎన్నిక‌ల ఊహాగానాల నేప‌థ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. అధికార టీఆర్ఎస్ టార్గెట్‌గా చేసుకుని చేరిక‌ల కార్య‌క్ర‌మాన్ని వ్యూహాత్మ‌కంగా అమ‌లుచేస్తోంది. ఆయా నేతలు పార్టీలో చేరే వ‌ర‌కు తెలియ‌కుండా గోప్య‌త‌ను పాటిస్తోంది. మ‌రికొద్ది రోజుల్లోనే ఉమ్మ‌డి ఖ‌మ్మం, పాల‌మూరు జిల్లాల నుంచి కూడా కాంగ్రెస్‌లోకి చేరిక‌లుంటాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. విడ‌త‌ల వారీగా చేరిక‌లుంటాయ‌ని, అధికార టీఆర్ఎస్‌తోపాటు బీజేపీకి చెందిన ముఖ్య నేత‌ల‌తోపాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నార‌నే టాక్ వినిపిస్తోంది. సగానికిపైగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని ఆపార్టీ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్న నేప‌థ్యంలో గులాబీ పార్టీకి చెందిన ముఖ్య నేత‌లు కాంగ్రెస్‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

రంగంలోకి కేటీఆర్‌..!

జిల్లాల వారీగా ముఖ్య నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు కాంగ్రెస్ గాలం వేస్తున్న నేప‌థ్యంలో టీఆర్ఎస్ అధిష్టానం అప్ర‌మ‌త్త‌మైంది. అస‌మ్మ‌తి నేత‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈక్ర‌మంలోనే ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాల‌మూరుకు చెందిన మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావుతో కేటీఆర్ భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. వీరివురూ టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్న‌నేప‌థ్యంలో ఆయా జిల్లాల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కేటీఆర్ వారిని క‌లిసి మాట్లాడ‌టం గ‌మ‌నార్హం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img