- ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులు
- గ్రేటర్ కమిషనర్‌తో వాగ్వాదం
అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ వివాదం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది.
సోమవారం వరంగల్ కార్పొరేషన్‌లో ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులు ఆందోళనకు దిగారు. గ్రీవెన్స్ లో కమిషనర్ ప్రావీణ్యతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం వద్ద పైసలు లేకుంటే రైతులంతా బిచ్చం ఎత్తైనా ఇస్తామని, తమ భూములు లాక్కోవడం మానుకోవాలని పేర్కొన్నారు. రైతుల ప్రమేయం లేకుండా సర్వే నెంబర్లతో పత్రిక ప్రకటన ఎలా ఇచ్చారంటూ బాధిత రైతులు ప్రశ్నించారు. దీంతో జీడబ్ల్యూఎంసీలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పచ్చని పంటలు పండే భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొని రియల్ వ్యాపారం చేస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. తమ వ్యవసాయ భూముల జోలికి రావద్దని, తమ బతుకులను రోడ్డున పడేయొద్దని కోరారు. ల్యాండ్ పూలింగ్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కుడా చేపట్టిన ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య కార్యాచరణ సమితి జిల్లా కన్వీనర్ బుద్దె పెద్దన్న, బాధిత రైతులు పాల్గొన్నారు. అటు వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్ లో సైతం బాధిత రైతులు ఆందోళనకు దిగారు. వీరికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. నక్కలగుట్ట రోడ్డుపై బైఠాయించిన రైతులు నిరసన తెలిపారు.
Must Read