మేడారంలో ముందస్తు మొక్కులు
వనదేవతల దర్శనానికి తరలివస్తున్న భక్తులు
ఆదివారం ఒక్కరోజే రెండు లక్షల మందికి పైగా రాక
కిక్కిరిసిన క్యూలైన్లు.. జంపన్నవాగులో సందడి
అక్షరశక్తి, వరంగల్ : మేడారం మహాజాతర భక్తజన సంద్రంగా మారుతోంది. తెలంగాణ నుంచేగాకుండా దేశం నలుమూలల నుంచి ముందస్తు మొక్కుల కోసం భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో వనదేవతలు సమ్మక్క – సారలమ్మ దర్శనానికి రెండు లక్షల మందికిపైగా భక్తులు వచ్చినట్లుగా దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం తెల్లవారు జాము నుంచే మేడారం రహదారి వేలాది వాహనాలతో రద్దీగా మారింది.
ఉదయం 9గంటలకే జాతర ప్రాంగణంలోని క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గడ్, ఒడిషా జార్ఖండ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తలు తరలివస్తున్నారు. జంపన్నవాగు భక్తులతో సందడిగా మారింది. కుటుంబ సమేతంగా వస్తున్న భక్తులు వాగులో, స్నానఘట్టాల వద్ద స్నానమాచరిస్తున్నారు.
కరోనా నేపథ్యంలో ముందస్తు మొక్కులు
నిజానికి.. ఫిబ్రవరి 16 నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 16 న సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులను గద్దెలకు తీసుకొస్తారు. 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెల దగ్గరకు తీసుకొస్తారు. ఆ తర్వాత 18న సమ్మక్క – సారలమ్మలకు ప్రజలు మొక్కులు చెల్లిస్తారు. 19న అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. అయితే.. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు ముందస్తుగానే మేడారం తరలివస్తున్నారు.
జాతర సమయంలో లక్షలాదిగా తరలివచ్చే భక్తులు అమ్మవార్ల దర్శనానికి వస్తారు. ఆ సమయంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని భావిస్తున్న భక్తులు ముందస్తుగానే మేడారం చేరుకుని వనదేవతలకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది.