- గ్రేటర్ వరంగల్‌లో పలువురు కార్పొరేటర్ల భూ దందా
- ఖాళీ జాగ కనిపిస్తే కబ్జా చేయడమే..!
- అమాయకులను బెదిరించి లాక్కోవడమే..!
- అధికారులు, బడానేతల సహకారంతో అక్రమంగా రిజిస్ట్రేషన్లు
- తీవ్ర ఆందోళనలో బాధితులు
- కఠినంగా వ్యవహరిస్తున్న సీపీ ఏవీ రంగనాథ్
- ఇప్పటికే ఇద్దరిపై కేసు నమోదు
- లిస్టులో మరో ఐదుగురు కూడా..?
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : గ్రేటర్ వరంగల్‌లో కొందరు కార్పొరేటర్లు భూదొంగలుగా అవతారమెత్తుతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తేచాలు కబ్జా చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. అమాయకులను బెదిరిస్తూ.. కొందరు బడాలనేతల, అధికారుల సహకారంతో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ పార్టీ.. ఆ పార్టీ అన్న తేడాలేదు. అన్నిపార్టీల్లోనూ భూదొంగలు నేతలు, ప్రజాప్రతినిధుల ముసుగులేసుకుని భూ ఆక్రమణలతో రెచ్చిపోతుంటే.. బాధితులు వణికిపోతున్నారు. కొన్నిచోట్ల బాధితులు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. వారు కూడా కబ్జాకోరులకే అండగా ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. వరంగల్ సీపీగా ఏవీ రంగనాథ్ వచ్చిన తర్వాత బాధితులకు భరోసా లభిస్తోంది. బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. బాధితులు స్వయంగా రాకున్నా.. వాట్సప్‌లో మెసేజ్ చేసినా.. సీపీ కార్యాలయం నుంచి స్పందన లభిస్తోంది. ఈ పరిణామాలతో కబ్జాకోరుల్లో వణుకుమొదలైంది.
- లిస్టులో మరో ఐదుగురు…
భూ కబ్జాలకు పాల్పడుతున్న కార్పొరేటర్లు, నేతలపై సీపీ ఏవీ రంగనాథ్ ప్రత్యేక దృష్టిసారించారు. బాధితుల నుంచి ఫిర్యాదు వస్తే.. అన్ని కోణాల్లో పరిశీలించి, ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్ వరంగల్ ఏడో డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్‌పై కేసు నమోదు చేయడం.. వెంటనే అరెస్టు చేయడం.. జైలుకు తరలించడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా గ్రేటర్ వరంగల్ కలకలం రేగింది. కబ్జాకోరుల్లో వణుకుమొదలైంది. ఆ తర్వాత వెంటనే శనివారం రాత్రి గ్రేటర్ వరంగల్ 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్‌యాదవ్‌పై కూడా మడికొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ విషయం కాస్తా ఆదివారం సాయంత్రం వెలుగులోకి రావడం గమనార్హం. వీరితోపాటు గ్రేటర్ వరంగల్‌కు చెందిన మరో ఐదుగురు కార్పొరేటర్లపై కూడా భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో మహిళా కార్పొరేటర్ సోదరుడు, మరో మహిళా కార్పొరేటర్ భర్త, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతకు అనుచరుడిగా గుర్తింపు పొందిన కార్పొరేటర్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వారికి సంబంధించిన భూ ఆక్రమణలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ విషయం గ్రేటర్ వరంగల్‌లో హాట్‌టాపిక్‌గా మారుతోంది. - సీపీ కార్యాలయం నుంచి ఫోన్?
తన ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు ఇద్దరు నేతలు ప్రయత్నం చేస్తున్నారని, అధికారులు తనను ఆదుకోవాలంటూ గత ఏడాదిన్నర కాలంగా వరంగల్ నగరం కాశీబుగ్గకు చెందిన ఓ దివ్యాంగుడు వేడుకుంటున్నాడు. పోలీసులకు, అధికారులకు మొరపెట్టుకుంటున్నాడు. అయితే, తనకు జరుగుతున్న అన్యాయంపై, తన ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్న వారి వివరాలు పొందుపరుస్తూ వాట్సప్‌లో మెసేజ్ పెట్టాడు. ఈ విషయం కాస్త సీపీ కార్యాలయానికి చేరడంతో ఏకంగా కార్యాలయం నుంచి బాధితుడికి ఫోన్ చేసి, ఫిర్యాదు స్వీకరించినట్లు చెప్పి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఈ ఒక్క ఘటన చాలు భూ కబ్జాకోరులపై వరంగల్ సీపీ రంగనాథ్ ఎంత సీరియస్‌గా ఉన్నారో చెప్పడానికి. ఈ క్రమంలోనే వరంగల్‌లోని అనేక మంది బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు ముందుముందు ఎలా ఉంటాయో చూడాలి మరి.