Saturday, July 27, 2024

వ‌రంగ‌ల్ వ‌ర‌ద‌ల్లో సాహ‌స పోలీస్‌

Must Read
  • రాత్రింబ‌వ‌ళ్లు స‌హాయ‌క చ‌ర్య‌లు
  • వంద‌లాదికుటుంబాల‌ను కాపాడిన మాన‌వీయ‌త‌
  • క్షేత్ర‌స్థాయిలో సీపీ ఏవీ రంగ‌నాథ్ ప‌ర్య‌ట‌న‌
  • నిరంత‌రం ప‌ర్య‌వేక్ష‌ణ‌
  • పోలీసుల‌పై జ‌నం ప్ర‌శంస‌ల‌వ‌ర్షం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో జ‌ల‌మ‌య‌మైన ఓరుగ‌ల్లు వ‌ర‌ద‌ల్లో పోలీసులు అస‌మాన ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించారు. చుట్టుముట్టిన వ‌ర‌ద‌ల్లో.. క‌మ్మేసిన కారుచీక‌ట్లో దిక్కుతెలియ‌క దారితోచ‌క బిక్కుబిక్కుమంటున్న వంద‌లాదికుటుంబాల‌ను కాపాడి త‌మ‌ మాన‌వీయ‌త‌ను చాటారు. వ‌ర‌ద‌కు ఎదురేగి రాత్రింబ‌వ‌ళ్లు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. స్వ‌యంగా వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తూ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్నారు. ప్ర‌ధానంగా వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంతోపాటు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో పోలీసులు కంటికికునుకులేకుండా ప్ర‌జ‌లకు అండ‌గా నిల‌బ‌డ్డారు. ఈ నేప‌థ్యంలో పోలీసులపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

క్షేత్ర‌స్థాయిలో సీపీ ప‌ర్య‌ట‌న‌.. ప‌ర్య‌వేక్ష‌ణ‌
వ‌రంగ‌ల్‌ను వ‌ర‌ద‌లు చుట్టుముట్ట‌గానే సీపీ ఏవీ రంగ‌నాథ్ రంగంలోకి దిగారు. పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. స్వ‌యంగా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటూనే నిరంత‌రం ప‌ర్య‌వేక్షించారు. ప్ర‌ధానంగా మొద‌టి రోజు వరంగల్ హంటర్ రోడ్డులోని ఎన్టీఆర్ కాల‌నీ, సాయినగర్ కాలనీ, సంతోషమాత కాలనీ, బృందావన్ కాల‌నీల్లో పూర్తిగా వరద నీరు రావడంతో స్థానిక పోలీస్ అధికారులతో కల్సి ట్రాక్టర్‌లో ప్రయాణించి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఏసీపి బోనాల కిషన్, మ‌ట్టెవాడ ఇన్‌స్పెక్ట‌ర్ ఇన్స్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సిబ్బందితో క‌లిసి బోట్ల‌లో ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. అదేవిధంగా హంట‌ర్‌రోడ్డులోని చుట్టూ వ‌ర‌ద‌లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్న గురుకుల క‌ళాశాలకు చెందిన 200 మంది విద్యార్థినుల‌ను సుబేదారి సీఐ సుకుర్ పాషా, గన్ మెన్ కుమార్‌తో క‌లిసి సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. అలాగే, వరంగల్ నగరంలో వరదలో చిక్కుకున్న 50 మందిని పోలీసులు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భగత్ సింగ్ కాలనీ, కాకతీయ యూనివర్సిటీ కళాశాల ప్రాంతాల్లో వరద చుట్టుముట్టడంతో ఇళ్లల్లో ఉండిపోయిన 20 కుటుంబాలను సత్వరమే స్పందించి కాపాడారు.

రాత్రింబ‌వ‌ళ్లు స‌హాయ‌క చ‌ర్య‌లు
పోలీసులు రాత్రింబ‌వ‌ళ్లు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్నారు. కంటికికునుకులేకుండా విధులు నిర్వ‌ర్తించారు. వరంగల్ రామన్నపేట మున్నూరు కాపు భవనం వద్ద వ‌ర‌ద‌లో చిక్కుకున్న‌ ఒకే కుటుంబానికి పదిమంది కుటుంబ సభ్యులను పోలీసులు కాపాడారు. ప‌దిమందిలో ముగ్గురు చిన్నారులు, అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ వృద్ధురాలు ఉండ‌గా రాత్రి 12:00గంట‌ల త‌ర్వాత సీపీ ఏవీరంగ‌నాథ్‌కు స్థానికుల నుంచి స‌మాచారం అంద‌డంతో వెంట‌నే స్థానిక పోలీసుల‌ను అల‌ర్ట్ చేశారు. వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ నేతృత్వంలో ఇంతే జారి గంజ్ సీఐ మల్లేష్, రెస్క్యూటీమ్ వారిని కాపాడారు. ఇక కాజీపేట డివిజన్‌లో ఏసీపీ డేవిడ్ రాజ్, డివిజన్ పరిధిలోని ఇన్స్పెక్టర్లు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. న‌డుముల్లోతు వ‌ర‌ద‌లోనూ వారిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. అలాగే, హన్మకొండ ఎస్సై కె కిషోర్ సిబ్బందితో క‌లిసి వాగ్దేవి కాలేజీ స‌మీపంలో వ‌ర‌ద‌లో చిక్కుకున్న సుమారు 12 కుటుంబాలను రక్షించారు. పెద్దమ్మ గడ్డ ఏరియాలో ఇళ్ల‌ను వ‌ర‌ద చుట్టుముట్ట‌డంతో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురైన స్థానికుల‌ను హ‌న్మ‌కొండ సీఐ కరుణాకర్ రావు, సిబ్బందితో క‌లిసి అత్యంత ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో వారికి కాపాడారు. వ‌ర‌ద త‌రుముకొస్తున్నా ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌కుండా కాపాడిన తీరుపై న‌గ‌ర‌వాసులు ప్ర‌శంస‌లు కురిస్తున్నారు.

క‌ల్లెడ గ్రామాన్ని కాపాడిన పోలీసులు
భారీ వ‌ర్షాల‌తో పర్వతగిరి మండలంలోని కల్లెడ రిజర్వాయర్‌లోకి భారీగా వ‌ర‌ద‌నీరు చేరింది. రిజర్వాయర్ కి గండి పడే ప్రమాదాన్ని గుర్తించిన ఎస్సై వీరభద్రం వెంటనే అప్ర‌మ‌త్తం అయ్యారు. రాత్రి నుండి ఉదయం 5గంటల వరకు తన సిబ్బంది, స్థానికులతో క‌లిసి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇదే స‌మ‌యంలో రిజర్వాయర్ నుండి నీరు బయటికి వెళ్లే మార్గాన్ని సుగమం చేసి కల్లెడ గ్రామాన్ని ముంపు నుంచి కాపాడారు. ఈ సంద‌ర్భంగా అత్యంత ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో స‌మ‌య‌స్ఫూర్తి ప్ర‌ద‌ర్శించి గ్రామాన్ని ముంపు నుంచి కాపాడిన ప‌ర్వ‌త‌గిరి పోలీసుల‌పై ప్ర‌జ‌లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

ప‌ర్యాట‌కుల‌ను కాపాడిన ములుగు పోలీసులు
ములుగు జిల్లా వెంక‌టాపురం మండ‌లంలోని ముత్యంధార జ‌ల‌పాతాన్ని చూడ‌డానికి వెళ్లిన ప‌ర్యాట‌కులు అక్క‌డే చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు వెంట‌నే ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం రంగంలోకి దిగారు. వాగు దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని, రెస్క్యూ బృందాలు వస్తున్నాయని ప‌ర్యాట‌కుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. ఎత్తయిన ప్రదేశంలో ఉండాలని, మొబైల్‌ బ్యాటరీలను భద్రపర్చుకోవాలని సూచించారు. బాధితులను సురక్షితంగా వెలుపలికి తీసుకొచ్చేందుకు ఏటూరునాగారం నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌, జిల్లా డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (డీడీఆర్‌ఎఫ్‌), బృందాలు నాలుగు బస్సుల్లో బయల్దేరాయి. బుధ‌వారం రాత్రి 11 గంటలకు వీరభద్రవరం చేరుకున్నాయి. అక్కడి నుంచి 8 కిలోమీటర్లు కాలినడకన బయలుదేరి సుమారు రాత్రి 1.30 గంటల సమయంలో అక్కడికి వెళ్లాయి. బాధితుల కోసం రెస్క్యూ బృందాలు ఆహారం, తాగునీరు, చిరుతిళ్లను వెంట తీసుకెళ్లాయి. అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య అర్ధరాత్రి దాటాక 2.20 గంటల సమయంలో బాధితులను కాపాడారు.
అదేవిధంగా, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామ్ నాయక్ తండాకు చెందిన రాశి అనే గర్భిణీ పురిటి నొప్పుల తో బాధపడుతుండ‌గా ఎస్సై తన వాహనంలో ఆమెను ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img