అక్షరశక్తి, కాజీపేట : కాజీపేటలో దారుణం చోటుచేసుకుంది. రహమత్ నగర్‌కు చెందిన కన్నె విజయ (68) అనే వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడం స్థానికంగా కలకలంరేపింది. గురువారం రాత్రి అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో హత్య జరిగినట్లు సమాచారం. వృద్ధురాలి మెడలో బంగారం మాయమవడంతో నగల కోసమే హత్య జరిగినట్లు తెలుస్తోంది. బంగారం దోపిడీ కోసమే వృద్ధురాలిని కిరాతకంగా హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పంచనామ కోసం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా రెండు రోజుల కిందటే వరంగల్ కాశీబుగ్గలో నగలు, డబ్బు కోసం దుండగులు యువకుడిని హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే నగరంలో వృద్ధురాలి హత్య జరగడం కలకలంరేపింది.