– నర్సంపేట, కొడకండ్ల, వంగర పీఎస్‌లో ఎస్‌హెచ్‌వో పోస్టులు ఖాళీ..
– సిబ్బంది కొరతతో పనిభారం
అక్షరశక్తి, హన్మకొండ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నర్సంపేట, కొడకండ్ల, వంగర పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలు లేక నెలలు గడుస్తోంది. కొడకండ్ల, వంగర పీఎస్‌లో ఎస్‌హెచ్‌వో పోస్టులు రెండు నెలలుగా ఖాళీగా ఉండగా, నర్సంపేటలో ఎస్సైలు లేక ఆరునెలలు గడుస్తోంది. దీంతో ఆయా స్టేషన్ల పరిధిలో కేసులు పేరుకుపోతున్నట్లు తెలుస్తోంది. కమిషనరేట్ పరిధిలో ఆరు నెలల కింద ఎస్ఐలు, సీఐల బదిలీలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా పది రోజుల క్రితం కూడా ట్రాన్స్‌పర్స్ జరిగాయి. అయినప్పటికీ ఈ మూడు పోలీస్ స్టేషన్లలోని ఎస్సై పోస్టులు ఖాళీగా ఉండటం డిపార్ట్‌మెంట్‌లో చర్చనీయాంశమవుతోంది. నర్సంపేట, కొడకండ్ల, వంగర పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించేందుకు ఎస్సైలు ముందుకు రాకపోవడానికి కారణమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ స్టేషన్లలో విధులు చేపట్టేందుకు ఎస్సైలు జంకుతున్నారా..? లేక శాఖాపరంగా ఇంకేమైనా ఇబ్బందులున్నాయా..? అనేది తేలడంలేదు. మొత్తంగా ఎస్సైలు లేకపోవడంతో ఆయా స్టేషన్లలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పే ప్రమాదం ఉందన్న వాదన వినిపిస్తోంది.
ఆమ్‌దాన్ తక్కువనే కారణమా..
హన్మకొండ జిల్లా వంగర పోలీస్ స్టేషన్‌లో గతంలో ఎస్సైగా విధులు చేపట్టిన నీలోజ్ వెంకటేశ్వర్లు బదిలీలో భాగంగా వరంగల్ జిల్లా దుగ్గొండి ఎస్ హెచ్‌వోగా వెళ్లారు. దీంతో వంగర పోలీస్ స్టేషన్‌లో ఎస్సై పోస్టు రెండు నెల్లుగా ఖాళీగా ఉంటోంది. అయితే.. స్టేషన్ పరిధిలో తక్కువ గ్రామాలుండటంతోపాటు ముఖ్యంగా ఆమ్‌దాని లేకపోవడంతోనే అక్కడికి వెళ్లేందుకు సబ్ ఇన్‌స్పెక్టర్లు ఆసక్తిచూపడంలేదని తెలుస్తోంది. అదేవిధంగా కొడకండ్ల పీఎస్‌లో విధులు నిర్వహించిన ఎస్సై బండి శ్రావణ్ బదిలీకాగా,
ఆయన స్థానంలో ఎవరూ పోస్టింగ్ తీసుకోకపోవడం గమనార్హం
నర్సంపేట పీఎస్‌లో ఆరునెలలుగా ఖాళీ..
నర్సంపేటలోని పోలీస్ స్టేషన్‌లో ఆరు నెలలుగా ఎస్సైల పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. ఐదుగురు ఎస్సైలకు పోస్టింగ్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ వరకు రిపోర్ట్ చేయకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఎస్సై ప్రవీణ్ రెండు నెలలు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహించారు. బదిలీల్లో భాగంగా ఆత్మకూరుకు వెళ్లిన ఆయన తర్వాత బదిలీపై ఎస్‌హెచ్వోగా పర్వతగిరికి వెళ్లారు. తాజాగా బదిలీల్లో ఇద్దరిని నర్సంపేటకు కేటాయించిన్పటికీ ఇద్దరు ఎస్సైలు నేటికీ రిపోర్ట్ చేయకపోవడం గమనార్హం. ఎస్సైలు రిపోర్ట్ చేయకపోవడానికి గల కారణమేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల వేధింపులు అధికంగా ఉండటం వల్లే ఇక్కడ ఎస్సైలు డ్యూటీచేసేందుకు ఆసక్తిచూపడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అంతేగాక స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తీరుతో కూడా ఇబ్బందులు తప్పవని భావించే ఇక్కడకు రావడానికి ఎస్సైలు జంకుతున్నారని డిపార్ట్‌మెంట్‌లో టాక్ వినిపిస్తోంది..