– మూడు నెలలుగా ఏసీపీ పోస్టు ఖాళీ..
– సీఐలు, ఎస్సైల కొరతతో పెరుగుతున్న పనిభారం
అక్షరశక్తి,హన్మకొండ క్రైమ్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కీలక అధికారుల పోస్టులు నెలల తరబడి ఖాళీగా ఉండటంతో పోలీసు వ్యవస్థ పనితీరుపై ప్రభావం పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వరంగల్ డివిజన్ ఏసీపీ పోస్టు మూడు నెలలకుపైగా ఖాళీగా ఉండటంతో పాటు పలు పోలీస్ స్టేషన్లలో సీఐలు, ఎస్సైలు లేకపోవడం వల్ల మిగిలిన అధికారులపై అదనపు పనిభారం పడుతోంది.
వరంగల్ డివిజన్ కమిషనరేట్‌లో అత్యంత కీలకమైన డివిజన్లలో ఒకటి. నగరంలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, వీఐపీ బందోబస్తు, చట్టవ్యవస్థ నిర్వహణ వంటి బాధ్యతలు ఈ డివిజన్ పరిధిలోనే ఉంటాయి. అలాంటి కీలక స్థానమైన ఏసీపీ పోస్టు మూడు నెలల పదిహేను రోజులుగా ఖాళీగా ఉండటంపై ప్రజలు, పోలీసు వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, వరంగల్ తూర్పు నియోజకవర్గం ఈ డివిజన్ పరిధిలో ఉండటంతో రాజకీయ కారణాల వల్లే నియామకం ఆలస్యం అవుతోందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇటీవల నెక్కొండ పోలీస్ స్టేషన్ ఎస్సై మహేందర్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు ప్రాథమికంగా నిజమని తేలడంతో ఆయనను సస్పెండ్ చేశారు. అంతకుముందు నందిరాం నాయక్, మట్టెవాడ సీఐ గోపి, నర్సంపేట సీఐలపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పలు కీలక పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో కమిషనరేట్‌లో అధికారుల కొరత మరింత పెరిగింది. ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇటీవల జరిగిన బదిలీలతో ఎస్సైతో పాటు ఇద్దరు సీఐలు ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతోంది. దీంతో ప్రజలకు అందాల్సిన సేవల్లో ఆలస్యం జరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జనగామ పోలీస్ డివిజన్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఏసీపీ పోస్టు రెండు నెలలుగా ఖాళీగా ఉంది. ఐపీఎస్ అధికారి పండరి చేతన్ నియతి బదిలీపై వెళ్లిన తర్వాత ఇప్పటివరకు కొత్త అధికారిని నియమించకపోవడంతో పరిపాలనా వ్యవహారాలపై ప్రభావం పడుతోందని సమాచారం. ఏసీపీ స్థాయి అధికారుల కొరత కారణంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు, లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ, క్రైమ్ సమీక్షలు, పోలీస్ స్టేషన్ల తనిఖీలు వంటి కీలక బాధ్యతల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఒకే అధికారి పలువురు అధికారుల బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు.
ప్రస్తుతం వరంగల్ ఏసీపీ పోస్టు మూడు నెలల పదిహేను రోజులుగా ఖాళీగా ఉండగా, ధర్మసాగర్ సీఐ ఏఆర్‌కు అటాచ్ అయి నెల రోజులు దాటింది. నర్మేట్ట సీఐ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. నెక్కొండ ఎస్సై సస్పెన్షన్‌కు గురై 20 రోజులు దాటినా కొత్త నియామకం జరగలేదు. వరుసగా ఖాళీలు ఏర్పడుతున్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలో జాప్యం కొనసాగుతుండటంతో పోలీసు శాఖ పనితీరుతో పాటు ప్రజలకు అందే సేవలపైనా ప్రభావం పడుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఖాళీగా ఉన్న ఏసీపీ, సీఐ, ఎస్సై పోస్టులను ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు ఎప్పుడు భర్తీ చేస్తారన్న ప్రశ్న పోలీసు వర్గాలలో వినిపిస్తోంది.
