- నగరంలో నీట మునిగిన 30కిపైగా కాలనీలు
- బాధితులను సురక్షిత ప్రాంతాలకు
తరలించిన ఎన్‌డీఆర్ఎఫ్, పోలీసులు - ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు
- మత్తడి దుంకుతున్న ప్రధాన జలాశయాలు
- ఉమ్మడి జిల్లాకు రెడ్ అలర్ట్
- అధికారులంతా అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశాలు
- నేడు, రేపు విద్యాసంస్థలు బంద్
కుండపోత వర్షంతో ఓరుగల్లు వణికిపోతోంది. కుంభవృష్టితో నగరం నీట మునిగింది. భారీ వర్షాల కారణంగా వరంగల్, హన్మకొండలోని సుమారు 30కిపైగా కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సాయంకోసం బిల్డింగ్‌పైకి ఎక్కిన మహిళలు, వృద్ధులు, చిన్నారులను ఎన్డీఆర్ఎఫ్ టీంలు, వరంగల్ పోలీసులు కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనేక లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. హంటర్ రోడ్డు హన్మకొండ ప్రధాన రహదారి జలమయమైంది. మహబూబాబాద్ జిల్లాలోని ఆకేరు, మున్నేరు, పాలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
చిన్నగూడూరు వద్ద ఆకేరు వాగు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. వాగు ఒడ్డున గల గంగమ్మతల్లి ఆలయం నీట మునిగింది. కటాక్షపూర్ వద్ద వరదనీరు ప్రధాన రహదారిపైకి చేరడంతో వరంగల్- ఏటూరునాగారం మధ్య ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన జలాశయాలు మత్తడి దుంకుతున్నాయి. వ ర్షాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించగా, రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటికీ ప్రభుత్వం నేడు, రేపు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది.